Photo Credit: Twitter
క్రైస్ట్‌చర్చి వేదికగా ఇండియా-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్-ఏ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. భారత బౌలర్లు ముకేశ్ కుమార్ ఐదు వికెట్లు, సిరాజ్ నాలుగు వికెట్లతో చెలరేగిన వేళ న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 424 పరుగులకు ఆలౌటైంది.
కివీస్ బ్యాటర్లలో మాథ్యూ బోలె (152 బంతుల్లో 110) సెంచరీ సాధించగా, డీన్ ఫాక్స్ క్రాఫ్ట్ (93) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మిగిలిన బ్యాటర్లలో క్రిస్టియన్ క్లార్క్ (41), ఫ్రేసర్ షీట్ (40), జైడెన్ లెన్నోక్స్ (32 నాటౌట్), జర్రోడ్ మెక్‌కే (33) రాణించారు. న్యూజిలాండ్ 9 వికెట్లు భారత పేసర్ల ఖాతాలోకి వెళ్లగా, సుందర్ ఒక వికెట్ తీశాడు.
369 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ ఆఖరి వికెట్‌కు 55 పరుగులు జోడించింది. ఆ ఒక్క వికెట్ తీయడానికి భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. చివరికి సుందర్ జర్రోడ్‌కను వికెట్ల ముందు దొరకబుచ్చుకొని న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.
అంతకముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 346 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. కెప్టెన్ ధ్రువ్ జురెల్ సెంచరీ చేయగా, దేవదత్ పడిక్కల్ అర్థసెంచరీతో రాణించాడు. ఇరుజట్ల మధ్య జరిగిన తొలి అనధికారిక టెస్టు డ్రాగా ముగిసింది.
ఇదీ చదవండి: ప్రపంచ రికార్డుకు అడుగుదూరంలో అర్షదీప్


