ప్రజా సమస్యల నుంచి డైవర్షన్.. షర్మిల ఎపిసోడ్‌తో బాబు కొత్త డ్రామా!
సీఎం ప్రెస్‌మీట్ మొదలు షర్మిల బెంగళూరు పర్యటన వరకు ఎల్లో మీడియా హడావుడి
జగన్‌పై విష ప్రచారమే లక్ష్యం.. వ్యక్తిత్వ హననానికి ప్రయత్నం
యలహంక ఆస్తిపై కోర్టు ఆదేశాలతో మూతపడ్డ బాబు అండ్ కో నోళ్లు
సొంత చెల్లెళ్లు, తమ్ముడికి ఎలాంటి ఆస్తిని ఇవ్వని చంద్రబాబు
పెళ్లైన పాతికేళ్ల తర్వాత కూడా షర్మిలకు రూ.230 కోట్లిచ్చిన వైఎస్ జగన్
భద్రతా కారణాలతోనే బెంగళూరు నివాసంలో వివాహానికి అభ్యంతరం
లోటస్‌పాండ్ ఉపయోగించుకోవాలని లేఖలో కోరిన జగన్
అయినా జగన్‌పై విషప్రచారాన్ని వీడని ఎల్లో మీడియా..
సాక్షి అమరావతి: చంద్రబాబు డైరెక్షన్‌లో ఎల్లో మీడియా మరోమారు శివాలెత్తిపోయింది. షర్మిల కుమార్తె వివాహం, వైఎస్ జగన్ బెంగళూరు నివాసం.. వీటి చుట్టూ రకరకాల కట్టుకథలల్లడం, బురద జల్లడం రోజంతా ఇదే పని. చంద్రబాబు ఉదయం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం.. ఆ వెంటనే దాన్ని అందుకుని ఎల్లో మీడియా కోరస్.. ఏబీఎన్‌లో చర్చ.. మళ్లీ బురదజల్లే కార్యక్రమం. ఎప్పుడూ చేసినట్టుగానే రోజంతా ఎల్లోమీడియా ఆపసోపాలు పడింది. నాటకాన్ని రక్తి కట్టించేందుకు నానా తంటాలు పడింది. అబద్ధాలు, మోసాలు, అసత్యాలను వండివార్చి తెలుగు ప్రజల నెత్తిన వేడివేడి గంజిని ఒంపేసింది.
కోర్టు నుంచి సాయంత్రం కల్లా ఉత్తర్వులు వస్తాయని ముందే గ్రహించినట్టున్నారు. అందుకని రోజంతా హడావుడిగా బ్రేకింగులు వేసేసి నోటి దురదనంతా తీర్చేసుకున్నారు. షర్మిల బెంగళూరుకు వెళ్లబోతున్నారని, జగన్ నివాసం ముందు ధర్నా చేయబోతున్నారని లీకులిస్తూ వాటిపై చర్చలు పెట్టారు. చివరకు విజయమ్మ కూడా వెళుతున్నారని, ధర్నాలో ఆమె కూర్చునేలా షర్మిల ఒత్తిడి చేస్తున్నారని కూడా లీకులు ప్రచారం చేసి ఆనందపడ్డారు. చంద్రబాబు అండ్‌కోతో షర్మిల కలసి నడుస్తుండడంతో ఎల్లో మీడియా కూడా తన వంతు యథాశక్తి బురద జల్లడానికి ప్రయత్నిస్తుండడం చూస్తూనే ఉన్నాం..
యలహంక ఆస్తిపై కోర్టు గీత.. షర్మిలకు నిషేధాజ్ఞలు
బెంగళూరులోని యలహంక ఆస్తి తనదేనంటూ షర్మిల బహిరంగంగా ప్రకటనలు చేస్తుండడం, ఆమె, ఆమెతరఫు వ్యక్తులు వచ్చి ఆస్తి స్వాధీనానికి ప్రయత్నిస్తుండడంతో సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దేవనహళ్లి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో దావా దాఖలు చేసింది. 2007 మార్చి 1 నుంచి ఆ ఆస్తి సిలికాన్ బిల్డర్స్ లీజులో ఉంది. ఆ ఆస్తిపై షర్మిలకు ఎలాంటి యాజమాన్య హక్కులు లేవు. భవిష్యత్తులో కూడా ఇదే రీతిలో షర్మిల లేదా ఆమె తరఫు వ్యక్తులు తమ ఆస్తిలోకి ప్రవేశించే అవకాశం ఉందని, ఈ ఆస్తి విషయంలో షర్మిల గానీ, ఆమె తరఫు వ్యక్తులెవ్వరూ కూడా జోక్యం చేసుకోకుండా శాశ్వత నిషేదాజ్ఞలు ఇవ్వాలని సిలికాన్ బిల్డర్స్ సంస్థ కోర్టును కోరింది.కోర్టు ఆ మేరకు నిషేధాజ్ఞలు ఇచ్చింది.
బెంగళూరులోని యలహంక ఆస్తి ఎవరిది? ఓ ప్రైవేట్ ప్రాపర్టీలోకి, కుటుంబ విషయాల్లోకి చొచ్చుకుపోయి గంటలకు గంటలు, రోజుల తరబడి చర్చలు పెట్టే దశకు ఏపీలోని ఎల్లో మీడియా దిగజారిపోయింది. ఆ ఆస్తిని 20 ఏళ్ల క్రితం వైఎస్ భారతి తల్లిదండ్రులు కొనుగోలు చేశారు. ఇద్దరూ రాయలసీమలో పేరున్న డాక్టర్లు. పిల్లల్ని బెంగళూరులో చదివించారు. వైఎస్ భారతి తల్లి సుగుణమ్మ పేరుతో అది రిజిస్టరయ్యింది. అందుకు సంబంధించిన స్టాంపు పేపర్లు ఇతర పత్రాలన్నీ ఉన్నాయి. జగన్ కంపెనీ పేరుతో ఆ ఆస్తిని లీజుకు తీసుకుని అందులో రెండు ఇళ్లు కట్టుకుని వాడుతున్నారు. కరెంటు బిల్లులు, ఆస్తి పన్నులు ఆ కంపెనీయే కడుతోంది. మరి ఇందులో ఇతరులు ఎవరికైనా ఎందుకు హక్కు వస్తుంది?
జగన్ + షర్మిల ప్యాలెస్ అని ఎందుకు ప్రచారం చేయలేదు?
జగన్‌పై దుష్ప్రచారం చేయడానికి మాత్రం బెంగళూరు ప్యాలెస్, జగన్ ప్యాలెస్ అని ప్రచారం చేసిన ఎల్లో పత్రికలు, ప్రసారం చేసిన ఎల్లో చానళ్లు ఎప్పుడూ అందులో షర్మిలకు వాటా ఉందని ఎందుకు చెప్పలేదు? అది జగన్ + షర్మిల ప్యాలెస్ అని ఎందుకు ప్రచారం చేయలేదు? అంటే దుమ్మెత్తి పోయడానికి మాత్రం అది జగన్ ఒక్కడిదేనంటారు.. ఇప్పుడు కూడా జగన్ తన చెల్లెలికి అన్యాయం చేస్తున్నాడని, మోసం చేస్తున్నాడని విష ప్రచారం చేయడానికి, ఏ స్థాయికైనా దిగజారి వ్యక్తిత్వ హననం చేస్తామని రుజువు చేసుకోవడానికి మాత్రమే ఎల్లో మీడియా దీనిని వాడుకుంటోంది. వాళ్లకు వాస్తవాలతో పనిలేదు. న్యాయం ధర్మంతో నిమిత్తం లేదు. జగన్‌పై విషం చిమ్మడమే వారి పని.
జడ్‌ప్లస్ భద్రతను పక్కనపెట్టి పెళ్లి రాద్ధాంతమా?
జగన్ నివాసం ఉండే ఇల్లు అది. జగన్ అంటే ఓ మాజీ ముఖ్యమంత్రి. జడ్‌ప్లస్ సెక్యూరిటీ ఉన్న వీవీఐపీ. పెళ్లి పేరుతో వీడియో గ్రాఫర్స్, డెకరేషన్ చేసే వాళ్లను జగన్ నివాసంలోకి అనుమతిస్తే సెక్యూరిటీకి ఎవరు రెస్పాన్సిబిలిటీ? భద్రతాపరమైన సమస్యలున్నందునే జగన్ అక్కడ వివాహం వద్దని అన్నారు. అయితే లోటస్‌పాండ్‌లో చేసుకోవాలని చెల్లెలికి లేఖ కూడా రాశారు. ఎల్లోమీడియాకు ఇవేవీ పట్టవు. చంద్రబాబు చెప్పడం.. ఎల్లో మీడియా గంగవెర్రులెత్తడం.. అంతే... అందులోనూ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ముగింపునకు వచ్చాయి. ప్రజాస్వామ్యానికి పాతరేసి తాము చేసిన దుర్మార్గాలను ప్రపంచమంతా చూసింది. ఛీ అని ఛీత్కరిస్తోంది. దాన్నుంచి డైవర్ట్ చేయడానికి షర్మిల దొరికింది. చంద్రబాబు, ఎల్లో మీడియా ఇలా పండగ చేసుకున్నారు. జనం దృష్టిని మళ్లించేశామని చంకలు కొట్టుకున్నారు.
హామీలకు మంగళం.. డైవర్షన్ కోసం షర్మిల ఎపిసోడ్!
ఇప్పుడే కాదు ఈ రెండున్నరేళ్లలో ప్రతిసారీ ఇదే తంతు. అవసరం అయినప్పుడల్లా జనం దృష్టిని మళ్లించడానికి షర్మిల, లేదంటే సునీతను తెస్తారు. రెండున్నరేళ్లలో అంతా మోసమే. చంద్రబాబును ప్రజలు ఛీత్కరిస్తున్నారు సూపర్ సిక్స్, సూపర్ 7 అని చెప్పాడు. 143 హామీలు ఇచ్చాడు. సినిమా స్టార్ట్ జూన్ 2024 అని ప్రతీ ఇంటికి వెళ్లి బాండ్లు ఇచ్చాడు. అక్కాచెల్లెమ్మలకు ఆడబిడ్డ నిధి అంటూ అడ్డగోలుగా మోసాలు చేసాడు. అంతకుముందు అక్కాచెల్లెమ్మలకు వచ్చే ఆసరా, చేయూత, కాపునేస్తం, ఓబీసీ నేస్తం పోయింది. చివరికి సున్నా వడ్డీ పథకం కూడా ఎగ్గొట్టాడు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కచెల్లెమ్మలు చంద్రబాబును నిలదీస్తున్న పరిస్థితులున్నాయి. చివరికి చిన్న పిల్లలను కూడా మోసం చేశాడు.
విద్యాదీవెన, వసతి దీవెన నీరుగారిపోయింది. నిరుద్యోగ భృతి ప్రతీ నెలా రూ.3వేలు అని చెప్పి మోసం చేసాడు. చదువుకుంటున్న ఆ పిల్లలు సైతం చంద్రబాబును నిలదీస్తున్నారు. రైతన్నలకు ఉచిత పంటల బీమా లేదు. సమయానికి వచ్చే ఇన్‌పుట్‌సబ్సిడీ లేదు. సున్నా వడ్డీ లేదు. చివరకు ఏ పంటకు గిట్టుబాటు ధర లేని పరిస్థితుల్లో రైతన్నలు అవస్థలు పడుతున్నారు. చివరకు సచివాలయాలు పోయాయి. ఆర్బీకేలు పోయాయి. వాలంటీర్ వ్యవస్థ పోయింది. పారదర్శక పాలన పూర్తిగా కనుమరుగై పోయింది. ప్రభుత్వ వైద్యరంగం చూస్తే ఆస్పత్రుల్లో మందులు దొరకని పరిస్థితి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే ఆరోగ్య శ్రీ పరిస్థితి చూస్తే వెంటిలేటర్‌పై కన్పిస్తోంది.
ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు కూడా మోసాలుగా తేలాయి. వచ్చీరాగానే ఐఆర్ అన్నాడు పోయింది. పీఆర్సీ అన్నాడు దిక్కుదివానం లేకుండా పోయింది. ఐదు డీఏలు పెండింగ్, రూ.40వేల కోట్ల బకాయిలు. చంద్రబాబు హయాంలో జరిగిందేమిటంటే జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన 17 మెడికల్ కళాశాలను పప్పుబెల్లాల మాదిరిగా అమ్మకానికి పెట్టాడు. పోర్టులు, హార్బర్లను స్కామ్‌లు చేస్తూ అమ్మకానికి రెడీగా పెట్టాడు. ప్రభుత్వ భూములను పావలాకు రూపాయికి తమకు కావాల్సిన వారికి కట్టబెడుతున్నారు. చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్ అన్నట్టుగా తయారైంది. మరొక వైపు చూస్తే.. ఎక్కడచూసినా సరే లిక్కర్, గంజాయి మాఫియా రాజ్యమేలుతోంది. చివరికి వాటిలో కూడా స్కామ్‌లు చేస్తున్నారు. రాజధాని పేరిట స్కామ్‌లు. మట్టి, ఇసుక, లేటరైట్ ఏదైనా స్కామే. వీటన్నిటి నుంచి జనం దృష్టిని మళ్లించడానికే షర్మిలను ముందు పెట్టి చంద్రబాబు డైవర్షన్ డ్రామాలాడుతున్నాడు.
ఇతరుల కుటుంబాలపై నీతులా.. సొంత చెల్లెళ్లకు ఏం చేశారు?
షర్మిలకు జగన్ ఏదో అన్యాయం చేస్తున్నట్లు ప్రచారం చేయిస్తున్న చంద్రబాబు నాయుడు తన ఇద్దరు చెల్లెళ్లకు ఏం న్యాయం చేశారో చెప్ప గలరా? ఠక్కున అడిగితే చెల్లెళ్ల పేర్లయినా చంద్రబాబు చెబుతారా? వాళ్లకు హెరిటేజ్‌లో ఎంత వాటా ఇచ్చారు? పోనీ తమ్ముడు రామ్మూర్తి నాయుడుకు వాటా ఉందా? అసలు వాళ్లను ఎప్పుడైనా హైదరాబాద్‌లోని ప్యాలెస్‌లకు రానిచ్చారా? విజయవాడ కరకట్ట కొంపలో వాళ్లు ఎప్పుడైనా ఈ ఏబీఎన్‌కు కనిపించారా? షర్మిల వివాహమై పాతికేళ్లు గడచిపోయినా.. వైఎస్సార్ మరణించి 10 ఏళ్లు దాటినా జగన్ తన చెల్లెలికి ఆర్థికంగా అండగానే ఉంటూ దాదాపు రూ.230 కోట్లు ఇచ్చారు.
పెళ్లై పాతికేళ్లు దాటిన తర్వాత కూడా ఇంత పెద్ద మొత్తంలో సోదరికి ఆర్థికంగా అండగా నిలిచే అన్నలు ఎక్కడైనా ఉంటారా? రూ.లక్ష కోట్ల ఆస్తి ఉందని చెప్పుకునే చంద్రబాబు తన తమ్ముడికి, ఇద్దరు చెల్లెళ్లకు ఎంత వాటా ఇచ్చారు? తన తోబుట్టువులకు ఏనాడైనా కనీసం రూ.2 లక్షలైనా ఇచ్చారా? సొంత చెల్లికి కాలు ఫ్రాక్చర్ అయితే ఆస్పత్రికి వెళ్లి పరామర్శించలేదని ఆమె అల్లుడే ప్రెస్‌మీట్ పెట్టి చెప్పలేదా? చంద్రబాబు తన తమ్ముడిని, ఇద్దరు చెల్లెళ్లను ఎందుకు పట్టించుకోవడం లేదు?
అమరావతిలో ఐదెకరాల్లో నిర్మిస్తున్న ప్యాలెస్ భూమిపూజకైనా చెల్లెళ్లను ఆహ్వానించారా? మాదాపూర్‌లోని ఏడు ఎకరాల భూమిని చంద్రబాబు తల్లి అమ్మణ్ణమ్మ లోకేశ్‌కు మాత్రమే ఎందుకు బహుమతిగా ఇచ్చారు? మిగిలిన వారసులకు వాటా ఎందుకు ఇవ్వలేదు? హెరిటేజ్‌లో వాటా ఇవ్వాలని ఇప్పుడు చంద్రబాబు చెల్లెళ్లు వస్తే.. దానిని జగన్ సమర్ధిస్తే ఎలా ఉంటుంది..? చంద్రబాబు ఆయన కనుసన్నల్లో నడిచే ఎల్లో మీడియా ఇతరుల కుటుంబాలలో చిచ్చుపెట్టి, ఆడపిల్లలను రాజకీయ ప్రయోజనాల కోసం బజారుకు లాగడాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు.
బాబు స్క్రిప్టు ప్రకారమే ఎల్లో మీడియా శివాలు..
చంద్రబాబు డైరెక్షన్‌లో ఆయనిచ్చిన స్క్రిప్టు ప్రకారం ఎల్లోమీడియా శివాలెత్తిపోతుంది. చంద్రబాబు అండ్ కో చెప్పినట్టల్లా షర్మిల ఆడుతుండడాన్ని బట్టే జగన్ నివాసం వద్ద షర్మిల ఆందోళన చేయబోతోందని, అందులో విజయమ్మ కూడా పాల్గొనబోతున్నారని ఎల్లో మీడియా చిలవలుపలవలు చేసి ప్రచారం చేసింది. విజయమ్మపై షర్మిల ఒత్తిడి ఉందని ఇప్పటికే పలుమార్లు రుజువయ్యింది. జగన్ బెయిల్ క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉందని తెలిసీ సరస్వతీ పవర్ షేర్ల విషయంలో షర్మిల విజయమ్మ చేత లేఖ రాయించారు.
ఎన్నికల్లో షర్మిలకు మద్దతివ్వాలని కోరుతూ విజయమ్మ చేత విదేశాల నుంచి వీడియో రిలీజ్ చేయించారు. అందుకే ఇప్పుడు కూడా ఆమె చేత ఆందోళన చేయించి చంద్రబాబు రాజకీయంగా ఉపయోగించుకుంటారని ఎల్లో మీడియా ప్రసారం చేసిన కథనాలను బట్టి అర్ధమయ్యింది. అయితే అన్నిటికీ కోర్టు చెక్ పెట్టింది. ఏదైనా సమస్య ఉంటే న్యాయస్థానాలలో పరిష్కరించుకోవాలి. కానీ చంద్రబాబు అండ్‌కో వక్రీకరణలతో ఎల్లోమీడియానే తీర్పులిచ్చేస్తుంది.
ఇప్పుడు బెంగళూరు నివాసంలోకి ప్రవేశించడానికి వీలు లేదంటూ కోర్టు నిషేధాజ్ఞలు విధించినా దీనినీ వక్రీకరిస్తూ ఎల్లో మీడియా చర్చలు పెట్టింది. సిలికాన్ బిల్డర్స్‌కి ఏం సంబంధం అంటూ నిలదీస్తోంది. ‘చెట్టపట్టాల్’ అనే ఒక సామాన్య తెలుగు నుడికారాన్ని పట్టుకుని షర్మిల క్యారెక్టర్‌పై దాడి అంటూ గగ్గోలు పెట్టారు. గురజాడ దేశభక్తి గేయంలోనూ కనిపించిన ‘చెట్టపట్టాల్’ అనే పదం.. కలసి నడుస్తున్నారని తెలియజేసే సాధారణ పదమే తప్ప అందులో అంతగా కించపరిచే అర్థమేదీ లేదని అనేక మంది విశ్లేషకులు, భాషా పండితులు వివరించినా వారి తలకెక్కలేదు.


