మాదకద్రవ్యాల ముప్పుపై మోదీ హెచ్చరిక | PM Modi raises alarm over drug abuse | Sakshi
Sakshi News home page

మాదకద్రవ్యాల ముప్పుపై మోదీ హెచ్చరిక

Nov 29 2026 11:33 AM | Updated on Nov 29 2026 11:33 AM

PM Modi raises alarm over drug abuse

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తన నెలవారీ రేడియో కార్యక్రమం 'మన్‌కీ బాత్‌' 140వ ఎపిసోడ్‌లో యువతను పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాల సమస్యపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం (నవంబర్ 29) ఉదయం 11 గంటలకు ప్రసారమైన ఈ కార్యక్రమంలో డ్రగ్స్‌, ఇతర మత్తు పదార్థాల వినియోగం యువత కలలు, ఆశయాలకు పెద్ద సవాలుగా మారుతోందని పేర్కొన్నారు. అయితే దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల వ్యతిరేక పోరాటంలో సమాజ భాగస్వామ్యం పెరుగుతుండటం సంతోషకరమన్నారు. వ్యసనానికి బానిసై, ఆ తర్వాత పట్టుదలతో దాని నుంచి బయటపడిన ఓ యువకుడితో మోదీ మాట్లాడారు. తమ అనుభవాల ద్వారా ఇతరులకు స్ఫూర్తినిస్తున్న యువతను అభినందించారు.

మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు చేపట్టిన ‘నషా ముక్త్ యువ అభియాన్‌’ కార్యక్రమం క్రమంగా ఊపందుకుంటోందని ప్రధాని తెలిపారు. యువత ఈ సమస్యపై అవగాహన పెంచుకోవడంతో పాటు వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో సమాజంలోని అన్ని వర్గాల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాలనలో ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధికి చేపట్టిన ‘మిషన్ కర్మయోగి’ ప్రాధాన్యాన్ని కూడా మోదీ వివరించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది, వైద్య ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు ప్రజలకు సేవలందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలు నేర్చుకునేందుకు 'ఐగాట్ కర్మయోగి' డిజిటల్ వేదిక ఉపయోగపడుతోందన్నారు. ఇందులో 17 భారతీయ భాషల్లో 7 వేలకు పైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. కృత్రిమ మేధ, నూతన సాంకేతికతలు, భారతీయ సంజ్ఞా భాష నేర్చుకోవడంపై ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.

‘నాగరిక్ దేవో భవ’ (పౌరుడే దేవుడు) అనేది మిషన్ కర్మయోగి ప్రధాన సూత్రమని ప్రధాని మోదీ తెలిపారు. 20 నుంచి 25 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు సైతం కొత్త విషయాలు నేర్చుకునేందుకు సమయం కేటాయించడం అభినందనీయమన్నారు.‘సంచార్ సాథీ’, ‘సండేస్ ఆన్ సైకిల్’, 'సాయిధామ్ ఫుడ్ బ్యాంక్' వంటి కార్యక్రమాలతో పాటు మ్యూజియంలు, కళలు, క్రీడలు, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాధాన్యాన్ని కూడా ఈ ఎపిసోడ్‌లో ప్రస్తావించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement