breaking news
Jayden Lennox
-
వార్న్, కుంబ్లేను అధిగమించిన న్యూజిలాండ్ స్పిన్నర్
న్యూజిలాండ్ ఎడమచేతి స్పిన్నర్ జేడెన్ లెనాక్స్ వెస్టిండీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సిరీస్‌లో మొత్తం 14 వికెట్లు పడగొట్టి, న్యూజిలాండ్‌కు 3-2తో సిరీస్ విజయాన్ని అందించడంతో పాటు 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డును సొంతం చేసుకున్నాడు.ఈ సిరీస్‌లో 14 వికెట్లు తీసిన లెనాక్స్, శ్రీలంక స్పిన్నర్ అకిల ధనంజయతో కలిసి ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్ల జాబితాలో సంయుక్తంగా 10వ స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో స్పిన్ దిగ్గజాలు షేన్ వార్న్, అనిల్ కుంబ్లే, షాహిద్ అఫ్రిది సాధించిన 13 వికెట్ల రికార్డును అధిగమించాడు.31 ఏళ్ల లెనాక్స్ ఈ ఏడాది భారత్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన తర్వాత కేవలం తన మూడో ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా భారత్‌కు చెందిన అమిత్ మిశ్రా (18 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా, కుల్దీప్ యాదవ్ (17), రషీద్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్ (16) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.సిరీస్ అనంతరం మాట్లాడిన లెనాక్స్.. వెస్టిండీస్‌లోని స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌లు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపాడు. మిచెల్ సాంట్నర్ వంటి అనుభవజ్ఞుడిని దగ్గరగా గమనించడం ద్వారా బౌలింగ్‌లోని చిన్నచిన్న మెళకువలు నేర్చుకునే అవకాశం లభించిందని పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే, సిరీస్‌ను కోల్పోయిన వెస్టిండీస్ చివరి వన్డేలో మాత్రం రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. షిమ్రోన్ హెట్‌మైర్ అజేయంగా 69 పరుగులు చేయగా, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ 61 పరుగులతో రాణించి 269 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో కీలక పాత్ర పోషించారు. హెట్‌మైర్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. -
టీ20లపై మోజు.. వన్డేలు ఆడడం మరిచిన విండీస్!
సొంతగడ్డపై జరుగుతున్న వన్డే సిరీస్‌లో వెస్టిండీస్ దారుణ ఆటతీరు కనబరుస్తోంది. టీ20 క్రికెట్‌కు బాగా అలవాటు పడిన విండీస్ ఆటగాళ్లు వన్డేలు ఆడడం మరిచిపోయినట్లుగా కనిపిస్తున్నారు. వచ్చిందే తడవు భారీ ఇన్నింగ్స్‌లతో అలరించాలన్న మోజులో వన్డే ఫార్మాట్లో నిలకడగా ఆడితేనే పరుగులు వస్తాయన్న విషయాన్ని విండీస్ పూర్తిగా పక్కనబెట్టేసింది. తొలి వన్డే తర్వాత ఆడిన రెండు వన్డేల్లోనూ వెస్టిండీస్ 150 పరుగుల్లోపే ఆలౌట్ కావడం గమనార్హం. తాజాగా గయానా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో 6 వికెట్ల తేడాతో గెలుపొందిన న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. కివీస్ బౌలర్ జేడన్ లెనోక్స్ మరోసారి బౌలింగ్‌లో చెలరేగిన వేళ ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో కివీస్ 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 37.1 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. విండీస్ బ్యాటర్లలో కీసి కార్టి (48) టాప్ స్కోరర్‌గా నిలవగా, హెట్‌మైర్ (26) పర్వాలేదనిపించాడు. జేడన్ లెనోక్స్ 4 వికెట్లతో చెలరేగగా, మైకెల్ బ్రాస్‌వెల్, మిచెల్ సాంట్నర్లు చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం 141 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 39.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. డారిల్ మిచెల్ (28), హెన్రీ నికోల్స్ (24) ఆరంభంలో మెరుగ్గా ఆడారు. చివర్లో టామ్ లాథమ్ (31 నాటౌట్), డీన్ ఫాక్స్క్రాప్ట్ (22 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. వెస్టిండీస్ బౌలర్లలో విటెల్ లాస్ 3 వికెట్లు తీయగా, కేరీ పియర్రీ ఒక వికెట్ పడగొట్టాడు. ఇరుజట్ల మధ్య నాలుగో వన్డే జూలై 19న (ఆదివారం) బ్రిడ్జ్‌టౌన్ వేదికగా జరగనుంది.చదవండి: అక్షర్ పటేల్ అరుదైన ఫీట్.. ఆ ఇద్దరి సరసన చోటు -
జేడన్ పాంచ్ పటాకా.. విండీస్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్
వెస్టిండీస్ టూర్లో న్యూజిలాండ్ బోణీ కొట్టింది. కివీస్ బౌలర్ జేడన్ లిన్నెక్స్ ఐదు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. గయానా వేదికగా జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 36 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ జాన్ కాంప్‌బెల్ (43) టాప్ స్కోరర్‌గా నిలవగా, అమిర్ జాంగో (24) పర్వాలేదనిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో జేడన్ లెన్నోక్స్ 5 వికెట్లతో విండీస్ నడ్డి విరిచాడు. మైకెల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 32.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. టామ్ లాథమ్ (37 నాటౌట్),మైకెల్ బ్రాస్‌వెల్ (24 నాటౌట్) కివీస్ణు విజయతీరాలకు చేర్చారు. అంతకముందు విల్ యంగ్ (28), డారిల్ మిచెల్ (28) రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో ఖారీ పియర్రె 2 వికెట్లు తీయగా, అల్జారీ జోసెఫ్, గుదకేశ్ మోతీ చెరొక వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఇరుజట్లు 1-1తో సమంగా నిలిచాయి. జూలై 16న మూడో వన్డే జరగనుంది.


