శ్రేయ‌స్ అయ్య‌ర్‌.. ఇలాగైతే క‌ష్ట‌మే! | Shreyas-Iyer-Poor Captaincy-Batting Failure-Big-Cost-Match Loss-Vs NZ | Sakshi
Sakshi News home page

శ్రేయ‌స్ అయ్య‌ర్‌.. ఇలాగైతే క‌ష్ట‌మే!

Nov 1 2026 7:53 AM | Updated on Nov 1 2026 8:16 AM

Shreyas-Iyer-Poor Captaincy-Batting Failure-Big-Cost-Match Loss-Vs NZ

Photo Credit : Twitter

న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న టీమిండియా టీ20 సిరీస్‌ను మ‌రో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండ‌గానే 3-0తో సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే నాలుగో టీ20లో అనూహ్యంగా భార‌త్ 87 ప‌రుగుల తేడాతో ఓట‌మి చ‌విచూసింది. తొలి మూడు టీ20ల్లో కివీస్ విధించిన టార్గెట్‌ను విజ‌యవంతంగా ఛేదించిన భార‌త్ నాలుగో టీ20లో మాత్రం పూర్తిగా చతికిల‌ప‌డింది. 

ఇక్క‌డ ఒక విష‌యం గ‌మనిస్తే.. తొలి మూడు టీ20ల్లో ఓపెనింగ్ జోడీ లేదా మిడిలార్డ‌ర్‌లో తిల‌క్ వ‌ర్మ‌, నితీశ్‌రెడ్డి, న‌మ‌న్ ధీర్‌లు ఆడ‌డంతో విజ‌యాలు అందుకుంది. కానీ కెప్టెన్ అయిన శ్రేయ‌స్ అయ్య‌ర్ మాత్రం మూడు మ్యాచ్‌ల్లోనూ బ్యాట‌ర్‌గా విఫ‌ల‌మ‌య్యాడు. మూడు టీ20ల్లో భార‌త్ విజ‌యాలు సాధించింది కాబ‌ట్టి అయ్య‌ర్ విఫ‌ల‌మైనా పెద్ద‌గా క‌నిపించ‌లేదు. 

బాధ్యత మరిచిన అయ్యర్‌
కానీ నాలుగో టీ20లో అత‌డి బ్యాటింగ్‌లో లోపాలు క‌నిపించాయి. నాలుగో టీ20లో 260 ప‌రుగుల‌ను ఛేదించే క్ర‌మంలో ఓపెన‌ర్లు సంజూ సామ్స‌న్‌, అభిషేక్ శ‌ర్మ‌ల వికెట్ల‌ను తొంద‌ర‌గానే కోల్పోయింది. వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన ఇషాన్ డ‌కౌట్‌గా వెనుదిరిగాడు. ఈ స‌మ‌యంలో శ్రేయ‌స్ అయ్య‌ర్‌ కెప్టెన్‌గా బాధ్య‌త‌గా ఆడాల్సిన అవ‌స‌ర‌ముంది. కానీ 11 బంతుల్లో 22 ప‌రుగులు చేసిన అయ్య‌ర్ ఆడ‌మ్ మిల్నే బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యి వెనుదిరిగాడు. 

శ్రేయ‌స్ బ్యాటింగ్ టెక్నిక్‌ఫై అనుమానాలు లేన‌ప్ప‌టికీ, క్లిష్ట ప‌రిస్థితుల్లో ఓపిక ప్ర‌ద‌ర్శిస్తూ బ్యాటింగ్ చేయాల్సిన అయ్య‌ర్ వికెట్ పారేసుకోవ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. మిడిలార్డ‌ర్‌లో తిల‌క్ వ‌ర్మ‌తో క‌లిసి బాధ్య‌త‌గా ఆడాల్సిన శ్రేయ‌స్ త‌క్కువ స్కోరుకే వెనుదిర‌గ‌డంతో ఆ ప్ర‌భావం జ‌ట్టుపై ప‌డింది. ఫ‌లితంగా భార‌త్ ఓట‌మి చ‌విచూసింది.

విమర్శల వెల్లువ..
ఈ సిరీస్ భార‌త్ వ‌శ‌మైన‌ప్ప‌టికీ, నాలుగో టీ20లో భార‌త్ ఓట‌మిపాలైన తీరుకు కెప్టెన్‌గా శ్రేయ‌స్‌ను నిందించాల్సిందే. ఎందుకంటే అతడు కెప్టెన్‌గా వచ్చిన తర్వాతే టీమిండియా రెండు భారీ ఓటములు చవిచూసింది. నాటింగ్‌హ‌మ్‌లో ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ భార‌త్ 125 ప‌రుగుల తేడాతో ఓట‌మిపాలైన భారత్‌, తాజాగా కివీస్‌తో మ్యాచ్‌లో 87 పరుగులతో ఓటమి చవిచూసింది. నాయ‌కుడ‌నేవాడు జ‌ట్టును న‌డిపించ‌డ‌మే కాదు, అవ‌స‌ర‌మైన‌ప్పుడు అండ‌గా నిల‌బ‌డాల్సిన అవ‌స‌ర‌ముంటుంది. కానీ అయ్య‌ర్ కెప్టెన్‌గా స‌క్సెస్ అయినప్ప‌టికీ, బ్యాట‌ర్‌గా ఫెయిల‌య్యాడు.

కెప్టెన్‌గా ట్రాక్‌ రికార్డు..
టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్ ఈ ఏడాది జూన్ 6న సూర్య‌కుమార్ నుంచి బాధ్య‌త‌లు స్వీక‌రించాడు. 2026 ఆసియా గేమ్స్‌లో గోల్డ్ మెడ‌ల్ , ఐర్లాండ్, జింబాబ్వే, అఫ్గానిస్తాన్‌ల‌పై క్లీన్‌స్వీప్‌, ఇంగ్లండ్ చేతిలో 4-0తో, స్వ‌దేశంలో వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ను 2-2తో స‌మం చేసిన భార‌త్‌.. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను  మ‌రో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండ‌గానే 3-0తో సొంతం చేసుకుంది. ఇదీ కెప్టెన్‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్ ట్రాక్ రికార్డు. కెప్టెన్ అయిన త‌ర్వాత అయ్య‌ర్‌ 25 మ్యాచ్‌ల్లో 14 విజ‌యాలు, 9 ఓట‌ములు చ‌విచూశాడు. మ‌రో రెండు మ్యాచ్‌ల్లో ఫ‌లితం రాలేదు.

బ్యాటింగ్‌లో అట్టర్‌ఫ్లాఫ్‌
కానీ బ్యాటింగ్‌లో మాత్రం అయ్య‌ర్ అట్ట‌ర్‌ఫ్లాఫ్ అవుతూనే వ‌స్తున్నాడు. విండీస్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా అక్టోబర్ 6న లక్నోలో ఆ జ‌ట్టుపై 43 బంతుల్లో 102 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచిన అయ్య‌ర్.. గ‌త ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో మాత్రం వ‌రుస‌గా 40, 1, 16, 22, 42, 7, 5, 22 పరుగులు చేసి, మొత్తం 19.37 సగటుతో 155 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతని ఖాతాలో ఒక్క అర్ధశతకం కూడా నమోదు కాలేదు. ఇది ఇలాగే కొన‌సాగితే మాత్రం అయ్య‌ర్ కెప్టెన్‌గానే కాదు జ‌ట్టులోనూ ఎక్కువ‌కాలం ఉండ‌క‌పోవ‌చ్చు.

అయితే శ్రేయ‌స్ అయ్య‌ర్ ఐపీఎల్‌లో నాయ‌కుడిగా సాధించిన విజ‌యాలే ఇవాళ టీమిండియాకు కెప్టెన్‌ను చేశాయి. ఒక ఆటగాడి బ్యాటింగ్ ఫామ్ పరిశీలనకు వచ్చినప్పుడు, కేవలం నాయకత్వ ఫలితాలు మాత్రమే జట్టులోని అతని స్థానంపై ప్రశ్నలను పరిష్కరించలేవని కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ప్రస్థానం నిరూపించింది. అయ్యర్ కూడా అవే అంచనాలను ఎదుర్కోనున్నాడు. 2028లో జరిగే టీ20 ప్ర‌పంచ‌క‌ప్ వ‌ర‌కు శ్రేయ‌స్ అయ్య‌ర్ కెప్టెన్‌గా ఉంటాడా అనేది అనుమాన‌మే!

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement