credit: NewsBytes
న్యూజిలాండ్ ఎడమచేతి స్పిన్నర్ జేడెన్ లెనాక్స్ వెస్టిండీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సిరీస్‌లో మొత్తం 14 వికెట్లు పడగొట్టి, న్యూజిలాండ్‌కు 3-2తో సిరీస్ విజయాన్ని అందించడంతో పాటు 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డును సొంతం చేసుకున్నాడు.
ఈ సిరీస్‌లో 14 వికెట్లు తీసిన లెనాక్స్, శ్రీలంక స్పిన్నర్ అకిల ధనంజయతో కలిసి ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్ల జాబితాలో సంయుక్తంగా 10వ స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో స్పిన్ దిగ్గజాలు షేన్ వార్న్, అనిల్ కుంబ్లే, షాహిద్ అఫ్రిది సాధించిన 13 వికెట్ల రికార్డును అధిగమించాడు.
31 ఏళ్ల లెనాక్స్ ఈ ఏడాది భారత్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన తర్వాత కేవలం తన మూడో ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా భారత్‌కు చెందిన అమిత్ మిశ్రా (18 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా, కుల్దీప్ యాదవ్ (17), రషీద్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్ (16) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
సిరీస్ అనంతరం మాట్లాడిన లెనాక్స్.. వెస్టిండీస్‌లోని స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌లు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపాడు. మిచెల్ సాంట్నర్ వంటి అనుభవజ్ఞుడిని దగ్గరగా గమనించడం ద్వారా బౌలింగ్‌లోని చిన్నచిన్న మెళకువలు నేర్చుకునే అవకాశం లభించిందని పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే, సిరీస్‌ను కోల్పోయిన వెస్టిండీస్ చివరి వన్డేలో మాత్రం రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. షిమ్రోన్ హెట్‌మైర్ అజేయంగా 69 పరుగులు చేయగా, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ 61 పరుగులతో రాణించి 269 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో కీలక పాత్ర పోషించారు. హెట్‌మైర్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.


