ఇన్ బాక్స్
ఆటోమొబైల్ రంగంలో భారత్ ప్రపంచంలో జపాన్‌ను వెనక్కి నెట్టి మూడవ స్థానంలోకి దూసుకొచ్చింది. వాడేసిన టైర్లు నానాటికీ పెద్ద మొత్తంలో పోగుపడుతున్నాయి. దీనికి తోడు ప్రతి సంవత్సరం దాదాపు ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల వాడేసిన టైర్లు యూకే, ఆస్ట్రేలియా, యూఏఈల నుంచి ఇండియాకు దిగుమతి అవుతున్నాయి.
ప్రతి రోజూ ఇండియాలో 2.75 లక్షల వాడేసిన టైర్లు పుట్టుకొస్తున్నాయి. ఇవి తేలిగ్గా భూమిలో కలిసిపోవు. టైర్లకు నిప్పు అంటుకొంటే పర్యావరణంలోకి విష వాయువులు విడుదలవుతాయి. ప్రపంచం మొత్తం మీద ప్రతి ఏడాది 150 కోట్ల వాడేసిన టైర్లను పారేస్తుంటారు. మాములు టైరు 30,000 వేల కి.మీ. వరకు పని చేస్తుంది.
టైర్లు బయోడిగ్రేడబుల్ వ్యర్థాలు కావు. సహజ వాతావరణంలో సులభంగా విచ్ఛిన్నం కావు. టైర్లను కరగపెట్టలేము. ఒక వేళ కరగపెట్టాలని చూసినా పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పెద్ద సంఖ్యలో నిల్వ చేసినప్పుడు టైర్లు కూడా అగ్ని ప్రమాదాన్ని కలిగిస్తాయి. టైర్లు నేల, నీటిలో హానికరమైన రసాయనాలను విడుదల చేస్తాయి. దిగుమతి చేసుకున్న టైర్ల మీద కొత్తగా రబ్బర్ పొరవేసి మరోసారి ట్యాక్సీలు, ఇతర వాహనాలకు అమరుస్తున్నారు. ఇలాంటి టైర్లను వేగంగా వెళ్ళే వాహనాలకు ఉపయోగించడం సరికాదని నిపుణులు చెబుతున్నారు.
టైర్లతో పైరోలిసిస్ ఆయిల్ భారత్‌లో ఉత్పత్తి చేస్తున్నారు. దీన్ని సిమెంట్, పింగాణీ తదితర కర్మాగారాల్లో ఇంధనంగా వినియోగిస్తున్నారు. పైరోలిసిస్ ఆయిల్ కోసం టైర్లను మండించడం వల్ల పెద్దమొత్తంలో కర్బన ఉద్గారాలు వాతావరణంలోకి విడుదలవు తున్నాయి. టైర్లు, రబ్బర్ల పునఃశుద్ధి సంఘం (టీఆర్‌ఎస్‌ఏఐ) లెక్కల ప్రకారం భారత్‌లో 800 నమోదైన టైర్ల పునఃశుద్ధి కేంద్రాలున్నాయి. ఇందులో దాదాపు 650 కర్మాగారాలు పైరోలిసిస్ ఆయిల్ ఉత్పత్తి చేస్తున్నాయి. కర్బన ఉద్గారాల ప్రవాహం ఇలాగే కొనసాగితే గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది.
వాడేసిన టైర్లతో కన్వేయర్ బెల్టులు, డోర్ మ్యాట్లు, షూ లేసులు, రబ్బరు షీట్లు, హోస్ పైపుల లాంటివి తయారు చేయవచ్చు. మహారాష్ట్రలోని పుణెకు చెందిన పూజా ఆప్టే రీసైక్లింగ్‌పై ఉన్న మక్కువతో పాతటైర్లతో చెప్పులు తయారుచేయడానికి బ్లింక్‌గ్రీన్ అనే స్టార్టప్‌ను మొదలుపెట్టింది. ఇలాంటి ఆలోచనలే ఇప్పుడు అవసరం.
– తరిగొప్పుల వీఎల్లెన్ మూర్తి, సీనియర్ జర్నలిస్ట్


