విశ్లేషణ
నవంబర్ 20న వెలువడిన ఒక ప్రకటన వైజ్ఞానిక ప్రపంచాన్ని కుదిపింది. తుర్కి యేకి చెందిన లెవెంట్ అల్పాజ్ అనే గణిత శాస్త్రవేత్త తన వెబ్‌సైట్‌లో చేసిన ప్రకటన ఈ సంచలనానికి మూల బిందువు. రీమన్ హైపోథీసిస్‌కు ఆధారాన్ని కనుగొన్నట్లు ‘ఆంత్రోపిక్’లో పనిచేస్తున్న లెవెంట్ ప్రక టించారు. రీమన్ గణిత సమస్య 165 ఏళ్ళుగా అపరిష్కృతం. ‘‘కొంతకాలంగా నేను, క్లాడ్ కలసి గొప్పగా పనిచేస్తున్నాం. విజయాన్ని నిర్ణయించే రేఖ వద్దకు వచ్చేసరికి అది నన్ను వెనక్కి నెట్టేసింది’’ అని వ్యాఖ్యానించారు.
గణిత శాస్త్ర ప్రాథమిక పునాదుల వంటి ప్రధాన సంఖ్యలకుసంబంధించిన ఓ ప్రహేళిక రీమన్ హైపోథీసిస్‌గా ప్రాచుర్యంలోఉంది. జర్మన్ గణిత శాస్త్రవేత్త జార్జ్ ఫ్రెడరిక్ రీమన్ 1859లో దీన్ని ప్రతిపాదించారు. దాన్ని నిరూపించే ఆధారాలను వివరిస్తూ అల్పాజ్ దాదాపు 2,50,000 పేజీలను అందించారు. క్లాడ్, అల్పాజ్ కలిసి నిజంగానే ఆ పజిల్‌ను ఛేదించారని అగ్రశ్రేణి గణిత శాస్త్రవేత్తలు కొందరు ప్రశంసలు కురిపించారు. అయితే, ఆ ఫలితాల నిగ్గుదేలి, ఒక సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురణకు నోచుకున్నప్పుడే దానికిఅంతిమ ఆమోదం లభించినట్లు లెక్క.
ఏళ్ల పరిశోధనలు వారాల్లో...
శాస్త్రీయ పరిశోధనతో సహా మానవాళికి చెందిన వివిధ కార్య కలాపాలపై ఏఐ సాధనాలు రెండేళ్ళుగా నాటకీయమైన ప్రభావాన్ని కనబరుస్తున్నాయి. జీవశాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్రం, పదార్థ విజ్ఞానం, జన్యు శాస్త్రం, రోబోటిక్స్, కంప్యూటర్ సైన్స్, వాతావరణ శాస్త్రం వంటి డేటా అపారంగా ఉండే పరిశోధనల్లో ఏఐ సాధనాలను శాస్త్రవేత్తలు విరివిగా ఉపయోగిస్తున్నారు. అటువంటి పరిశోధనలకు కంపెనీలు ప్రత్యేక సాధనాలను రూపొందించాయి. ఆల్ఫాఫోల్డ్‌ను గూగుల్ డీప్‌మైండ్ అభివృద్ధి చేసింది. అమీనో యాసిడ్ సీక్వెన్సుల నుంచి త్రీ డైమెన్షనల్ ప్రొటీన్ నిర్మాణాలను రూపుకట్టించేందుకు దాన్ని తయారు చేశారు.
ఈ మోడల్‌ను రూపొందించినందుకుగాను, 2024లో రసాయనిక శాస్త్ర నోబెల్ బహుమతిని డీప్‌మైండ్ పరిశోధకులు పంచుకున్నారు. మనం ఎరిగిన అన్ని జీవాల్లోనూ కలసి దాదాపు 20 కోట్ల రకాల ప్రొటీన్లు ఉంటాయి. వాటన్నింటి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకునేందుకు వేలకొద్దీ సంవత్సరాలు పడుతుంది. అదే, ఆల్ఫాఫోల్డ్ ఒక ప్రోటీన్ 3డి స్ట్రక్చర్‌ను కొన్ని గంటలు లేదా రోజుల వ్యవధిలో చూపించగలదు. సంప్రదాయ సాధనాలతో అదే పని చేయడానికి నెలలు లేదా ఏళ్ళు పడతాయి. నూతన ఔషధాలు, చికిత్సా మార్గాలు కనుగొనే ప్రక్రియను ఈ ప్రొటీన్ నిర్మాణ అధ్యయనాలు వేగవంతం చేయగలవు.
అంతరిక్ష ఖగోళ విజ్ఞానం అపారమైన డేటాను జనింపజేసే మరో రంగం. ఆ డేటా అంతటినీ జల్లెడపట్టి, నూతన ఆవిష్కరణలు చేసేందుకు సైంటిస్టులకు ఏళ్ళ సమయం పడుతుంది. ఏఐ సాధ నాలు ఈ సమయాన్ని కొన్ని నెలలు, వారాల వ్యవధికి కుదించగలి గాయి. మన సూర్యుని చుట్టూ కాకుండా, ఇతర నక్షత్రాల కక్ష్యలలో తిరిగే గ్రహాలను ఎగ్జో ప్లానెట్లు అంటారు. అటువంటి సుమారు 370 కొత్త ఎగ్జో ప్లానెట్లను కనుగొనడం వీటివల్ల సాధ్యమైంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) గతంలో నిర్వహించిన అంతరిక్ష యాత్రల సందర్భంగా డేటా కొండలకొద్దీ పోగయింది. ఏఐ సాధ నాల సాయంతో ఆ డేటా గనులను తవ్వితీస్తున్నప్పుడు కొన్ని వేల ఎగ్జో ప్లానెట్ క్యాండిడేట్లను గుర్తించారు. హబుల్ టెలిస్కోప్ సేకరించిన లక్షలకొద్దీ చిత్రాలను విశ్లేషించి, విషయ గ్రహణ చేసేందుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సైంటిస్టులు కూడా కొన్ని ఏఐ సాధనాలను అభివృద్ధి చేశారు.
శాస్త్రవేత్తలకు విలువైన తోడు
స్వయంచాలిత డేటా విశ్లేషణకు మాత్రమేకాక, మొత్తం శాస్త్రీయ పరిశోధన ప్రక్రియలను తమంతట తాము నిర్వహించేవిగా ఏఐ కంపెనీలు ఆ సాధనాలను సృష్టిస్తున్నాయి. ఐడియా ఇవ్వడం నుంచి పరిశోధన పత్రం ప్రచురితమయ్యేంత వరకు అన్ని పనులను ఏఐ సాధనాలే చూసుకుంటాయి! సాకాన అనే జపనీస్ కంపెనీ ఏఐసైంటిస్ట్‌ను అభివృద్ధి చేసింది. మెషీన్ లెర్నింగ్ సైన్స్కు చెందిన ఓ ప్రయోగాన్ని పరీక్షకు పెట్టినపుడు, ఏఐ సైంటిస్ట్ ఆ పరిశీలనా పరీక్షలో నెగ్గింది. ఏఐ సైంటిస్ట్‌కు కూడా అనివార్యంగా కొన్ని హద్దు లుంటాయి. కానీ, శాస్త్రీయ హేతుబద్ధతను ప్రదర్శించడంలో అది సఫలమైంది. శాస్త్రీయ పరిశోధనలో పాటించవలసిన కొన్ని వరుస క్రమాలను అది దానికంతట అదే అనుసరించింది. మానవ సైంటి ఫిక్ పరిశోధకుడి స్థానాన్ని అది పూర్తిగా భర్తీ చేయలేకపోవచ్చుకానీ, కొందరు సైంటిస్టులు ఏజెంటిక్ ఏఐని ఒక నూతన పరిశోధన సాధనంగా లేదా ఒక తెలివైన రిసెర్చ్ అసిస్టెంట్‌గా పరిగ ణిస్తున్నారు.
ప్రతికూల ప్రభావాలు
ఈ పర్యవసానాలు సైన్స్ పైన, సమాజంపైన కూడా ఉండి తీరుతాయి. డేటా కుప్పతెప్పలుగా ఉండే విభాగాల్లో, ఏఐ చేయూ తతో లేదా పూర్తిగా ఏఐతో సాగే పరిశోధన సైన్స్ను ఒక నిర్దిష్ట దిశలో నడిపిస్తుంది. దాంతో అధ్యయనానికి చేపడుతున్న శాస్త్రీయ అంశాల దృష్టిని ఏఐ కుంచింపజేస్తోంది. శాస్త్రీయ పరిశోధనల్లో ఏఐని ఉప యోగించుకోవడంపై ఇతరత్రా కూడా కొన్ని ఆందోళనలను రాయల్ సొసైటీ రేకెత్తించింది. పునరుత్పాదనకున్న అవకాశాలను పరిశీలించడం పరిశోధనలకు సంబంధించి ఒక ప్రాథమిక విధి. ఏఐ చేయూతతో సాగే పరిశోధనలు ఆ పని చేయలేకపోతున్నాయి. లార్జ్ లాంగ్వేజ్ మోడళ్ళు, ఏజెంటిక్ ఏఐ సాధనాలు వంటి వినియోగ పద్ధతులు కొన్ని యాజమాన్య ఆధారిత ఉత్పత్తులు కనుక వాటి పునర్వినియోగం సాధ్యపడకపోవచ్చు. ‘నాసా’ అభివృద్ధి చేసిన కొన్ని సాధనాలు మాత్రం ఓపెన్ సోర్స్ కిందకు వస్తాయి. మిగిలిన వాటిలో చాలా భాగం వాణిజ్య ఉత్పత్తులుగా ఉన్నాయి.
ఏఐ ఏజెంట్‌తో లేదా ఏఐ రిసెర్చ్ అసిస్టెంట్‌తో కలసి ఓ వ్యక్తి పరిశోధన సాగిస్తే నైతికతకు సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. ఆ పరిశోధన పత్రాల కర్తృత్వం ఎవరికివ్వాలి? మేధా హక్కులు ఎవరికి చెందుతాయి? సైంటిఫిక్ ఏఐ ఏజెంట్లు మాట్లా డటం ప్రారంభిస్తే, కొత్త డేటాతో కొలాబరేట్ అవుతే, దాన్ని లీక్‌చేస్తే పరిస్థితి ఏమిటి? ఈ ఏఐ సాధనాలు అవాంఛనీయ వ్యక్తుల చేతుల్లో పడితే ఏంగాను? అది రసాయనిక, జీవ, అణ్వాయుధాల విషయంలో అనధికారిక పరిశోధనలకు కూడా దారితీయవచ్చు. శాస్త్రీయ పరిశోధనల ప్రభావం పర్యావరణంపై మరింత పడవచ్చు. ఏఐ సిస్టంల నిర్వహణకు విద్యుత్తు, నీరు పెద్ద మోతాదుల్లో అవసరం. శాస్త్రీయ పరిశోధనల్లో అభివృద్ధి చెందిన దేశాలకు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇపుడున్న వ్యత్యాసం మరింత పెరగవచ్చు.
భారతీయ విద్యా, పరిశోధనా సంస్థల్లోనూ ఏఐ సాధనాల వాడకం పుంజుకుంటోంది. దేశంలో సుమారుగా 1,80,000 మంది పరిశోధకులు ఆల్ఫాఫోల్డ్ ఉపయోగిస్తున్నట్లు అంచనా. ఓపెన్– సోర్స్ ఏఐ సాధనాల వాడకాన్ని విధాన నిర్ణేతలు, సైన్స్ అకాడమీలు ప్రోత్సహించాలి. అదే సమయంలో, పరిశోధన రంగంలో జనరేటివ్ ఏఐ వాడకం చుట్టూ అల్లుకున్న నైతిక సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఏఐ విప్లవం మన ముంగిటకు వచ్చేసింది. దానిలో పాల్గొనేందుకు భారత్ సంసిద్ధం కావాలి.

-వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత
-దినేశ్ సి. శర్మ


