కీలకమైన ‘ఖనిజ, ఏఐ’కూటమి
బ్రిటన్ సహా పలు దేశాల చేరిక
తాజాగా భారత్‌కూ ఆహ్వానం
అమెరికా కొత్త రాయబారి సెర్గియో గార్ ఇటీవల బాధ్యతల స్వీకరణ సందర్భంగా భారత్‌కు అందజేసిన ఆహ్వానం ప్రపంచ దేశాల దృష్టినీ ఆకర్షించింది. ‘అరుదైన ఖనిజ, ఏఐ’ కూటమి ‘పాక్స్ సిలికా’లో భారత్ చేరాలని ఆయన పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభిమతం కూడా ఇదేనని చెప్పుకొచ్చారు. దాంతో ఈ కూటమి ఒక్కసారిగా చర్చనీయంగా మారిపోయింది...
అరుదైన ఖనిజాలు. ప్రస్తుతం ప్రపంచమంతా కలవరిస్తున్న అత్యంత విలువైన సంపద ఇది. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు మొదలుకుని కృత్రిమ మేధ (ఏఐ)కు ప్రాణావసరాలైన పలు అత్యాధునిక పరికరాల దాకా అన్నింట్లోనూ అతి కీలక పాత్ర ఈ అరుదైన ఖనిజాలదే. దాంతో వాటిపై ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా దృష్టి సారిస్తున్నాయి. కానీ సిలికాన్, లిథియం వంటి ఈ అరుదైన ఖనిజ నిల్వలు ప్రస్తుతం చాలా తక్కువ దేశాల్లోనే అందుబాటులో ఉన్నాయి.
ముఖ్యంగా చైనాలో ఇవి విస్తారంగా చైనా ఖనిజ శుద్ధి కర్మాగారాలు, చైనా మార్కెట్ ఆధిపత్యం ఉన్న దేశాల్లో ఉన్నాయి. దాంతో కొంతకాలంగా ఆ దేశం ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగుతోంది. దీనికి చెక్ చెప్పడమే లక్ష్యంగా అమెరికా ఏర్పాటు చేసిన కూటమే పాక్స్ సిలికా. ఇందులో పాక్స్ అంటే శాంతి, సుస్థిరత, ప్రగతికి సూచిక అన్నది అమెరికా చెబుతున్న అర్థం. ఇక సిలికా అన్నది సిలికాన్‌కు ముడి ఖనిజమన్నది తెలిసిందే. కంప్యూటర్ చిప్స్ మొదలుకుని ఏఐ రంగం దాకా అన్నింట్లోనూ ఇప్పుడు సిలికాన్ కు ఉన్న అత్యంత ప్రాధాన్యత దృష్ట్యా కూటమికి ఆ పేరు పెట్టారు.
ఈ కూటమి ఏర్పాటులో అమెరికా ఆర్థిక వ్యవహారాల సహాయ మంత్రి జాకబ్ హెల్‌బర్గ్ కీలక పాత్ర పోషించారు. ‘20వ శతాబ్ది మొత్తం చమురు, స్టీల్ రాజ్యం చేస్తే 21వ శతాబ్ది అంతా అత్యాధునిక సూపర్ కంప్యూటర్లు, వాటి కీలక విడిభాగాల తయారీకి ఆయువుపట్లయిన అరుదైన ఖనిజాలదే’ అన్నది ఆయన అభిప్రాయం. ‘రానున్న ఏఐ ఆధారిత ప్రపంచంలో కీలకమైన ఈ అరుదైన ఖనిజాల తవ్వకం, వెలికితీత, అభివృద్ధి, సరఫరాలపై అదుపు సాధించేవారిదే పై చేయి’ అని హెల్‌బర్గ్ అన్నారు. సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసుకోవడంతో పాటు ఆర్థికంగా భవిష్యత్తును సురక్షితం చేసుకునేందుకు ఇది తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు.
లక్ష్యమేమిటి?
సభ్య దేశాలన్నీ కలిసి అరుదైన ఖనిజాలకు సంబంధించి ఒక ఆధారపడదగ్గ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నది పాక్స్ సిలికా ఏర్పాటు తాలూకు ఉద్దేశం. ఈ ఖనిజాల గుర్తింపు, వెలికితీత, శుదీ్ధకరణ, సరఫరా మొదలుకుని సాఫ్ట్‌వేర్ తదితర అప్లికేషన్లలో వాటి వినియోగం దాకా అన్ని స్థాయిల్లోనూ కూటమి దేశాలన్నీ సమన్వయంతో పని చేయాలన్నది అమెరికా ఆకాంక్ష.
సభ్య దేశాలెవరు?
పాక్స్ సిలికా కూటమి తొలి శిఖరాగ్ర భేటీ గత డిసెంబర్‌లో జరిగింది. ఆ్రస్టేలియా, జపాన్, బ్రిటన్, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్, నెదర్లాండ్స్, యూఏఈ, సింగపూర్ ఇందులో సభ్యులుగా చేరాయి. తాజాగా సోమవారం ఖతర్ ఈ కూటమి సభ్యత్వం స్వీకరించింది. అదే రోజు భారత్‌ను కూడా అమెరికా ఇందులో చేరాల్సిందిగా ఆహ్వానించింది. ‘‘సిలికా కూటమిలో భారత్ చేరాలన్నది మా ఆకాంక్ష. భారత్–అమెరికా సంబంధాల్లో ఇది మైలురాయి అవుతుంది’’ అని అమెరికా ఆర్థిక వ్యవహారాల సహాయ మంత్రి హెల్‌బర్గ్ తాజాగా తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు.
చైనాదే హవా!
ఈ అరుదైన ఖనిజాల వెలికితీతలో ప్రస్తుతానికి చైనా ఎవరికీ అందనంత దూరంలో ఉంది. ఆ దేశం ఇప్పటిదాకా కనీసం 2.7 లక్షల టన్నుల ఖనిజాలను వెలికితీసినట్టు అంచనా. భారత్ గత ఆర్థిక సంవత్సరంలో 57 వేల టన్నుల దాకా అరుదైన ఖనిజాలను దిగుమతి చేసుకోవాల్సి వచి్చంది. అందులో 97 శాతం ఒక్క చైనా వచ్చాయి. ఈ విషయంలో చైనాపై అతిగా ఆధారపడటం భద్రతతో సహా ఏ కోణం నుంచి చూసినా మన ప్రయోజనాలకు శ్రేయస్కరం కాదు. ఎందుకంటే అమెరికా మితిమీరిన టారిఫ్‌లపై ఆగ్రహించి గతేడాది చైనా ఆర్నెల్ల పాటు ఈ ఖనిజాల ఎగుమతులను పూర్తిగా నిలిపేసింది.
దాంతో మన దేశ ఆటోమొబైల్ తదితర పరిశ్రమలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. బ్యాటరీల్లో కీలకమైన లిథియం, సిలికాన్ తదితర ఖనిజాల లభ్యత లేక పలు కార్ల తయారీ సంస్థలు అనివార్యంగా ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి వచి్చంది. దాంతో ఈ సమస్యకు విరుగుడుగా భారత్ యుద్ధ ప్రాతిపదికన నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. పాక్స్ సిలికాను ఒకరకంగా దీనికి అంతర్జాతీయ రూపంగా భావించవచ్చు. కీలక అరుదైన ఖనిజాల విషయంలో చైనా ఏకఛత్రాధిపత్యానికి ప్రత్యామ్నాయంగా భావసారూప్య దేశాలన్నింటితో కలిసి ఈ కూటమి ఏర్పాటుకు అమెరికా నడుం బిగించింది.
మనవద్ద అపార నిల్వలున్నా...!
సెమీ కండక్టర్లు మొదలుకుని కంప్యూటర్ చిప్స్ దాకా అన్నింట్లోనూ అతి కీలకంగా మారిన అరుదైన ఖనిజ నిల్వలు నిజానికి భారత్‌లో అపారంగా ఉన్నట్టు తేలింది. ఏకంగా 85.2 లక్షల టన్నుల నిక్షేపాలు భారత్‌లో ఉన్నట్టు అంచనా. కానీ ఇప్పటిదాకా మనం వెలికితీయగలిగింది మాత్రం కేవలం 2,900 టన్నులే. దాంతో ఈ అరుదైన ఖనిజాల కోసం ఇతర దేశాలపై, ముఖ్యంగా ఎప్పటికీ నమ్మలేని చైనాపై అనివార్యంగా ఆధారపడాల్సి వస్తోంది.
– సాక్షి, నేషనల్ డెస్క్


