హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదో టీ20లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. కేవలం 19 పరుగులకే ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది.
ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫస్ట్ డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో అయ్యర్ కేవలం 22 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత బంతికి అయ్యర్(50) ఔటై పెవిలియన్‌కు చేరాడు. అతడి ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. కాగా ఈ హాఫ్ సెంచరీతో శ్రేయస్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
సూర్యకుమార్ రికార్డు బ్రేక్
న్యూజిలాండ్‌పై టీ20ల్లో వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన భారత కెప్టెన్‌గా అయ్యర్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉండేది. గతంలో న్యూజిలాండ్‌పై రాయ్‌పూర్‌లో సూర్య 23 బంతుల్లో ఫిప్టీ సాధించాడు. తాజా మ్యాచ్‌తో సూర్య ఆల్‌టైమ్ రికార్డును శ్రేయస్ బ్రేక్ చేశాడు.
ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ రికార్డు భాగస్వామ్యం
ఈ మ్యాచ్‌లో శ్రేయస్‌తో పాటు ఇషాన్ కిషన్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇషాన్ 32 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 93 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. న్యూజిలాండ్ గడ్డపై న్యూజిలాండ్‌పై మూడో వికెట్‌కు భారత్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. కాగా వీరిద్దరూ రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్ సాధించింది.


