పంటలను నాశనం చేసే కీటకాలను నియంత్రించేందుకు 1935లో ఆస్ట్రేలియా తీసుకొచ్చిన కేన్ టోడ్స్ (Cane Toads) ఇప్పుడు ఆ దేశానికి పెద్ద పర్యావరణ సమస్యగా మారాయి. దాదాపు శతాబ్ద కాలంగా దేశమంతటా విస్తరిస్తున్న ఈ విషపూరిత కప్పలు మరో కీలక పర్యావరణ ప్రాంతానికి చేరకుండా అడ్డుకునేందుకు ఆస్ట్రేలియా 28 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల (సుమారు రూ.150 కోట్ల) ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా 7,500 చదరపు కిలోమీటర్ల పరిధిలోని 685 నీటి వసతి నిర్మాణాలను మార్చనున్నారు.
క్వీన్స్‌లాండ్‌లోని చెరకు తోటలను నాశనం చేస్తున్న బీటిల్స్‌ను నియంత్రించేందుకు 1935లో కేన్ టోడ్స్‌ను తీసుకొచ్చారు. అయితే అవి ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోగా, దేశంలో అత్యంత హానికరమైన ఆక్రమణ జాతుల్లో ఒకటిగా మారాయి. ఇప్పుడు అవి పశ్చిమ ఆస్ట్రేలియాలోని పిల్బరా ప్రాంతానికి చేరకుండా అడ్డుకోవడమే తాజా ప్రాజెక్టు లక్ష్యం.
కర్టిన్ విశ్వవిద్యాలయం, రియో టింటో, రోడ్స్ రిడ్జ్ జాయింట్ వెంచర్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. బ్రూమ్ పట్టణానికి దక్షిణంగా, హిందూ మహాసముద్రం నుంచి గ్రేట్ శాండీ ఎడారి వరకు 7,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నీరులేని అడ్డుకట్టను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం భౌతికంగా గోడలు నిర్మించకుండా, కప్పలకు అందుబాటులో ఉన్న కృత్రిమ నీటి వనరులను తొలగించనున్నారు.
ఆరు పశుపోషణ కేంద్రాల్లోని 685 నీటి వసతి నిర్మాణాలను మార్చడం లేదా వాటిని కప్పలు చేరకుండా రక్షించడం ద్వారా ఈ పొడి మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. ఎండాకాలంలో కొన్ని రోజులకోసారి నీరు అవసరమయ్యే ఈ కప్పలు సహజ నీటి వనరులు లేనప్పుడు పశువుల తొట్టెలు, నీటి నిల్వ గుంతలు, ట్యాంకులపై ఆధారపడతాయి. ఈ వనరులను మార్చడం ద్వారా వాటి విస్తరణను అడ్డుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
పిల్బరా ప్రాంతానికి ఎందుకంత ప్రాధాన్యం?
ఆస్ట్రేలియాలో గుర్తించిన 15 జీవవైవిధ్య ప్రాంతాల్లో పిల్బరా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక పర్యావరణ ప్రాధాన్యం ఉన్న ప్రాంతంగా దీనికి గుర్తింపు ఉంది. కేన్ టోడ్స్ అక్కడ స్థిరపడితే సుమారు 25 స్థానిక జీవజాతులపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని రియో టింటో తెలిపింది. వీటిలో నార్తర్న్ క్వోల్, ఘోస్ట్ బ్యాట్ ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 2.7 కోట్ల హెక్టార్ల సున్నితమైన సహజ ఆవాసాలను రక్షించవచ్చని సంస్థ పేర్కొంది.
కర్టిన్ విశ్వవిద్యాలయ జీవశాస్త్రవేత్త బెన్ ఫిలిప్స్ మాట్లాడుతూ.. తగిన చర్యలు తీసుకోకపోతే మరో రెండు దశాబ్దాల్లో కేన్ టోడ్స్ పిల్బరాకు చేరుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఆక్రమణ జీవజాతుల్లో ఒకదాన్ని అడ్డుకుని, ఈ ప్రాంత ప్రత్యేక వన్యప్రాణులను కాపాడేందుకు ఇది జీవితకాలంలో ఒకసారి లభించే అవకాశమని ఆయన అభివర్ణించారు.
ఇప్పటికే ఈ కప్పలు పాములు, గోనాలు, మొసళ్లు సహా లక్షలాది స్థానిక జీవుల మనుగడను దెబ్బతీశాయి. వాటిని తినే స్థానిక మాంసాహార జీవులకు కప్పల్లోని విషం ప్రాణాంతకంగా మారుతోంది. ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక జీవులు కనుమరుగవడం జాతీయ విషాదమని ఫిలిప్స్ పేర్కొన్నారు.
స్థానిక తెగల భాగస్వామ్యం
ఈ ప్రాజెక్టు రూపకల్పనలో న్యాంగుమార్టా, కరాజర్రి సంప్రదాయ భూయజమానులు భాగస్వాములయ్యారు. న్యాంగుమార్టా సంప్రదాయ భూయజమాని, అటవీ సంరక్షణ సిబ్బంది రోబర్టా హంటర్ మాట్లాడుతూ.. కేన్ టోడ్స్ నీటిని, జంతువులను నాశనం చేస్తున్నాయని, తమ ప్రాంతానికి అవి నష్టం కలిగించకముందే అడ్డుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారని తెలిపారు.
కరాజర్రి సంప్రదాయ భూముల సంఘం ముఖ్య కార్యనిర్వహణాధికారి మార్టిన్ బిన్ రషీద్ మాట్లాడుతూ.. ప్రణాళిక దశ నుంచే సంప్రదాయ భూయజమానులు ఇందులో భాగమయ్యారని చెప్పారు. నిర్మాణ పనులకు తమ సంఘంలోని అటవీ సంరక్షణ బృందం, వారసత్వ పరిరక్షణ విభాగం సహకరిస్తాయని తెలిపారు. సాంస్కృతిక ప్రాధాన్యం ఉన్న నీటి గుంటల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోనున్నట్లు వివరించారు. ఆ నీటి వనరులు కేవలం పర్యావరణానికే కాకుండా, తమ ప్రజల సంప్రదాయ కథలు, డ్రీమ్‌టైమ్ గాథలకు కూడా ప్రతీకలని పేర్కొన్నారు.
రూ.150 కోట్ల నిధులు.. 2027లో ప్రధాన పనులు
రియో టింటో, రోడ్స్ రిడ్జ్ జాయింట్ వెంచర్ ఐదేళ్ల పాటు సమాన భాగస్వామ్యంతో 28 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లను అందించనున్నాయి. ఈ జాయింట్ వెంచర్‌లో రియో టింటోతో పాటు మిట్సుయ్, ఏఎంబీ హోల్డింగ్స్ ఉన్నాయి. సామాజిక భాగస్వామ్య కార్యక్రమాల కోసం పశ్చిమ ఆస్ట్రేలియా ప్రభుత్వం మరో 3.4 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు అందించింది.
ఇప్పటికే ఈ పరిరక్షణ కార్యక్రమానికి 12 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల ప్రారంభ నిధులు కేటాయించారు. తాజా పరిశ్రమల భాగస్వామ్యంతో ప్రాజెక్టుకు అందుబాటులో ఉన్న నిధులు రెట్టింపునకు పైగా పెరగనున్నాయి. ప్రాథమిక పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రధాన ప్రాజెక్టు 2027లో మొదలుకానుంది.
నిర్మాణానికి 2 నుంచి 5 ఏళ్ల సమయం పట్టవచ్చని పర్యావరణ శాస్త్రవేత్త జూడీ డన్‌లప్ తెలిపారు. 1935లో తీసుకున్న నిర్ణయం ఆస్ట్రేలియాకు దీర్ఘకాలిక పర్యావరణ సమస్యను సృష్టించింది. ఇప్పుడు ఆ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుని, కప్పలు కొత్త ప్రాంతాలకు చేరకముందే వాటి విస్తరణను అడ్డుకునేందుకు శాస్త్రవేత్తలు, భూయజమానులు, స్థానిక తెగలు, పరిశ్రమలు కలిసి పనిచేస్తున్నాయి. ఈ నీరులేని అడ్డుకట్ట విజయవంతమైతే పిల్బరా జీవవైవిధ్యాన్ని కాపాడటంతో పాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఆక్రమణ జీవజాతుల వ్యాప్తిని అడ్డుకునేందుకు కూడా ఇది ఒక నమూనాగా నిలిచే అవకాశం ఉంది.


