భారత క్రికెట్ యువ కెరటం వైభవ్ సూర్యవంశీపై ఫార్ములా-1 సంచలనం, రేసింగ్ బుల్స్ డ్రైవర్ అర్విడ్ లిండ్బ్లాడ్ (Arvid Lindblad) ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ క్రీడల్లో చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభ కనబరుస్తున్న ఆటగాళ్లలో వైభవ్ కూడా ఒకడని కొనియాడాడు.
ఇటీవల ఇంగ్లండ్-భారత్ తొలి వన్డే సందర్భంగా స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడిన లిండ్బ్లాడ్.. సాంకేతికత అభివృద్ధి, చిన్న వయసులోనే మెరుగైన సమాచారం అందుబాటులోకి రావడం వల్ల యువ ఆటగాళ్లు అత్యున్నత స్థాయిలో రాణిస్తున్నారని చెప్పాడు.
"ఇది అన్ని క్రీడల్లో కనిపిస్తోంది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. చిన్న వయసులోనే సరైన సమాచారం, శిక్షణ లభిస్తోంది. అందుకే చాలా చిన్న వయసులోనే ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. క్రికెట్‌లో వైభవ్ సూర్యవంశీ, ఫుట్‌బాల్‌లో లమీన్ యమాల్ అందుకు మంచి ఉదాహరణలు.
వైభవ్ చాలా చిన్న వయసులోనే అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఇదే ఇప్పుడు ప్రపంచ క్రీడల స్వభావంగా మారింది" అని లిండ్బ్లాడ్ వ్యాఖ్యానించాడు.
ఇదే సందర్భంగా తన భారతీయ మూలాల గురించి కూడా అతడు మాట్లాడాడు. తన అమ్మమ్మ, తాతయ్య పంజాబ్‌కు చెందిన వారని, భారతీయ సంస్కృతితో తనకు బలమైన అనుబంధం ఉందని తెలిపాడు.
గతేడాది ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడిన అనుభవం ఎంతో ప్రత్యేకమని గుర్తు చేసుకున్నాడు. అలాగే తన అమ్మమ్మ వండే భారతీయ వంటకాలు తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు.
ఫార్ములా-1లో అడుగుపెట్టడం తన చిన్ననాటి కల అని, ఈ ఏడాది ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రిక్స్‌లో అరంగేట్రం చేసిన సమయంలో భావోద్వేగానికి గురయ్యానని లిండ్బ్లాడ్ వెల్లడించాడు. చిన్నప్పుడు తండ్రితో కలిసి తొలిసారి వెళ్లిన సిల్వర్‌స్టోన్ ట్రాక్‌లోనే ఎఫ్1 డ్రైవర్‌గా రేస్ చేయడం జీవితంలో మరపురాని క్షణమని పేర్కొన్నాడు.
అలాగే బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ సందర్భంగా భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను కలవడం ఆనందంగా అనిపించిందని చెప్పిన లిండ్బ్లాడ్, ఫార్ములా-1 కార్లు నడిపినా ఇప్పటికీ రోడ్డు డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం తీసుకోలేదని సరదాగా వ్యాఖ్యానించాడు.


