న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆదివారం హామిల్టన్ వేదికగా టీమిండియాతో జరిగిన ఐదో టీ20లో ఫిలిప్స్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. 192 పరుగుల లక్ష్య చేధనలో ఫిలిప్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
కేవలం 38 బంతుల్లోనే 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ సిరీస్‌లో ఫిలిప్స్ ఏకంగా నాలుగు సార్లు 50కి పైగా పరుగులు సాధించాడు. ఈ కివీస్ సూపర్ స్టార్ మొత్తంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 341 పరుగులు చేశాడు.
సాల్ట్ వరల్డ్ రికార్డ్ బ్రేక్
ఈ క్రమంలో ఫిలిప్స్ ఒక ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా ఫిలిప్స్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ (2023లో వెస్టిండీస్‌పై 331 పరుగులు) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్‌తో సాల్ట్ వరల్డ్ రికార్డును ఫిలిప్స్ బ్రేక్ చేశాడు. అదేవిధంగా ఒక క్యాలెండర్ ఈయర్‌లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక పరుగులు సాధించిన జాబితాలోనూ ఫిలిప్స్ అగ్రస్థానంలో నిలిచాడు.
ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు వీరే
341* గ్లెన్. ఫిలిప్స్ (భారత్‌తో, 2026)
331 ఫిల్. సాల్ట్ (వెస్టిండీస్‌తో, 2023)
316 మహ్మద్ రిజ్వాన్ (ఇంగ్లాండ్‌తో, 2022)
297 సాహిల్ చౌహాన్ (ఎస్టోనియా) (సైప్రస్‌తో, 2024)
290 ఎం. చాప్‌మన్ (పాకిస్థాన్‌తో, 2023)
ఒక క్యాలెండర్ ఈయర్‌లో ఒక ప్రత్యర్థి జట్టుపై సాధించిన అత్యధిక పరుగులు
గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్) - భారత్‌పై 522 పరుగులు (2026)
అభిషేక్ శర్మ (భారత్) - న్యూజిలాండ్‌పై 431 పరుగులు (2026)
సాహిబ్జాదా ఫర్హాన్ (పాకిస్థాన్) - శ్రీలంకపై 398 పరుగులు (2026)


