హాంగ్‌కాంగ్ సిక్సెస్-2026 టోర్నమెంట్ విజేతగా అఫ్గానిస్తాన్ నిలిచింది. ఆదివారం మిషన్ రోడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 4 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన అఫ్గానిస్తాన్.. తమ తొలి హాంగ్‌కాంగ్ సిక్సెస్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
ఈ తుది పోరులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 6 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 115 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆసీస్ ఓపెనర్ మాక్స్ బ్రయంట్ (14 బంతుల్లో 44 పరుగులు) మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు అలెక్స్ రాస్ (10 బంతుల్లో 29 పరుగులు), నిక్ హాబ్సన్ (8 బంతుల్లో 23 పరుగులు) రాణించారు.
ఇమ్రాన్ మీర్ తుపాన్ ఇన్నింగ్స్
116 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 5.1 ఓవర్లలో చేధించింది. ఇమ్రాన్ మీర్ కేవలం 14 బంతుల్లో 7 సిక్సర్లు, 2 ఫోర్లతో 53 పరుగులు చేసి అఫ్గాన్‌కు విజయాన్ని అదించాడు. ఆఖరిలో ఫర్మనుల్లా సాఫీ (7 బంతుల్లో 4 సిక్సర్ల సాయంతో 26 పరుగులు) కూడా దూకుడగా ఆడాడు.
కాగా ఈ చారిత్రాత్మక విజయంతో హాంగ్‌కాంగ్ సిక్సెస్ టైటిల్‌ను గెలుచుకున్న 8వ దేశంగా అఫ్గానిస్తాన్ నిలిచింది. ఇప్పటివరకు పాకిస్తాన్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, భారత్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మాత్రమే ఈ ట్రోఫీని గెలుచుకున్నాయి.
చదవండి: IND vs NZ: గ్లెన్ ఫిలిప్స్ సరికొత్త ప్రపంచ రికార్డు


