Photo Credit: Twitter
టీమిండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ నోటి నుంచే వచ్చే మాటలు తూటాల్లా ఉంటాయనడంలో సందేహం లేదు. ఏ విషయాన్నైనా నిర్మొహమాటంగా వెల్లడించే వ్యక్తిత్వం కలిగిన గంభీర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్‌తో ఐదో టీ20 మ్యాచ్‌కు ముందు, ఆటగాళ్ల ఎంపిక , జట్టు ప్రదర్శనపై వస్తున్న విమర్శలపై గంభీర్ ఘాటుగా స్పందించాడు.
‘జట్టు ఎంపిక అనేది నా చేతుల్లో ఉండదు. ఆటగాళ్ల ప్రదర్శనపైనే అది ఆధారపడి ఉంటుంది. అన్నిటికంటే ముందు, అందరినీ సంతోషపెట్టడం నా పని కాదు. ప్రజాదరణ పొందే (పాపులర్) నిర్ణయాలు కాకుండా, జట్టుకు ఉపయోగపడే సరైన నిర్ణయాలు తీసుకోవడమే నా బాధ్యత. ఇందుకోసమే నేను ఇక్కడ ఉన్నాను.
నేటి కాలంలో సోషల్ మీడియా హడావుడి, బయట జరిగే అనవసర చర్చల వల్ల అందరికీ నచ్చే నిర్ణయాలు తీసుకోవడం చాలా సులభమని అంతా అనుకుంటారు. కానీ అలాంటి వాటికి నేను ఎన్నటికీ లొంగను. ఆటగాళ్లకు డ్రెస్సింగ్ రూమ్‌లో పూర్తి భద్రత, భరోసా కల్పించడం నా బాధ్యత.
అందరిలోనూ ప్రతిభ ఉంటుంది, కానీ చాలాకాలం పాటు అద్భుతంగా రాణించిన ఆటగాళ్లకు మాత్రమే జట్టులో ఎక్కువకాలం కొనసాగేందుకు అర్హులన్నది నా అభిప్రాయం. ఇక భారత జట్టును విజయపథంలో నడిపించడమే నా ఏకైక లక్ష్యం’ అని గంభీర్ పునరుద్ఘాటించాడు.
గతంలో వైభవ్ సూర్యవంశీకి అవకాశమివ్వకపోవడంపై కూడా గంభీర్ ఇంతే ఘాటుగా స్పందించాడు. వైభవ్ ఇంకా నేర్చుకునే దశలో ఉన్నాడని, వయసు తక్కువ కావడంతో అతడికి భవిష్యత్తులో చాలా అవకాశాలు ఉంటాయని, ఇప్పుడు మాత్రం బెంచ్‌కు పరిమితమవుతాడని చెప్పుకొచ్చాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తడబడుతోంది. ఓపెనర్లు సామ్సన్ (4), అభిషేక్ శర్మ (1) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ప్రస్తుతం భారత్ రెండు వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది. ఇషాన్ (17), శ్రేయస్ (8) పరుగులతో ఆడుతున్నారు.
ఇదీ చదవండి: రోహిత్ శర్మ కీలక నిర్ణయం


