టౌన్‌ప్లానింగ్‌లో ఏసీబీ తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

టౌన్‌ప్లానింగ్‌లో ఏసీబీ తనిఖీలు

Mar 11 2026 7:53 AM | Updated on Mar 11 2026 7:53 AM

కర్నూలు(టౌన్‌): కర్నూలు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగంలో మంగళవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇటీవల ప్రభుత్వం బీపీఎస్‌ (బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీమ్‌), ఎల్‌ఆర్‌ఎస్‌ (లే అవుట్‌ రెగ్యులేషన్‌ స్కీమ్‌) పథకాలకు అనుమతి ఇవ్వడంతో కర్నూలు నగరంలో వేల సంఖ్యలో బీపీఎస్‌, ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు వచ్చాయి. వీటిని ఆన్‌లైన్‌లో క్లియర్‌ చేసేందుకు టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, ప్లానింగ్‌ కార్యదర్శులు, చైన్‌మెన్‌లపై ఫిర్యాదులు వస్తున్నాయి. అలాగే టీడీఆర్‌ (ట్రాన్స్‌ఫరబుల్‌ డెవలప్‌మెంట్‌ రైట్‌) బాండ్‌ల జారీ, భవన నిర్మాణాల అనుమతులు, నిర్మాణాల్లో అదనపు అంతస్థుల ఫిర్యాదుల్లో అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. మార్కెట్‌ వాల్యులో అవకతవకలకు పాల్పడి టీడీఆర్‌ బాండ్లు చేసినట్లు వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో కార్యాలయంలో ఏసీబీ అధికారులు సంబంధిత రికార్డులను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడారు. ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్‌, కృష్ణయ్య, శ్రీనివాస్‌లు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో సోదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఇటీవల టౌన్‌ ప్లానింగ్‌లో వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో అప్రూవల్స్‌ అనుమతులు, టీడీఆర్‌ల జారీలపై దృష్టి సారించి రికార్డులను పరిశీలించినట్లు స్పష్టం చేశారు. ఈ సోదాలు మూడు రోజుల పాటు కొనసాగుతాయని వెల్లడించారు. మొత్తం ఈ విభాగంలో 15 మంది ఉద్యోగులను విచారించినట్లు పేర్కొన్నారు. ఏసీబీ ఎస్‌ఐ సుబ్బరాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా మూడు గంటల పాటు ఏసీబీ అధికారులు కార్యాలయంలో తిష్ట వేసి రికార్డులను పరిశీలించారు. సోదాల్లో ఉద్యోగుల నుంచి రూ.లక్ష వరకు నగదు లభించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement