Photo Credit: Twitter
టీమిండియాతో వన్డే సిరీస్ ముంగిట న్యూజిలాండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాళ్లు మార్క్ చాప్‌మన్, రచిన్ రవీంద్ర ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు దూరమయ్యారు. ఈ ఇద్దరు గాయాల నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఇంకా రిహాబిలిటేషన్ కేంద్రంలోనే గడుపుతున్నారని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.
ఈ నేపథ్యంలో వన్డే సిరీస్ కోసం రెండు వేర్వేరు జట్లను ప్రకటించిన న్యూజిలాండ్ జట్టులో కీలక మార్పుల అనంతరం అప్‌డేటెడ్ స్వ్కాడ్‌ను ప్రకటించింది. గాయాలతో దూరమైన రచిన్ రవీంద్ర, మార్క్ చాప్‌మన్ స్థానాల్లో టిమ్ సీఫెర్ట్, హెన్రీ నికోల్స్, ఆల్‌రౌండర్ డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్‌లను ఎంపిక చేసినట్లు తెలిపింది.
ఇప్పటికే వికెట్ కీపర్ టిమ్ సీఫెర్ట్ నాలుగు, ఐదు వన్డేలకు ఎంపిక కాగా, తాజాగా తొలి మూడు వన్డేలకు కూడా అందుబాటులో ఉండనున్నాడు. ఇక హెన్రీ నికోల్స్ తొలి మూడు వన్డేలకు అందుబాటులో ఉండనుండగా, డీన్ ఫాక్స్ క్రాఫ్ట్ చివరి రెండు వన్డేలకు ఎంపికయ్యాడు. పేసర్ మాట్ ఫిషర్ కూడా తొలుత నాలుగు, ఐదు వన్డేలకు ఎంపికైనప్పటికీ, తాజాగా సిరీస్ మొత్తానికి అందుబాటులో ఉండనున్నాడు.
ఇక చాప్‌మన్ యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ ఆడుతూ కండరాల గాయానికి గురవ్వగా, రచిన్ రవీంద్ర ఒక షూట్ యాడ్ ప్రమోషన్‌లో పాల్గొంటున్న సమయంలో భుజం గాయానికి గురయ్యాడు. అప్పటి నుంచి వీరిద్దరు రిహాబిలిటేషన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు.
న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 3-2తో కైవసం చేసుకుంది. నవంబర్ 4 నుంచి 15 వరకు ఐదు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. బుధవారం ఆక్లాండ్ వేదికగా ఇరుజట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది.
తొలి మూడు వన్డేలకు న్యూజిలాండ్ జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, మాట్ ఫిషర్, హెన్రీ, కైల్ జామిసన్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫెర్ట్, నాథన్ స్మిత్, విల్ యంగ్, బ్లెయిర్ టిక్నర్
4-5 వన్డేల కోసం న్యూజిలాండ్ జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, క్రిస్టియన్ క్లార్క్, జాకబ్ డఫీ, మాట్ ఫిషర్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, లాకీ ఫెర్గూసన్, మిచెల్ హే (వికెట్ కీపర్), నిక్ కెల్లీ, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), బ్లెయిర్ టిక్నర్, విల్ యంగ్
ఇదీ చదవండి: ఆ తప్పిదాలే కొంపముంచాయి.. ఓటమిపై శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు


