శ్రీశైలం టెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్లను సీబీఐ డైరెక్టర్(న్యూ ఢిల్లీ) ప్రవీణ్ సూద్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. మంగళవారం మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్‌సూద్ దంపతులకు ఆలయ రాజగోపురం వద్ద దేవస్థాన ఈఓ, అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం మల్లికార్జున స్వామివారికి అభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. వేదపండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. దేవస్థాన ఈఓ స్వామిఆమ్మవార్ల శేషవస్త్రాన్ని, లడ్డూప్రసాదాన్ని, జ్ఞాపికను అందించి సత్కరించారు.
రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్ డౌన్
కర్నూలు(సెంట్రల్): రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్ డౌన్ కావడంతో క్రయ, విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సర్వర్ పనిచేయకపోవడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు తీవ్ర ఆటంకం కలిగింది. ఈ క్రమంలో ఓటీపీలు సమయానికి రాకపోవడంతో వినియోగదారులు, అధికారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు స్లాట్‌బుకింగ్ సమయం మించిపోతే ఇబ్బందులు పడతామని క్రయ, విక్రయదారులు తీవ్ర ఆందోళన చెందారు. ఉమ్మడి జిల్లాలోని 24 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సర్వర్ నెమ్మదించినట్లు తెలుస్తోంది.
చింతకాయల కోసం వెళ్లి రైతు మృతి
శిరివెళ్ల: చింతకాయల కోసం వెళ్లిన ఓ రైతు కింద పడి మృతి చెందాడు. మంగళవారం యర్రగుంట్లలో ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. యర్రగుంట్లకు చెందిన శిరిగిరి ప్రతాపరెడ్డి ( 35 ) చింతకాయల కోసం స్థానిక దర్గా వద్ద ఉన్న చింత చెట్టు వద్దకువెళ్లాడు. చెట్టు ఎక్కి కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడ్డాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన అతడిని చికిత్స నిమిత్తం నంద్యాలకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించాడు. భర్త మరణ వార్త విన్న భార్య రాజేశ్వరి సోమ్మసిల్లి పడిపోయింది. కుటుంబాన్నికి పెద్ద దిక్కయిన రైతు మృతితో కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. మృతుడికి ఇద్దరు కుమారులున్నారు.
గోనెగండ్ల : మండలంలోని అలువాల గ్రామంలో భీరప్ప స్వామి దేవర ఉత్సవాలు మంగళవారం వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా భీరప్ప స్వా మికి భక్తులు ఉదయం నుంచే ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటి నుంచి గురువు బసవరాజు, పూజారి మల్లయ్య, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో పటం ఎక్కే కార్యక్రమం నిర్వహించారు. కురువ కులస్తులు వివాహం చేసుకోవాలంటే గుడి కట్ట సభ్యులకు పటం ఎక్కే కార్యక్రమం తప్పనిసరి కావడంతో కార్యక్రమానికి ప్రత్యేకత సంతరించుకుంది. ఉత్సవాలను తిలకించడానికి వివిధ గ్రామాల కురువ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చి వేడుకలను తిలకించారు. దేవర ఉత్స వాల సందర్భంగా నిర్వహించిన గొరవయ్యల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉత్సవాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ చంద్రబాబు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
ఎమ్మిగనూరులో పాలిసెట్ పరీక్షా కేంద్రాలు
ఎమ్మిగనూరురూరల్: ఎమ్మిగనూరు పట్టణంలో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆదోని పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్, కోఆర్డినేటర్ చిన్నపురెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో పాలిసెట్ ఎంట్రెన్స్ ఆదోని పట్టణంలో ఒక్కటే నిర్వహించేవారని చెప్పారు. విద్యార్థుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం 2026 నుంచి పాలిసెట్ ఎంట్రెన్స్ పరీక్షా కేంద్రాలను ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకునేటప్పుడుపై పరీక్షా కేంద్రాలను ఎంచుకోవచ్చునన్నారు.


