ఆ తప్పిదాలే కొంపముంచాయి.. ఓటమిపై శ్రేయస్‌ అయ్యర్‌ కీలక వ్యాఖ్యలు | India Suffered 7-Wicket Defeat in 5th T20I: Shreyas Iyer Opens Up on Loss and Experiments | Sakshi
Sakshi News home page

ఆ తప్పిదాలే కొంపముంచాయి.. ఓటమిపై శ్రేయస్‌ అయ్యర్‌ కీలక వ్యాఖ్యలు

Nov 1 2026 9:16 PM | Updated on Nov 1 2026 9:33 PM

India Suffered 7-Wicket Defeat in 5th T20I: Shreyas Iyer Opens Up on Loss and Experiments

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆదివారం హామిల్టన్ వేదికగా జరిగిన ఈ పోరులో బ్యాటర్లు రాణించినప్పటికీ, బౌలింగ్ వైఫల్యం భారత్ కొంపముంచింది. 192 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్ జట్టు కేవలం 3 వికెట్లు కోల్పోయి 18 ఓవర్లలోనే విజయవంతంగా ఛేదించింది. ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందిస్తూ.. తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయామని చెప్పుకొచ్చాడు.

మిడిల్ ఓవర్లలో తడబాటు వల్లే..

"ఆరంభంలో వికెట్లు కోల్పోయినప్పటికీ, ఇషాన్ కిషన్ ,నేను ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాం. దూకుడుగా ఆడి స్కోరు వేగాన్ని పెంచాం. కానీ మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడం వల్ల కొత్తగా క్రీజులోకి వచ్చిన బ్యాటర్లపై తీవ్రమైన ఒత్తిడి పడింది. పిచ్ బ్యాటింగ్‌కు అంత తేలికగా సహకరించలేదు. 

బంతి సీమ్ అవ్వడంతో పాటు కొద్దిగా ఆగుతూ, కొన్నిసార్లు వేగంగా దూసుకురావడంతో మా బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. అలాంటి బంతులకే నేను, తిలక్ వర్మ కూడా ఔటయ్యాం. అయినప్పటికీ 190కి పైగా పరుగులు సాధించాం. ఆ స్కోరు మంచిదే అయినప్పటికీ, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో కొన్ని తప్పిదాలు చేశాం.

న్యూజిలాండ్‌ లాంటి విదేశీ గడ్డలపై, భిన్నమైన పరిస్థితుల్లో, వేర్వేరు మైదానాల్లో ఆడటం మా యువ జట్టుకు ఒక గొప్ప అభ్యాసం. మొదటి మూడు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకున్నాం. ఇక చివరి రెండు మ్యాచ్‌లలో కొన్ని ప్రయోగాలు చేసి, జట్టును మరింత సవాలు చేసుకుంటూ బెంచ్ స్ట్రెంగ్త్‌ను పరీక్షించాలని అనుకున్నాం. 

కానీ అనుకున్న విధంగా అంచనాలను అందుకోలేకపోయాం. ఈ ఓటముల నుంచి ఎంతో నేర్చుకున్నాం" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో శ్రేయస్ పేర్కొన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement