టెహ్రాన్: ఇరాన్ వ్యాప్తంగా ఈ నెల 8, 9వ తేదీల్లో జరిగిన నిరసనల్లోనే కనీసం 30 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఆ దేశ ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల సమాచారాన్ని ఉటంకిస్తూ టైమ్ పత్రిక ఈ విషయం తెలిపింది. గురు, శుక్రవారాల్లోనూ ఇరాన్ భద్రతా విభాగాల సిబ్బంది ఇంతే కర్కశంగా వ్యవహరించారని, మరణాలు కూడా అదే స్థాయిలో ఉండొచ్చన్న అంచనాలున్నాయి.
మృతదేహాలున్న ప్లాస్టిక్ బ్యాగులు ప్రభుత్వ ఆస్పత్రుల ఆవరణల్లో గుట్టలుగా పడి ఉన్నాయని, అంబులెన్సులకు బదులుగా వీటిని తరలించేందుకు 18 చక్రాలుండే సెమీ ట్రయిలర్‌లను వాడుతున్నారని పేర్కొంది. జనవరి 21న సుప్రీం నేత ఖమేనీకి అందించిన సమాచారం ప్రకారం నిరసనల్లో 3,117 మంది మాత్రమే చనిపోయినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఆస్పత్రుల రికార్డుల ఆధారంగా చూస్తే 30,304 మంది మృతుల్లో 5,459 మంది వివరాలను మాత్రమే ఇప్పటి వరకు ధ్రువీకరించారు.


