రాజ్యాంగం కోట్లాది పౌరుల్లో అంతర్భాగం  | Constitution integral to crores of citizens but one party misused it repeatedly | Sakshi
Sakshi News home page

రాజ్యాంగం కోట్లాది పౌరుల్లో అంతర్భాగం 

Nov 27 2026 5:58 AM | Updated on Nov 27 2026 5:58 AM

Constitution integral to crores of citizens but one party misused it repeatedly

కానీ రాజ్యాంగాన్ని ఒక పార్టీ పదేపదే దుర్వినియోగం చేసింది 

ఎమర్జెన్సీ కాలంలో రాజ్యాంగ సవరణ తెచ్చి న్యాయ సమీక్షను కుదించారు 

చట్టబద్ధ సంస్థల మధ్య సమతుల్యాన్ని నాశనం చేశారు 

రాజ్యాంగ దినోత్సవం వేళ కాంగ్రెస్‌పై మోదీ 

పరోక్ష పదునైన విమర్శలు

న్యూఢిల్లీ: భారత రాజ్యాంగం కోట్లాది మంది భారతీయ పౌరుల్లో సదా అంతర్భాగంగా పరిఢవిల్లుతోందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఆనందోత్సాహాల నడుమ రాజ్యాంగ దినోత్సవాన్ని గురువారం నిర్వహించుకుంటున్న వేళ విపక్ష కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ పరోక్షంగా పదునైన విమర్శలు గుప్పించారు. ఈ మేరకు మోదీ దేశంలోని ప్రధాన వార్తాపత్రికలకు ఒక ప్రత్యేక వ్యాసం రాసి పంపించారు. అందులోని ముఖ్యాంశాలు ఆయన గురువారం తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్ట్‌చేశారు. ఆర్టీకల్‌లోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. 

అందరిలోనూ స్ఫూర్తి 
‘‘అత్యంత వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తుల్లోనూ మన రాజ్యాంగం అసాధారణ స్ఫూర్తిని రగిలిస్తోంది. భారత్‌లో వెలుగులీనుతున్న మన దేశం ఎన్నో మత విశ్వాసాలు, ఆచారాలు, భాషలు, సంప్రదాయాలు, ఆలోచనల ప్రతిబింబం. పార్లమెంట్, న్యాయస్థానాలకు ఆవల సైతం రాజ్యాంగం తనదైన ప్రాధాన్యతతో ప్రతిధ్వనించాలి. నవంబరు 26న రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఈ రోజు డాక్టర్‌ రాజేంద్రప్రసాద్, డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌లతోపాటు నాటి రాజ్యాంగ నిర్మాణ సభలోని ప్రతి ఒక్క సభ్యుడినీ స్మరించుకుంటున్నాం’’అని అన్నారు. 

100 సార్లు ఆ ఆర్టీకల్‌ను ప్రయోగించారు 
‘‘ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసేందుకు ఒక రాజకీయ పార్టీ 356 ఆర్టికల్‌ను దాదాపు 100 సార్లు ప్రయోగించి అత్యంత దారుణంగా దుర్వినియోగంచేసింది. ఒక మాజీ ప్రధానమంత్రి అయితే ఈ ఆర్టీకల్‌ విషయంలో ఏకంగా హాఫ్‌ సెంచరీ చేశారు. వాస్తవానికి మన రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగం దేశవ్యాప్తంగా ఎంతో స్ఫూర్తిదాయకంగా, ప్రతి పదం అమలవ్వాలని ఆశించారు. 

కానీ ఒక పార్టీ ఎమర్జెన్సీ వంటి అత్యయిక పరిస్థితులను కల్పించి 42వ రాజ్యాంగ సవరణ తెచ్చి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సవరణతో న్యాయసమీక్షను కుదించారు. రాజ్యాంగబద్ధ సంస్థల అధికారాలకు కోతపెట్టారు. అధికారదాహంతో చెలరేగిపోయిన, రాజ్యాంగవ్యతిరేక నాయకత్వాలు చేసిన ఘోర తప్పిదాలు తెలియాలంటే నేటి యువత 38వ, 39వ రాజ్యాంగ సవరణలను ఒకసారి చదవాలి’’అని చెప్పారు. 

నా జీవితంలో అంతర్భాగం 
‘‘నా రాజకీయ జీవితంలో రాజ్యాంగం విడదీయలేని అంతర్భాగంగా కలిసిపోయింది. ఎన్‌డీఏ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక న్యాయ చేకూరుస్తూ రాజ్యాంగాన్ని మరింత పటిష్టవంతంచేసింది. దేశాన్ని ఐదు దశాబ్దాలపాటు పాలించిన అదే పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా కంటే అడ్డంకులు సృష్టించే పార్టీగా తయారైంది. 70 ఏళ్లకుపైగా జమ్మూకశ్మీర్‌లో భారత రాజ్యాంగం అమలుకు నోచుకోకుండా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ,మహిళల హక్కులు కాలరాసేలా ఆర్టీకల్‌ 370, ఆర్టీకల్‌ 35ఏలు అడ్డుగా నిలిచాయి. 

ఈ చారిత్రక తప్పిదాన్ని మేం 2019లో సరిచేశాం. దేశంలో 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినట్లు స్వయంగా ప్రపంచ బ్యాంక్‌ నివేదించింది. 101వ సవరణ ద్వారా జీఎస్టీతో సంస్కరణలు తెచ్చాం. వెనకబడిన వర్గాల కల అయిన జాతీయ బీసీ కమిషన్‌ను 102వ సవరణ ద్వారా సాకారంచేశాం. 1950 తర్వాత తొలిసారిగా 8వ షెడ్యూల్‌లో పేర్కొన్న మొత్తం 22 భాషల్లోనూ రాజ్యాంగం అధునాతన వెర్షన్‌ అందరికీ అందుబాటులోకి వచ్చింది. వలసపాలన నాటి దండన(శిక్ష్మాసృతి) నుంచి మనదైన ఆధునిక న్యాయసంహిత చట్టాల్లోకి మారాం.

 భారత్‌ ఇప్పుడు నిర్ణయాత్మక దశకు చేరుకుంది. వికసిత్‌ భారత్‌2047 కల సాకారం కోసం కేంద్రప్రభుత్వం శ్రమిస్తోంది. పౌరులుగా మీరంతా రెండు సులభ, శక్తివంతమైన సూత్రాలను పాటించగలరు. అవి ఆలోచనలో ‘ఇండియా ఫస్ట్‌’, ఆచరణలో ‘కర్తవ్య పాలన’. చట్టసభలలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించే ఉద్దేశంతో మేం తెచ్చిన ప్రతిష్టాత్మక బిల్లు ఆమోదం పొందకుండా ఒక ప్రతిపక్ష పార్టీ అడ్డుకుంది. ఇలా ఈ పార్టీ రాజ్యాంగ విలువలపై తన తిరస్కార భావాన్ని మరోసారి బయటపెట్టుకుంది. కానీ, భారతదేశ నారీ శక్తికి న్యాయం జరగకుండా ఏ శక్తీ ఆపలేదు అని నేను హామీ ఇస్తున్నా’’అని అన్నారు.

దేశ ప్రజాస్వామ్య అపురూప వారసత్వం 
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్‌మీడియాలో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘మన రాజ్యాంగం అనేది దేశ ప్రజాస్వామ్యానికి అపురూప, వెలకట్టలేని వారసత్వంగా వస్తోంది. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. అభివృద్ధి చెందిన భారత్‌(వికసిత్‌ భారత్‌)గా దేశం అవతరించాలనే కలను నిజం చేయడంలో రాజ్యాంగం మనకు నిరంతరం మార్గదర్శకంగా నిలుస్తోంది. రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను పాటిస్తూ దేశాన్ని మరింత సుసంపన్నం చేసుకుందాం. ఈ సందర్భంగా ఆనాడు రాజ్యాంగ పరిషత్‌లో రాజ్యాంగాన్ని ఆమోదించిన బీఆర్‌ అంబేడ్కర్‌సహా దిగ్గజ నేతలందరినీ స్మరించుకుందాం. రాజ్యాంగాన్ని దేశ ప్రజాస్వామ్య అపురూప వారసత్వంగా అందించిన ప్రతి ఒక్కరికీ నివాళులు’’అంటూ మోదీ వ్యాఖ్యానించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement