Photo Credit: Twitter
సొంతగడ్డపై ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా సిరీస్ విజయం, ఇటు ఢాకాలో బంగ్లాదేశ్‌పై వెస్టిండీస్ సంచలన విజయంతో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ 2025-27)లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. సఫారీల చేతిలో ఆసీస్ ఓడిపోవడంతో న్యూజిలాండ్ (72.22 పాయింట్ల శాతం) డబ్ల్యూటీసీ పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లగా, ఆస్ట్రేలియా (69.23 పీసీటీ) మూడో స్థానానికి పడిపోయింది.
ఇక కేప్‌టౌన్ టెస్టులో ఆసీస్‌పై విజయం తర్వాత సౌతాఫ్రికా 71.43 పాయింట్ల శాతంతో రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు విండీస్ చేతిలో ఓటమి చవిచూసిన బంగ్లాదేశ్ 47.62 పీసీటీతో ఐదో స్థానానికి పడిపోగా, 51.52 పీసీటీతో ఉన్న టీమిండియా నాలుగో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ సైకిల్‌లో తొమ్మిది జట్ల మధ్య ఇంకా 10 టెస్టు సిరీస్‌లు జరగాల్సి ఉంది.

Photo Credit: Twitter
టాప్-2లో న్యూజిలాండ్, సౌతాఫ్రికాలు ఉన్నప్పటికీ, ఇంకా ఏ జట్టు కూడా ఫైనల్ బెర్తును ఖరారు చేసుకోలేదు. ఇప్పటికైతే 2025-27 డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేందుకు కివీస్, ప్రొటీస్‌లకు ఎక్కువ అవకాశాలు ఉన్నప్పటికీ, రాబోయే మ్యాచ్‌ల్లో ఈ రెండు జట్లకు ప్రతికూల ఫలితాలు ఎదురైతే సమీకరణాలు మారే అవకాశముంది. ఇప్పటికే ఇంగ్లండ్, పాకిస్తాన్, వెస్టిండీస్‌లకు ఫైనల్ చేరే అవకాశం లేకపోవడంతో, ఈ మూడు జట్లు మినహాయించి మిగిలిన ఆరు జట్లకు ఎంతమేర అవకాశం ఉందనేది ఇప్పుడు చూద్దాం.
న్యూజిలాండ్
మిగిలిన మ్యాచ్‌లు: భారత్ (2 టెస్టులు, స్వదేశంలో), ఆస్ట్రేలియా (4 టెస్టులు, విదేశంలో), శ్రీలంక (2 టెస్టులు, స్వదేశంలో), పాకిస్తాన్ (2 టెస్టులు, విదేశంలో)
కేప్ టౌన్‌లో ఆస్ట్రేలియా ఓటమి తర్వాత, 72.22 శాతం పాయింట్లతో న్యూజిలాండ్ డబ్ల్యూటీసీ పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ సైకిల్‌లో కివీస్ ఇంకా 10 టెస్టులు ఆడాల్సి ఉంది. మిగిలిన 120 పాయింట్లలో, వారు 6 టెస్టులు గెలిస్తే, 64.6 శాతం పాయింట్లు ఉంటాయి. ఒకవేళ ఏడు విజయాలు, మూడు ఓటములు ఉంటే 70.83 శాతంతో టాప్-2లో నిలుస్తోంది. అయితే భారత్, శ్రీలంకలతో సొంతగడ్డపై నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడనుండడం సానుకూలాంశం.
దక్షిణాఫ్రికా
మిగిలిన మ్యాచ్‌లు: బంగ్లాదేశ్ (2 టెస్టులు, స్వదేశంలో), ఇంగ్లండ్ (3 టెస్టులు, స్వదేశంలో), శ్రీలంక (2 టెస్టులు, విదేశంలో)
ఆస్ట్రేలియాపై సిరీస్ విజయం టాప్-టూలో నిలిచేందుకు దక్షిణాఫ్రికాను పటిష్టమైన స్థితిలో నిలబెట్టింది. ఈ సైకిల్‌లో వారికి ఇంకా ఏడు మ్యాచ్‌లు మిగిలి ఉండగా.. ఇందులో ఐదు మ్యాచ్‌లు సొంతగడ్డపై ఆడనుండడం కలిసిరానుంది. ఒకవేళ సఫారీలు ఏడు మ్యాచ్‌ల్లో ఐదు మ్యాచ్‌లు గెలిస్తే బవుమా సేన 71.41 పీసీటీతో ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. నాలుగు విజయాలు సాధించి, మూడు డ్రా చేసుకుంటే మాత్రం కాస్త కష్టమే.

Photo Credit: Twitter
ఆస్ట్రేలియా
మిగిలిన మ్యాచ్‌లు: న్యూజిలాండ్ (4 టెస్టులు, స్వదేశంలో), భారత్ (5 టెస్టులు, విదేశంలో)
దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు, ఆస్ట్రేలియా పది మ్యాచ్‌లలో ఎనిమిది విజయాలు, కేవలం రెండు ఓటములతో 80 శాతం పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. కానీ వరుసగా రెండు ఓటములతో ఈ సీజన్‌లో తొలిసారిగా అగ్ర రెండు స్థానాల నుంచి బయటకు వచ్చింది. ప్రస్తుతం వారి పాయింట్ల శాతం 69.23గా ఉంది.
కానీ స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఆ తర్వాత 2027 ఆరంభంలో బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భారత్ రూపంలో కఠిన సవాల్ ఎదుర్కోనుంది. తమ పాయింట్లను మెరుగుపరుచుకోవాలంటే, ఆస్ట్రేలియా మిగిలిన తొమ్మిది టెస్టుల్లో కనీసం ఆరింటిలో గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ తాము ఆడిన వాటిలో నాలుగు గెలిచి, మిగిలినవి డ్రా చేసుకున్నా కూడా ఆస్ట్రేలియాకు టాప్-2లోకి ప్రవేశించేందుకు అవకాశముంటుంది.
టీమిండియా:
మిగిలిన మ్యాచ్‌లు: న్యూజిలాండ్ (2 టెస్టులు, వారి సొంత గడ్డపై); ఆస్ట్రేలియా (5 టెస్టులు, స్వదేశంలో)
కొలంబో డ్రా తర్వాత భారత్ 51.52 శాతం విజయ శాతంతో నాలుగో స్థానంలో ఉంది. మిగిలిన ఏడు టెస్టుల్లోనూ గెలిస్తే, వారి విజయ శాతం 70.37 అవుతుంది. ఆరు విజయాలు సాధిస్తే, మన పీసీటీ 65 శాతానికి చేరుకుంటుంది. అలా కాకుండా ఐదు టెస్టులు గెలిచి, ఒక టెస్టును డ్రా చేసుకుంటే, అప్పుడు ఇతర మ్యాచ్‌ల ఫలితాలు కూడా భారత్‌కు అనుకూలంగా రావాలి.
న్యూజిలాండ్‌లో 0-2 తేడాతో ఓడిపోయి, ఆ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాను 5-0తో క్లీన్ స్వీప్ చేస్తే, భారత్ విజయ శాతం 59.26 శాతానికి పడిపోతుంది. దీనివల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి ఏడు మ్యాచ్‌ల్లో కనీసం ఆరు గెలిస్తేనే భారత్ టాప్-2లో అడుగుపెట్టేందుకు అవకాశముంటుంది.

Photo Credit: Twitter
బంగ్లాదేశ్
మిగిలిన మ్యాచ్‌లు: వెస్టిండీస్ (1 టెస్ట్, స్వదేశంలో), దక్షిణాఫ్రికా (2 టెస్టులు, విదేశంలో), ఇంగ్లండ్ (2 టెస్టులు, స్వదేశంలో)
ఢాకాలో వెస్టిండీస్‌తో ఓటమితో బంగ్లాదేశ్ 47.62%తో భారత్ వెనుక ఐదవ స్థానంలో నిలిచింది. ఇప్పుడు వారు 65% మార్కును దాటాలంటే మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవాలి. ఒక్కటి ఓడినా బంగ్లాదేశ్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే దారులు మూసుకుపోతాయి.
శ్రీలంక
మిగిలిన మ్యాచ్‌లు: పాకిస్థాన్ (2 టెస్టులు, స్వదేశంలో), న్యూజిలాండ్ (2 టెస్టులు, స్వదేశంలో), దక్షిణాఫ్రికా (2 టెస్టులు, స్వదేశంలో)
ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో శ్రీలంక కేవలం 33.33 శాతం విజయ శాతాన్ని (PCT) కలిగి ఉంది. స్వదేశంలో భారత్‌తో జరిగే టెస్టులను డ్రా చేసుకుంటే, వారి డబ్ల్యూటీసీ ఫైనల్ కల సజీవంగా ఉంటుంది. ఇంకా ఆరు టెస్టులు మిగిలి ఉండగా, వాటన్నింటిలోనూ గెలిస్తే వారి విజయ శాతం 66.67కు చేరుకుంటుంది. ఇతర ఫలితాలు వారికి అనుకూలంగా వస్తే, ఫైనల్‌కు చేరే చాన్స్ ఉంటుంది.


