ముంబై: స్టాండ్ అప్ కమెడియన్ సమయ్ రైనా షో ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ రెండో సీజన్‌లో కంటెస్టెంట్ సాక్షి ఝా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. తాను పురుషులను పూర్తిగా ద్వేషిస్తానని, మద్యం తాగి, భర్తను చావగొట్టడమే తన నిజమైన కోరిక అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ ఆడిషన్ రౌండ్‌లో సాక్షి తనను తాను ‘మ్యాన్ హేటర్’గా అభివర్ణించుకున్నారు.
తన తండ్రి, సోదరుడితో సహా ప్రపంచంలోని పురుషులందరినీ ద్వేషిస్తానని ఆమె అనడం ప్యానెలిస్టులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలను అభ్యంతరకరంగా భావించిన జడ్జీలు, సమయ్ రైనాతో సహా అందరూ ఆమెకు సున్నా మార్కులు ఇచ్చారు. ప్రేక్షకులు కూడా ఆమె ప్రదర్శనకు సున్నా స్కోరు ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు.
ఒక బెల్టుతో భర్తను కొట్టడం తన ఫాంటసీ అని, జీవితంలో ‘రెడ్ ఫ్లాగ్’ ఉండాలని కోరుకుంటున్నానని ఆమె చెప్పడం గమనార్హం. బిహార్‌కి చెందిన సాక్షి ఝా వృత్తిరీత్యా ఉపాధ్యాయిని. సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్. అయితే, ఆమె మాటల తీరుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా వ్యాఖ్యలు ఫెమినిజం పట్ల తప్పుడు అభిప్రాయాన్ని కలిగిస్తాయని, ఇది కేవలం 'సూడో ఫెమినిస్ట్' ధోరణి అని విమర్శిస్తూ ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. సామాజిక బాధ్యతాయుతమైన వేదికలపై ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: ‘కంటే కూతుర్నే కనాలి’.. ఆస్పత్రిలో తండ్రి సందడి


