ప్రేమ, తోడు అనేవి జీవితంలో ఏ వయసులోనైనా లభించొచ్చు అని చెప్పే కథ.లేటు వయసులో ఒక్కటవ్వుతున్న వారిద్దరి నేపథ్య గాథలు మనసును కదిలిస్తాయి. వాళ్లిద్దరూ కలిసిన తీరు..వాళ్లనుభవించిన కష్టాలు వింటే..ఎంత విచిత్రంగా దేవుడు వీళ్లను కలిపాడు అనిపించక మానదు. మరి ఆ కథేంటో చకచక చదివేయండి మరి..
ఆ జంటే 75 ఏళ్ల కన్హయ్య లాల్, 63 ఏళ్ల సబీనా. హమాచల్‌ప్రదేశ్ బిలాస్‌పుర్ జిల్లా దయోలిలోని 'అప్నా ఘర్' వృద్ధాశ్రమంలో కలుసుకున్నారు ఈ ఇరువురు. ఆ తర్వాత ఒకరికొకరు తోడు నీడగా ఉండటమే గాదు, ఇద్దరి మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడి పెళ్లికి దారితీసింది. నవంబర్ 25, 2026న కోర్టు సమక్షంలో సంప్రదాయ వివాహ పద్ధతిలో ఒక్కటవ్వనున్నారు ఈ దంపతులు. మరి వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది..?, వృద్ధాశ్రమానికి చేరుకోక మునుపు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు ఇరువురు? అంటే..
ఎవరీ కన్హయ్య లాల్, సబీనా?
కన్హయ్య లాల్ హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లా, జంజెహ్లికి చెందిన తునాగ్ గ్రామానికి చెందిన వ్యక్తి. ఆయన ఒకప్పుడు రైతుగా ఉండేవారు. తన భార్యతో కలిసి హాయిగా జీవించేవారు. అయితే భార్య సుదీర్ఘ అనారోగ్యంతో మరణించడంతో ఆయన జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఈ దంపతులకు పిల్లలు లేరు.
తన వ్యవసాయ భూమిని తన సోదరులకు రాసిచ్చినా.. వాళ్లు ఆయన బాగోగులు చూసుకోలేదు. అలాగే ఆ తర్వాత కుటుంబంలో తలెత్తిన క్లిష్ట పరిస్థితుల వల్ల తన కన్హయ్య తన ఇంటిని వదిలి అడవిలో ఒక గుహలో తలదాచుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 2022లో దయోలిలో 'అప్నా ఘర్' వృద్ధాశ్రమంలో చేరారు. అక్కడ ఆయనకు ఆశ్రయం, అవసరమైన సహాయం లభించాయి.
ఇక 63 ఏళ్ల సబీనా కోలకతాకు చెందిన మహిళ. ఆ సిమ్లా వైపు ప్రయాణిస్తూ దారితప్పిపోయింది. అప్పుడు పోలీసులు ఆమెను రక్షించి ఒక ఆశ్రమానికి తరలించారు. అలా వీరిద్దరూ బిలాస్‌పూర్‌లోని దయోలిలో ఉన్న 'అప్నా ఘర్' వృద్ధాశ్రమానికి చేరుకున్నారు. అక్కడే ఈ ఇద్దరి జీవితాల్లోని ఒంటరితనం, గతం తాలూకు కష్టాల మధ్య, ఒకరికొకరు తోడుగా నిలిచి ప్రేమలో పడ్డారు. అది కాస్తా వివాహం చేసుకుని మిగిలిన జీవితాన్ని కలిసి గడపాలనే నిర్ణయానికి దారితీసింది.
ఆ కోరికను 'అప్నా ఘర్' వృద్ధాశ్రమ వ్యవస్థాపకుడు, న్యాయవాది ప్రకాష్ బన్సాల్‌తో పంచుకున్నారు. వారి నిర్ణయాన్ని అర్థం చేసుకున్న యాజమాన్యం, వివాహానికి మద్దతు తెలపడమే కాకుండా, వేడుక కోసం ఏర్పాట్లు చేయడం ప్రారంభించింది. ఇవాళ నవంబర్ 25 వివాహ బంధంతో ఒక్కటవ్వనున్నారు. అంతేగాదు తమ వృద్ధాశ్రమంలో జరగబోయే తొలి వివాహం ఇదేనని బన్సాల్ పేర్కొన్నారు.
ముందుగా బిలాస్‌పూర్‌లో కోర్టు వివాహం ద్వారా చట్టపరమైన లాంఛనాలను పూర్తి చేసుకుంటారు. ఆ తర్వాత, వృద్ధాశ్రమంలోనే హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహ వేడుక జరుగునుందని బన్సాల్ వెల్లడించారు. ఇక వివాహం అనంతరం, కన్హయ్య లాల్, సబీనాలు నలగఢ్‌లోని మరొక వృద్ధాశ్రమానికి వెళ్లనున్నారు. అక్కడ వారు కలిసి జీవించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఈ కథ ప్రేమ, కొత్త జీవితాన్ని ప్రారంభించడం అనేది వయసుకు సంబంధించింది కాదని నిరూపించింది.
ఇదీ చదవండి: మిస్ యూనివర్స్ పోటీల్లో గెలిచిన తొలి తల్లిగా జెన్నిఫర్ బారెట్..!


