బెంగాల్ బరిలో నలుగురు రిపోర్టర్లు | 4 journalists script their Bengal poll debut | Sakshi
Sakshi News home page

బెంగాల్ బరిలో నలుగురు రిపోర్టర్లు

Apr 13 2026 1:57 PM | Updated on Apr 13 2026 2:17 PM

4 journalists script their Bengal poll debut

కోల్‌కతా:  ఎన్నికల సమయంలో మైకులు పట్టుకుని, నాయకుల వెంటపడే జర్నలిస్టులను మనం చూసేవుంటాం. అయితే ఇప్పుడు  ఓటర్ల ముందు చేతులు కట్టుకుని నిలుచుని, ఓట్లు అడుగుతున్న జర్నలిస్టులు తారసపడుతున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వైనం కనిపిస్తోంది. దశాబ్దాల పాటు వార్తలు రాసి, ఎన్నికల విశ్లేషణలు చేసి, నాయకులకు  ప్రశ్నలు వేసిన నలుగురు రిపోర్టర్లు ఇప్పుడు నేరుగా ఎన్నికల బరిలోకి దిగారు. న్యూస్ రూమ్ నుంచి నామినేషన్ సెంటర్ల వరకు వీరి ప్రయాణం పలు మలుపులు తిరిగింది. బెంగాల్ రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది.

ఖర్దహా నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తరపున జర్నలిస్ట్ దేవదీప్ పురోహిత్ బరిలో ఉన్నారు. స్థానికంగా తనకున్న పరిచయాలు, క్షేత్రస్థాయి అవగాహన తనను గెలిపిస్తాయని ఆయన నమ్ముతున్నారు. అయితే ఆయనకు ప్రత్యర్థులుగా కల్యాణ్ చక్రవర్తి (బీజేపీ), జాయ్‌దేబ్ ఘోష్ (కాంగ్రెస్), దేబ్‌జ్యోతి దాస్ (సీపీఐ-ఎం)గట్టి పోటీ ఇస్తున్నారు. సియురి (Siuri) నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా మరో జర్నలిస్ట్ జగన్నాథ్ ఛటోపాధ్యాయ్ పోటీ చేస్తున్నారు. ఒకప్పుడు నాయకుల ప్రసంగాలు కవర్ చేసిన ఆయన, ఇప్పుడు స్వయంగా ఇంటింటి ప్రచారంలో మునిగిపోయి ప్రజల మద్దతు కూడగడుతున్నారు.

మరోవైపు మేమారి నియోజకవర్గం నుంచి 25 ఏళ్ల సుదీర్ఘ పాత్రికేయ అనుభవం ఉన్న మానబ్ గుహక్.. బీజేపీ టికెట్‌పై బరిలో నిలిచారు. ఆయనపై టీఎంసీకి చెందిన రాసబిహారి హల్దర్ పోటీలో ఉన్నారు. అలాగే తారకేశ్వర్ నుంచి మరో రిపోర్టర్ సంతు పాన్ సైతం బీజేపీ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మే 4న వెలువడే ఎన్నికల ఫలితాల్లో వీరి జర్నలిజం అనుభవం ఓట్లుగా మారుతుందో లేదో వేచిచూడాలి.

ఇది కూడా చదవండి: అరుణాచల్ వివాదం: ‘డ్రాగన్’కు దిమ్మతిరిగే రిటర్న్ గిఫ్ట్

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement