డీఎంకే మద్దతుపై ఉత్కంఠ! కాంగ్రెస్‌ ఎంపీ కీలక వ్యాఖ్యలు! | DMK Support Delimitation Bill Conditions | Sakshi
Sakshi News home page

డీఎంకే మద్దతుపై ఉత్కంఠ! కాంగ్రెస్‌ ఎంపీ కీలక వ్యాఖ్యలు!

Nov 27 2026 11:42 AM | Updated on Nov 27 2026 11:59 AM

DMK Support Delimitation Bill Conditions

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు డీఎంకే మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయన్న చర్చ మొదలైంది. కొన్ని షరతులకు అంగీకరిస్తే బిల్లుకు మద్దతు ఇచ్చేందుకు డీఎంకే ఎంపీలు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్‌ ఎంపీ మనోజ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీంతో ఇండియా కూటమిలో ఈ అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

బుధవారం జరిగిన స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో డీఎంకే ఎంపీలతో మాట్లాడినట్లు మనోజ్‌ కుమార్‌ తెలిపారు. పునర్విభజన బిల్లుపై పార్టీ వైఖరిని అడగ్గా.. కొన్ని షరతులతో మద్దతు ఇవ్వవచ్చని వారు చెప్పినట్లు వివరించారు. అయితే ఆ షరతులేమిటో కచ్చితంగా గుర్తులేవని పేర్కొన్నారు. పార్టీ తుది నిర్ణయం మాత్రం అగ్ర నాయకత్వమే తీసుకుంటుందని తెలిపారు.

మరోవైపు, డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్‌ ఇళంగోవన్‌ మాట్లాడుతూ.. గతంలో ప్రవేశపెట్టిన బిల్లును తమ పార్టీ వ్యతిరేకించిందన్నారు. కొత్త బిల్లులో ప్రభుత్వం చేసిన మార్పులను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రాల ప్రయోజనాలు, వాటి అభ్యంతరాలకు కొత్త బిల్లులో ప్రాధాన్యం ఇస్తే పరిశీలిస్తామని పేర్కొన్నారు.

కాగా, నవంబర్‌ 30 నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. లోక్‌సభ నవంబర్‌ 30న, రాజ్యసభ డిసెంబర్‌ 2న సమావేశం కావాలని ప్రభుత్వం ప్రతిపాదించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. డిసెంబర్‌ 3 నాటికి సమావేశాలు ముగిసే అవకాశం ఉందన్నారు. అయితే అజెండాను ఇంకా ప్రకటించలేదు. ఈ సమావేశాల్లో పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లులను మళ్లీ తెరపైకి తీసుకురావచ్చనే చర్చ జరుగుతోంది.

గత ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందలేదు. ఏప్రిల్‌ 17న జరిగిన ఓటింగ్‌లో 298 మంది అనుకూలంగా, 230 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. బిల్లు ఆమోదానికి 352 ఓట్లు అవసరం కాగా.. ప్రభుత్వం 54 ఓట్ల తేడాతో వెనుకబడింది. ఈ బిల్లులో లోక్‌సభ స్థానాల పెంపుతోపాటు లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదన ఉంది.

ప్రస్తుతం లోక్‌సభలో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. స్పీకర్‌ను మినహాయించి 539 మంది సభ్యులు ఓటు వేస్తే రాజ్యాంగ సవరణకు 360 ఓట్లు అవసరమవుతాయి. ఎన్డీయేకు మిత్రపక్షాలతో కలిపి 298 మంది సభ్యుల బలం ఉందని అంచనా. అకాలీదళ్‌ ఎంపీ హర్‌సిమ్రత్‌ కౌర్‌ మద్దతుతో ఈ సంఖ్య 299కు చేరవచ్చు. తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన 20 మంది అసమ్మతి ఎంపీల మద్దతు లభిస్తే 319కు పెరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

ఇక డీఎంకేకు చెందిన 22 మంది, ఎన్సీపీకి చెందిన ఎనిమిది మంది, వైఎస్సార్‌సీపీకి చెందిన నలుగురు ఎంపీలు మద్దతు ఇస్తే ఎన్డీయే బలం 353కు చేరుతుందని లెక్కలు సూచిస్తున్నాయి. అయితే ఓటింగ్‌లో పాల్గొనే సభ్యుల సంఖ్యను బట్టి అవసరమైన మెజారిటీ మారుతుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో డీఎంకేతో పాటు ఇతర పార్టీల వైఖరి ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: నేడు కేంద్ర కేబినేట్‌ భేటీ.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement