దేశంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు.. అలర్ట్ జారీ | IMD issues alert for heatwave strong winds across India | Sakshi
Sakshi News home page

దేశంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు.. అలర్ట్ జారీ

Apr 13 2026 12:35 PM | Updated on Apr 13 2026 12:41 PM

IMD issues alert for heatwave strong winds across India

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వేసవి కాలం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఉదయం పది గంటలకే భానుడు భగభగలాడుతుండటంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. రానున్న రెండు వారాల్లో ఎండల తీవ్రత మరింత ఉగ్రరూపం దాల్చనుందని, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వేడి గాలులుల వీస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి)  హెచ్చరికలు జారీ చేసింది.

ఏప్రిల్ 17 నాటికి దేశ రాజధాని ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత ఏకంగా 41 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంటుందని ఐఎండి అంచనా వేసింది. ఏప్రిల్ 12 నుంచి 18 వరకు వాయువ్య భారతదేశంలో 4 నుంచి 6 డిగ్రీలు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి మధ్య ప్రాంతాల్లో 3 నుంచి 5 డిగ్రీలు, గుజరాత్, మహారాష్ట్రల్లో 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగనున్నాయి. ముఖ్యంగా సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో వడగాల్పుల ముప్పు తీవ్రంగా పొంచి ఉంది.
 

రాబోయే వారం రోజుల పాటు కోస్తా ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రాంతాల్లో విపరీతమైన ఉక్కపోత వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే అస్సాం, మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు ఎండల విషయంలో అప్రమత్తంగా ఉంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు.

 ఇది కూడా చదవండి: యోగి, సువేందుల వైరల్ వీడియో.. ‘ఎంత భక్తో’

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement