‘ఇరాన్‌ గగనతలం పూర్తిగా మా గుప్పిట్లోకి వచ్చింది’ | United States Announces Military Action Against Iran, Claims Air Superiority In Ongoing Conflict | Sakshi
Sakshi News home page

‘ఇరాన్‌ గగనతలం పూర్తిగా మా గుప్పిట్లోకి వచ్చింది’

Mar 13 2026 9:12 PM | Updated on Mar 14 2026 4:04 PM

United States Announces Military Action Against Iran

వాషింగ్టన్‌: ఇరాన్‌ గగనతలం పూర్తిగా తమ గుప్పిట్లోకి వచ్చిందని అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్‌ ఆయుధ నిల్వలు బలహీనపడిన క్రమంలో ఆ దేశ గగనతలాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకున్నామని అమెరికా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇరాన్‌పై కొనసాగిస్తున్న యుద్ధంపై అమెరికా తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.  ‘ ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ పేరుతో దాడులు చేశాం. 

ఫైటర్‌ జెట్లు, బాంబర్లతో ఇరాన్‌పై దాడులు చేశాం. ఇరాన్‌ అణు సామర్థ్యాలు, మిస్సైల్‌ స్థావరాలు, నేవీ  వ్యవస్థను నాశనం చేయడమే మా టార్గెట్‌. ఇరాన్‌ గగనతలం పూర్తిగా  మా గుప్పిట్లోకి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ దాడులు ఆపేది లేదు. యుద్ధంలో ఏడుగురు అమెరికా సైనికులు మృతి చెందారు. 140 మంది సైనికులకు గాయాలయ్యాయి. ఇరాన్‌  ఒంటరి అయిపోయింది. ఇరాన్‌ ఆయుధ నిల్వలు తగ్గిపోతున్నాయి. ఇరాన్‌పై దాడులను మరింత ఉధృతం చేస్తాం’ అని అమెరికా పేర్కొంది.

అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఇజ్రాయెల్‌ ప్రధాని నెతాన్యాహుల సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఇరాన్‌ తమకు సరెండర్‌ కాబోతుందన్న ట్రంప్‌.. తమ దాడులకు ఇరాన్‌ భయపడిందంటూ వ్యాఖ్యానించారు. యుద్ధంపై నిర్ణయం తీసుకోవడానికి టెహ్రాన్‌లో అధికారులు ఎవరూ సజీవంగా లేరని.. ఇరాన్‌ లొంగిపోయేందుకు సిద్ధంగా ఉందన్నారు. లొంగిపోతున్నట్లు ప్రకటించేవారు ఎవరూ లేరని.. మొజ్తబా ఖమేనీ ఎవరికీ తెలియదని ట్రంప్‌ అన్నారు.

మరో వైపు, తమ దేశం ఎప్పటికన్నా బలంగా మారుతోందంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు వ్యాఖ్యానించారు. అలాగే తాము ఇరాన్, దాని ప్రాక్సీలపై దాడి చేస్తున్నామంటూ ఆయన ఎక్స్‌లో ఒక పోస్ట్‌ కూడా పెట్టారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారి విలేకరుల సమావేశం నిర్వహించిన నెతన్యాహు.. ఇరాన్‌ కొత్త ప్రభుత్వం కుప్ప కూలుతుందని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము  చోద్యం చూడటం లేదనీ, పూర్తి బలంతో దాడి చేస్తున్నామన్నారు.   "ధైర్యవంతులు గెలుస్తారు" అనే సూత్రంతో, మధ్యప్రాచ్య ముఖచిత్రాన్ని మార్చేస్తామని, శత్రువులను వెంటాడి మరీ దాడి చేస్తామని  నెతన్యాహు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement