రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన ఆసీస్‌ స్టార్‌ క్రికెటర్‌ | Australia-All-Rounder-Glenn Maxwell Announce-Retirement-International Cricket | Sakshi
Sakshi News home page

రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన ఆసీస్‌ స్టార్‌ క్రికెటర్‌

Nov 3 2026 7:05 AM | Updated on Nov 3 2026 7:57 AM

Australia-All-Rounder-Glenn Maxwell Announce-Retirement-International Cricket

Photo Credit: Twitter

ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండ‌ర్ గ్లెన్ మాక్స్‌వెల్ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. 38 ఏళ్ల మాక్స్‌వెల్ 2026 పురుషుల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆస్ట్రేలియా త‌ర‌ఫున ఒమన్‌తో చివ‌రి మ్యాచ్ ఆడాడు. తాజాగా త‌న 14 ఏళ్ల అంత‌ర్జాతీయ‌ కెరీర్‌కు వీడ్కోలు ప‌లక‌డంతో ఆసీస్ క్రికెట్‌లో ఒక శ‌కం ముగిసిన‌ట్ల‌యింది. 

స్విచ్ షాట్‌కు మారుపేరైన మాక్స్‌వెల్ ఆస్ట్రేలియా త‌ర‌ఫున 149 వ‌న్డేలు, 130 టీ20లు, ఏడు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 2015, 2023 ఐసీసీ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లు గెలిచిన ఆస్ట్రేలియా జ‌ట్టులో స‌భ్యుడిగా ఉన్నాడు. 2021లో తొలిసారి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సాధించిన ఆసీస్ జ‌ట్టులోనూ మాక్స్‌వెల్ ఆడాడు.


PC: Twitter

రికార్డు డబుల్‌ సెంచరీ
మిడిలార్డ‌ర్‌లో బ్యాటింగ్‌కు ఎక్కువగా వచ్చే మాక్స్‌వెల్ పవర్ షాట్లకు పెట్టింది పేరు.  మిడిల్ ఓవుర్లలో స్కోరు వేగాన్ని పెంచడంలో సుప్రసిద్ధుడైన మాక్స్‌వెల్ వైట్‌బాల్ క్రికెట్‌లో డేంజరస్ బ్యాటర్‌గా ఎదిగాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో ఛేదన సమయంలో (201 పరుగులు నాటౌట్‌) ఆడిన ఇన్నింగ్స్‌ అతడి కెరీర్‌లోనే బెస్ట్‌ ఇన్నింగ్స్‌ అనడంలో సందేహం లేదు.

ఆ మ్యాచ్‌లో అజేయ డబుల్ సెంచరీతో జట్టును గట్టెక్కించడమే కాదు, ఆ తర్వాత వన్డే ప్రపంచకప్ ఆసీస్ గెలవడంలోనూ మాక్స్‌వెల్ కీలకపాత్ర పోషించాడు. ఓవరాల్‌గా వన్డేల్లో 126 స్ట్రైక్‌రేట్‌తో 3,990 పరుగులు, టీ20ల్లో 154 స్ట్రైక్‌రేట్‌తో 2,897 పరుగులు సాధించాడు. ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన మాక్స్‌వెల్ 149  వన్డేల్లో 77 వికెట్లు, 130 టీ20ల్లో 51 వికెట్లు, ఏడు టెస్టుల్లో 8 వికెట్లు పడగొట్టాడు.


PC: Twitter

మాక్స్‌వెల్ భావోద్వేగం..
కాగా తన రిటైర్మెంట్ విషయాన్ని ‘ఎక్స్‌’ వేదికగా పంచుకున్న మాక్స్‌వెల్ భావోద్వేగానికి లోనయ్యాడు. ‘టీ20 ప్రపంచకప్‌కు ముందు, ఆ తర్వాత నా రిటైర్‌మెంట్ గురించి చాలాసార్లు చర్చించుకున్నాం. ఆస్ట్రేలియా జట్టు యాజమాన్యం నుంచి ఎలాంటి ఒత్తిడి లేదు. బంగ్లాదేశ్ పర్యటనలో యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం, వారు వాటిని సద్వినియోగం చేసుకోవడం చూశాం. జట్టు భవిష్యత్తు దిశగా అడుగులు వేస్తోంది. 

కానీ ఎంసీజీలో నాకు ఓ వీడ్కోలు మ్యాచ్ ఆడే అవకాశం వస్తుందేమోనని ఆశించాను. మన చిన్నప్పటి హీరోలు, అభిమానించే ఆటగాళ్లు తమ సొంత మైదానాల్లో ఘనంగా వీడ్కోలు పొందడం చూస్తుంటాం. అలాంటి కల నాకూ వచ్చింది. గత 15 ఏళ్లుగా ఎంసీజీ నాకు సొంత ఇంటిలా అనిపించింది. అందుకే అక్కడ చివరి మ్యాచ్ ఆడాలనే చిన్న కోరిక కలిగింది. కానీ సెలెక్టర్లు తీసుకుంటున్న నిర్ణయాలను పూర్తిగా అర్థం చేసుకోగలను. 


PC: Twitter

రాబోయే 12 నుంచి 24 నెలల్లో జట్టులో చాలా మార్పులు జరగనున్నాయి. 2028 ఒలింపిక్స్ కూడా దగ్గరపడుతుంది. యువ ఆటగాళ్లను గుర్తించి, అంతర్జాతీయ క్రికెట్ ఒత్తిడికి అలవాటు పడేలా చేయడం జట్టుకు అవసరం. బిగ్‌బాష్‌లో ఆడటం ద్వారా మాత్రమే అలాంటి అనుభవం పూర్తిగా రాదు’ అని మాక్స్‌వెల్‌ పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: 14 బంతుల్లోనే అర్ధసెంచరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement