ఏం తప్పు చేశాడని.. అతడిని పక్కనపెడుతున్నారు? | 1st man to be left out But He will be In WC Team: Aakash Chopra on Siraj | Sakshi
Sakshi News home page

ఏం తప్పు చేశాడని.. అతడిని పక్కనపెడుతున్నారు?

Jul 18 2026 3:00 PM | Updated on Jul 18 2026 4:16 PM

1st man to be left out But He will be In WC Team: Aakash Chopra on Siraj

సిరాజ్‌ (PC: BCCI X)

టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడి విషయంలో యాజమాన్యం వైఖరి అస్సలు బాగాలేదని విమర్శించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పేస్‌ విభాగం నుంచి ఎవరినైనా తప్పించాలంటే సెలక్టర్లు ముందుగా అతడిపైనే వేటు వేస్తారన్నాడు.

అవకాశం వస్తే ఇరగదీస్తాడు
అయితే, ఒక్కసారి అవకాశం దొరికితే సిరాజ్‌ తనను తాను నిరూపించుకునేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడని ఆకాశ్‌ చోప్రా ప్రశంసించాడు. కాగా 2017లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు సిరాజ్‌. ఈ హైదరాబాదీ స్టార్‌ ఇప్పటికి 46 టెస్టులు, 50 వన్డేలు, 17 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

ఈ రైటార్మ్‌ ఫాస్ట్‌బౌలర్‌ ఇప్పటికి టెస్టుల్లో 140, వన్డేల్లో 76, టీ20 మ్యాచ్‌లలో 17 వికెట్లు కూల్చాడు. ఇక ఈ ఏడాది సొంతగడ్డపై జనవరిలో న్యూజిలాండ్‌తో చివరగా వన్డే మ్యాచ్‌ ఆడిన సిరాజ్‌.. ప్రపంచకప్‌ టోర్నీ-2026లో భాగంగా అమెరికాతో ఆఖరిగా టీమిండియా తరఫున టీ20 బరిలో దిగాడు.

వన్డే జట్టులో దక్కని చోటు
అదే విధంగా అఫ్గానిస్తాన్‌ జూన్‌లో జరిగిన ఏకైక టెస్టులో పాల్గొన్న సిరాజ్‌కు.. ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌ నుంచి విశ్రాంతినిచ్చారు. అయితే, ఇంగ్లండ్‌తో వన్డేలకు మాత్రం అతడిని ఎంపిక చేయలేదు. సిరాజ్‌కు బదులు ప్రసిద్‌ కృష్ణకు టీ20, వన్డేలలో అవకాశం ఇచ్చారు.

సైలెంట్‌గా పక్కన పెట్టేస్తున్నారు
ఈ నేపథ్యంలో కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా సిరాజ్‌ విషయంలో మేనేజ్‌మెంట్‌ ఒక్కోసారి ఒక్కోలా వ్యవహరిస్తోందని విమర్శించాడు. ‘‘అతడిని సైలెంట్‌గా పక్కన పెట్టేస్తున్నారు. బంతి పాతబడే కొద్దీ ప్రభావం చూపలేడంటూ వన్డేల నుంచి మెల్లమెల్లిగా అతడిని పక్కనపెట్టారు.

ఇక టీ20 ఫార్మాట్‌కు కూడా చాలాకాలం దూరంగా ఉంచారు. కానీ వరల్డ్‌కప్‌ జట్టులో మాత్రం చోటిచ్చారు. అలా తుదిజట్టులోకి వచ్చిన తొలిరోజే అతడు మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచేలా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. ఆ తర్వాత మళ్లీ టోర్నీలో ఆడించలేదు.

అయితే, ఇప్పుడు అతడిని వన్డేల నుంచి పక్కనపెట్టే ప్రయత్నం జరుగుతున్నట్లు అనిపిస్తోంది. నిజానికి అతడి విషయంలో మేనేజ్‌మెంట్‌కు స్పష్టత లేనట్లు అనిపిస్తోంది. ఎప్పుడైనా వన్డే, టీ20 జట్ల పేస్‌ విభాగం నుంచి ఓ బౌలర్‌ను పక్కనపెట్టాలనుకుంటే ముందుగా అతడినే తప్పిస్తారు.

వన్డే వరల్డ్‌కప్‌ జట్టులో అతడు ఉంటాడు
అయితే, మున్ముందు అతడి అవసరం కచ్చితంగా ఉంటుందని నా అభిప్రాయం. అతడిని మీరు ఎక్కువకాలం పక్కనపెట్టలేరు. ఎందుకంటే టీమిండియా ఫాస్ట్‌ బౌలింగ్‌ విభాగంలో తరచూ మార్పులు కనిపిస్తున్నాయి. ఒక రకంగా గందరగోళం నెలకొందని చెప్పవచ్చు. కాబట్టి సిరాజ్‌ కచ్చితంగా వన్డే జట్టులోకి వస్తాడు. ముఖ్యంగా వన్డే వరల్డ్‌కప్‌ జట్టులో అతడు ఉంటాడు’’ అని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు.

కాగా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాపై పనిభారం తగ్గించే క్రమంలో బీసీసీఐ అతడికి ఎక్కువగా విశ్రాంతినిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌ సందర్భంగా గుర్నూర్‌ బ్రార్‌, ప్రిన్స్‌ యాదవ్‌ అరంగేట్రం చేశారు. ప్రసిద్‌ కృష్ణకు కూడా అవకాశం దొరికింది. అయితే, సిరాజ్‌ను మాత్రం ఎక్కువగా టెస్టులకే పరిమితం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చదవండి: విశ్రాంతి వద్దన్న రోహిత్‌.. అతడి కోసం గిల్‌ అనూహ్య నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement