న్యూఢిల్లీ: దేశ సరిహద్దుల్లో ఎప్పుడూ ఏదో ఒక కవ్వింపు చర్యకు పాల్పడే చైనాకు నెట్టింట మనవారు గట్టిగానే బుద్ధి చెబుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు చైనా తమ సొంత పేర్లు పెట్టుకుని ఆనందం పొందుతున్న వేళ, సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన ప్రయోగం వైరల్‌గా మారింది. డ్రాగన్ దేశం చేస్తున్న పనులకు కౌంటర్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో చైనాలోని ప్రముఖ నగరాలకు అచ్చమైన మన భారతీయ పేర్లు పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
అరుణాచల్ ప్రదేశ్‌ను తమ దేశంలోని జాంగ్నన్ ప్రాంతంగా పిలుచుకునే చైనా.. ఇటీవల అక్కడి 15 పర్వతాలు, ఐదు నివాస ప్రాంతాలు, నాలుగు కనుమలు, రెండు నదులు, ఒక సరస్సు సహా పలు ప్రాంతాలకు తమ భాషలో పేర్లు పెడుతూ ఓ జాబితాను విడుదల చేసింది. దీనిపై భారత విదేశాంగ శాఖ తీవ్ర స్థాయిలో మండిపడింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని, ఇలాంటి తప్పుడు వాదనలతో వాస్తవాలను మార్చలేరని, చైనా కుటిల యత్నాలను తిరస్కరిస్తున్నామని స్పష్టం చేసింది.
ఈ నేపధ్యంలో చైనా నగరాలకు భారతీయ పేర్లు సూచించమని ఏఐని అడగగా, అది ఇచ్చిన సమాధానాలు ఆశ్యర్యపోయేలా ఉన్నాయి. రాజధాని బీజింగ్ పేరును మన ఆధ్యాత్మిక నగరం బైజ్నాథ్‌గా మార్చేసింది. షాంఘై పేరును శంకరుని పేరు గుర్తు తెచ్చేలా శంఖై గా, గ్వాంగ్జౌను గంగా జ్యోతిగా, షెన్జెన్‌ను శాంతివనంగా మార్చింది. చెంగ్డూను చంద్రాపూర్ అని, జియాన్‌ను మహాశివుడిని గుర్తు చేసేలా శివాన్ అని, నాన్జింగ్‌ను నందిగ్రామ్ అని, హాంగ్జౌను హరిధామ్ అని, టియాంజిన్‌ను తేజస్ నగర్ అని, ఇక వుహాన్‌కు విశ్వనగర్ అని పేరు పెట్టింది.
2017లో దలైలామా అరుణాచల్ ప్రదేశ్ పర్యటన తర్వాత మొదలైన ఈ కవ్వింపు చర్యలను 2021, 2023, 2024లో కూడా చైనా కొనసాగించింది. గత ఏడాదీ 27 ప్రాంతాల పేర్లను మార్చే ప్రయత్నాన్ని భారత్ తీవ్రంగా తిప్పికొట్టింది. 2020 గాల్వన్ లోయ ఘర్షణ తర్వాత ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఎస్సీఓ సమ్మిట్ కోసం చైనా వెళ్లి అధ్యక్షుడు జిన్ పింగ్‌తో సమావేశం కావడం రెండు దేశాల మధ్య కాస్త సానుకూల వాతావరణాన్ని తీసుకువచ్చింది. ఇలాంటి తరుణంలో చైనా మళ్లీ పాత పద్ధతిలోనే రెచ్చగొట్టే చర్యలకు దిగడం, దానికి మన నెటిజన్లు ఏఐ ద్వారా ఇలా ఫన్నీగా బదులివ్వడం ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: దేశంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు.. అలర్ట్ జారీ


