పునర్విభజనకు గ్రీన్‌సిగ్నల్‌ | Womens Reservation: Cabinet Clears Delimitation Linked Bill | Sakshi
Sakshi News home page

పునర్విభజనకు గ్రీన్‌సిగ్నల్‌

Nov 28 2026 1:09 AM | Updated on Nov 28 2026 1:12 AM

Womens Reservation: Cabinet Clears Delimitation Linked Bill

డీలిమిటేషన్‌ బిల్లులో సవరణలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం 

దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాల పరిష్కారానికి పెద్దపీట  

అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లు 50 శాతం ఏకరీతిన పెంపు  

రాష్ట్రాల మధ్య సీట్ల వాటా నిష్పత్తి 2051 వరకు యథాతథం  

2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన 

లోక్‌సభ సీట్ల సంఖ్య 543 నుంచి గరిష్టంగా 850కి పెంపు  

మహిళా రిజర్వేషన్ల అమలు డీలిమిటేషన్‌తో అనుసంధానం  

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో ముఖ్యమైన మలుపుగా భావిస్తున్న లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్‌) అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాలను ఏకరీతిగా 50 శాతం పెంచే ప్రతిపాదనతో కూడిన డీలిమిటేషన్‌ బిల్లులో సవరణలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్‌ శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీలోని సేవాతీర్థ్ లో సమావేశమైంది. పునర్విభజన బిల్లుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ప్రతిపాదిత సవరణల ప్రకారం.. పెరిగిన సీట్ల సంఖ్యను 2051 వరకు, అంటే మరో 25 ఏళ్లపాటు యథాతథంగా కొనసాగించేలా ఫ్రీజింగ్‌ అమల్లో ఉంటుంది. మహిళా రిజర్వేషన్ల అమలుతో ముడిపడిన ఈ సవరించిన డీలిమిటేషన్‌ బిల్లును వచ్చేవారం జరిగే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు  కేంద్రం సిద్ధమైంది.

ఈ నెల 30 నుంచి డిసెంబర్‌ 3వ తేదీ వరకు ప్రత్యేక సమావేశాలు జరుగనున్నాయి. లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 543 నుంచి గరిష్టంగా 850కి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందే పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు ఈ చర్య మార్గం సుగమం చేస్తుందని అధికార పక్షం పేర్కొంది.  

దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలకు పరిష్కారం  
ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన రాజ్యాంగ(131వ సవరణ) బిల్లుకు విపక్షాల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. ముఖ్యంగా డీలిమిటేషన్‌ను తదుపరి జనగణనతో ముడిపెట్టడంపై విపక్షాలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, తాజా జనాభా గణాంకాల ఆధారంగా సీట్ల కేటాయింపు జరిగితే ఉత్తరాది రాష్ట్రాల ప్రాతినిధ్యం పెరిగి, దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గే ప్రమాదం ఉందని వాదించాయి.

ఈ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. జనగణనతో సంబంధం లేకుండా, అన్ని రాష్ట్రాల్లో సమానంగా 50 శాతం సీట్లు పెంచే మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాల మధ్య ప్రస్తుతం అమల్లో ఉన్న సీట్ల వాటా నిష్పత్తిని 2051 వరకు యథాతథంగా కొనసాగించనున్నారు. జనాభా నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించిన రాష్ట్రాల ప్రాతినిధ్య వాటా తగ్గకుండా ఉండటమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశంగా చెబుతున్నారు. 

2011 జనాభా లెక్కల ఆధారంగానే..  
రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తిలో మార్పులు చేయకుండా, ప్రతి రాష్ట్రంలో జనాభా మార్పులకు అనుగుణంగా నియోజకవర్గాల హద్దులను పునర్విభజించేందుకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకునే అంశం ఈ బిల్లులో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ల అమలును డీలిమిటేషన్‌ ప్రక్రియతో అనుసంధానం చేస్తున్నారు. తదుపరి జనగణన పూర్తయ్యే వరకు వేచి చూడకుండా ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా బిల్లులో మార్పులు చేసినట్లు సమాచారం.

డీలిమిటేషన్‌ ఎప్పుడు చేపట్టాలి? ఏ జనాభా లెక్కలను ఉపయోగించాలి? వంటి అంశాలను సాధారణ చట్టం ద్వారా పార్లమెంట్‌ నిర్ణయించేలా రాజ్యాంగ సవరణ(131వ సవరణ బిల్లు)లో ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిసింది. సుప్రీంకోర్టు ప్రస్తుత లేదా మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన డీలిమిటేషన్‌ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ లేదా ఆయన నామినేట్‌ చేసిన ఎన్నికల కమిషనర్‌తోపాటు సంబంధిత రాష్ట్ర ఎన్నికల కమిషనర్లను ఇందులో సభ్యులుగా నియమించే అవకాశం ఉంది.  

50 శాతం ఫార్ములాతో తెలుగు రాష్ట్రాల వాటా  
కేంద్రం ప్రతిపాదించిన 50 శాతం ఏకరీతి పెంపు ప్రతిపాదన అమల్లోకి వస్తే పార్లమెంట్‌లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రాతినిధ్యం గణనీయంగా పెరగనుంది. జనాభా నియంత్రణ కారణంగా సీట్లు తగ్గిపోతాయన్న ఆందోళనకు తెరపడుతుంది.  
ప్రస్తుత నిష్పత్తి ప్రకారమే సీట్ల పెంపు జరిగితే సీట్ల ఇలా ఉండవచ్చని అంచనా.  
రాష్ట్రం    ప్రస్తుత సీట్లు    50 శాతం పెరిగేవి    మొత్తం సీట్లు(అంచనా)    లోక్‌సభ మొత్తం సీట్లలో వాటా(శాతం)  

ఆంధ్రప్రదేశ్‌    25    12–13    37–38    4.65  
తెలంగాణ    17    8–9    25–26    3.18  
––––––––––––––––––––––––––––––––––––  
రెండు రాష్ట్రాల్లో మొత్తం    42    21–22    63–64    7.83  

డీలిమిటేషన్‌ అంటే? 
జనాభా మార్పులకు అనుగుణంగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల భౌగోళిక హద్దుల్లో మార్పులు చేర్పులు చేసే ప్రక్రియను డీలిమిటేషన్‌ అంటారు. అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం లభించేలా చూడటం దీని ప్రధాన లక్ష్యం. దేశానికి స్వాతంత్య్రం వచి్చన తర్వాత పలు దఫాల్లో డీలిమిటేషన్‌ కమిషన్లు ఏర్పడ్డాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల హద్దులు గత డీలిమిటేషన్‌ ప్రక్రియ ఆధారంగా రూపొందించినవే.  

మరి అసెంబ్లీ సీట్ల మాటేమిటి?  
కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన సవరణలు ప్రధానంగా లోక్‌సభ సీట్ల పెంపు, ప్రాతినిధ్య నిష్పత్తి కొనసాగింపు వంటి అంశాలపైనే కేంద్రీకృతమై ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీ సీట్ల సంఖ్యను కూడా 50 శాతం పెంచుతున్నట్లు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. డీలిమిటేషన్‌ కమిషన్‌ పరిధిలో లోక్‌సభతోపాటు రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలను చేర్చనున్నట్లు తెలుస్తోంది. దీంతో భవిష్యత్తులో జరిగే పునర్విభజన ప్రక్రియలో అసెంబ్లీ నియోజకవర్గాల హద్దుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

మహిళా రిజర్వేషన్‌ నిబంధనలు లోక్‌సభతోపాటు రాష్ట్ర శాసనసభలకు కూడా వర్తించనున్నాయి. నియోజకవర్గాల తుది రూపకల్పనలో ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. అసెంబ్లీ స్థానాల సంఖ్య, వాటి పెంపు లేదా ప్రత్యేక నిబంధనలపై పూర్తి స్పష్టత మాత్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బిల్లు తుది పాఠం వెలువడిన తర్వాతే రానుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement