వాషింగ్టన్: భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ.. అమెరికా హృదయపూర్వక శుభాకాంక్షలను తెలిపింది. ఈ సందర్భంగా అమెరికా నేత మార్కో రూబియో మాట్లాడుతూ న్యూఢిల్లీ- వాషింగ్టన్ మధ్య ఉన్న సంబంధాన్ని చారిత్రాత్మక బంధంగా అభివర్ణించారు. రాబోయే ఏడాదిలో ఉమ్మడి లక్ష్యాలను సాధించేందుకు ఇరు దేశాలు కలిసి పని చేస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
అమెరికా ప్రజల తరఫున భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రూబియో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్-అమెరికా మైత్రి ప్రాముఖ్యతను ప్రత్యేకంగా తెలిపారు. రక్షణ, ఇంధనం, క్రిటికల్ మినరల్స్, అత్యాధునిక సాంకేతికత వంటి కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం అద్భుతమని రూబియో పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలే కాకుండా, క్వాడ్ (Quad) కూటమి ద్వారా జరుగుతున్న బహుముఖ చర్చలు ఇండో-పసిఫిక్ ప్రాంత అభివృద్ధికి, భద్రతకు దోహదపడుతున్నాయన్నారు. ఇరు దేశాల బంధం కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా, భవిష్యత్తులో ఇరు దేశాల ప్రగతికి దోహదపడుతుందన్నారు.
ఇదిలావుండగా గణతంత్ర వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. గురుగ్రామ్, చిల్లా, టిక్రి, సింఘు, బదర్‌పూర్ తదితర సరిహద్దుల వద్ద పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మరోవైపు, ఈ చారిత్రక దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతుండగా, ప్రజలు దేశభక్తి తో కూడిన వేడుకల్లో పాల్గొంటున్నారు.
ఇది కూడా చదవండి: కనిపించని ఆ నాలుగో సింహమే..


