Photo Credit: WIC Twitter
సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన వెస్టిండీస్ 1-2తో వెనుకంజలో ఉంది. ఈ నేపథ్యంలో చివరి రెండు వన్డేలో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే వెస్టిండీస్ తన జట్టులో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది.
చివరి రెండు వన్డేలకు గాయాలతో సతమతమవుతున్న ఆల్‌రౌండర్ జాన్ కాంప్‌బెల్, టెస్టు కెప్టెన్ రోస్టన్ చేజ్‌ల స్థానంలో బ్రాండన్ కింగ్, జస్టిన్ గ్రీవ్‌లను ఎంపిక చేసింది. ఈ మేరకు విండీస్ క్రికెట్ బోర్డు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. గాయాలు, ఫామ్ లేమీతో సతమతమవుతున్న జట్టులోకి వీరి రాకతో విండీస్ కాస్త బలంగా కనిపిస్తోంది.
కివీస్‌తో సిరీస్‌కు ముందు శ్రీలంకతో జరిగిన టెస్టు, వన్డే సిరీస్‌ల్లో జస్టిన్ గ్రీవ్స్ సభ్యుడిగా ఉన్నాడు. అయితే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు మాత్రం గ్రీవ్స్‌ను జట్టు నుంచి తప్పించారు. ఇక 2025 అక్టోబర్‌లో చివరి వన్డే మ్యాచ్ ఆడిన బ్రాండన్ కింగ్ అప్పటి నుంచి టెస్టులు, టీ20లకే పరిమితమయ్యాడు.
తాజాగా వన్డే ప్రపంచకప్‌కు సమయం దగ్గరపడుతుండడంతో బ్రాండన్ కింగ్‌ను జాన్ కాంప్‌బెల్ స్థానంలో జట్టులో పరిశీలించాలని విండీస్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. తల్లి అంత్యక్రియల కోసం షమర్ స్ప్రింగర్, వ్యక్తిగత కారణాలతో కారీ పియెర్రీ కూడా జట్టును వీడినట్లు తెలుస్తోంది. శ్రీలంకతో రెండో టెస్టు సందర్భంగా ఫీల్డింగ్ చేస్తుండగా రోస్టన్ చేజ్ కుడి చూపుడువేలికి గాయమైంది. అప్పటి నుంచి చేజ్ రీహాబిలిటేషన్‌లోనే చికిత్స తీసుకుంటున్నాడు.
మరోవైపు మూడో వన్డే సందర్భంగా కాంప్‌బెల్ తొడ కండరాల గాయంతో బాధపడ్డాడు. దీంతో అతడికి స్కానింగ్ చేయగా, గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలింది. కాంప్‌బెల్ మూడు వన్డేలు కలిపి 30 సగటుతో 60 పరుగుల మాత్రమే చేశాడు. మరోవైపు తొలి వన్డేలో ఓడినప్పటికీ వరుసగా రెండు, మూడు వన్డేలు గెలిచిన న్యూజిలాండ్ సిరీస్ విజయంపై కన్నేసింది. ఇరుజట్ల మధ్య నాలుగో వన్డే ఆదివారం బార్బడోస్ వేదికగా జరగనుంది.
చివరి రెండు వన్డేలకు విండీస్ జట్టు:
షెయ్ హోప్ (కెప్టెన్, వికెట్ కీపర్), అకీమ్ ఆగస్ట్, కీసీ కార్టీ, మాథ్యూ ఫోర్డ్, జస్టిన్ గ్రీవ్స్, షిమ్రాన్ హెట్‌మైర్, అమీర్ జంగూ, అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, విటెల్ లాస్, గుదకేష్ మోతీ, కీమో పాల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, జేడెన్ సీల్స్.


