చెరువులు పూడ్చి.. కొండలు తవ్వి.. పర్యావరణ విధ్వంసం | CRDA encroached upon and filled up the lakes in capital area | Sakshi
Sakshi News home page

చెరువులు పూడ్చి.. కొండలు తవ్వి.. పర్యావరణ విధ్వంసం

Nov 22 2026 4:48 AM | Updated on Nov 22 2026 4:48 AM

CRDA encroached upon and filled up the lakes in capital area

రాజధాని ప్రాంతంలోని అనంతవరంలో ఉన్న కొండ ప్రాంతం(2014 నాటి గూగుల్‌ ఎర్త్‌ శాటిలైట్‌ చిత్రం) , అక్కడి కొండను పూర్తిగా ధ్వంసం చేసిన దృశ్యం (ప్రస్తుత గూగుల్‌ ఎర్త్‌ శాటిలైట్‌ చిత్రం)

సహజ ప్రవాహాలకు సంకెళ్లతో ముంపు ముప్పులో రాజధాని

ఎన్జీటీ ఆదేశాలు, సుప్రీంకోర్టు తీర్పు ధిక్కరించి బాబు సర్కారు పనులు 

చెరువులను కబ్జా చేసి, వాటిని పూడ్చేసిన సీఆర్‌డీఏ

అనంతవరం, దొండపాడు, మల్కాపురం, పిచ్చుకలపాలెం, తుళ్లూరు చెరువులు పూడ్చివేత 

తుళ్లూరు, పిచ్చుకలపాలెం చెరువుల కబ్జా..

తుళ్లూరు చెరువు భూమి 33.06 ఎకరాలలో 65 మందికి ప్లాట్ల రిజిస్ట్రేషన్

‘మీ భూమి వెబ్‌సైట్‌’లోని అడంగల్‌లో ఇప్పటికీ అది చెరువు భూమేనని స్పష్టం 

పిచ్చుకలపాలెం చెరువు భూమి 11.25 ఎకరాలలో 78 మందికి ప్లాట్లు రిజిస్ట్రేషన్

ఆర్‌ఎస్‌ఆర్‌ ప్రకారం సర్వే నంబర్లు 87, 88, 89 పరిధిలోని భూమిలో ఉన్నది చెరువే 

కానీ.. రిజిస్ట్రేషన్‌ సమయంలో సర్వే నంబరు 87లో అసైన్డ్‌ భూమిగా పేర్కొన్న సీఆర్‌డీఏ 

టీడీపీ సానుభూతిపరులు, ప్రభుత్వ పెద్దల సన్నిహితులకూ వీటిలో ప్లాట్లు 

ఇదే అదునుగా మందడం చెరువును పూడ్చేసి కబ్జా చేసేందుకు స్థానిక టీడీపీ నేతలు కుట్రలు

దొండపాడు చెరువును కబ్జా చేసి సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు నిర్మాణం 

గ్రావెల్‌ కోసం అనంతవరం కొండను గుండు కొట్టేసిన వైనం 

ఫలితంగా రాజధానికి వరద ముప్పు మరింత పెరుగుతుందని పర్యావరణవేత్తల ఆందోళన

సాక్షి, అమరావతి :  నదులు, చెరువులు, వాగులు, వంకలు వంటి జల వనరులను పరిరక్షించాలని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో జారీ చేసిన ఆదేశాలను చంద్రబాబు సర్కార్‌ తుంగలో తొక్కుతోంది. రాజధాని ప్రాంతంలో హైడ్రో–జియోమార్ఫాలజీ (జల విజ్ఞానం, భూ స్వరూప శాస్త్రం కలయికతో ఏర్పడిన ఒక శాస్త్ర విభాగం) అధ్యయనం తర్వాత వరద మైదానాల మార్పు, సహజ నీటి వనరులు, ప్రవాహ మార్గాలను మార్చకూడదు వంటి ఎన్జీటీ (జాతీయ హరిత ట్రిబ్యునల్‌) విధించిన షరతులను బుట్టదాఖలు చేస్తోంది. చెరువులను చెరబట్టి.. వాటిని పూడ్చేసి, రైతులకు నివాస, వాణిజ్య ప్లాట్లు.. రోడ్లు నిర్మిస్తోంది. ఎలాంటి పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే రాజధాని ప్రాంతంలో కొండలను తవ్వేస్తూ మట్టి, రాళ్లతో చెరువులు, పల్లపు ప్రాంతాలను పూడ్చేస్తోంది. 

ఓ వైపు చెరువులు, వాగులు, వంకలను చెరబట్టి, మరో వైపు కొండలను తవ్వేస్తూ.. రాజధాని ప్రాంతంలో పర్యావరణాన్ని విధ్వంసం చేస్తోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో జల వనరులను ధ్వంసం చేయడం వల్లే.. నిర్మాణ దశలోనే రోడ్లు, భవనాల పునాదులు తరచూ నీట మునుగుతున్నాయని ఎత్తిచూపుతున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల పరిధిలో 217.23 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని 2015లో రాజధాని ప్రాంతంగా చంద్రబాబు సర్కార్‌ ప్రకటించింది. రాజధాని నిర్మాణం కోసం సీఆర్‌డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ)కు 30,036 మంది రైతులు 35,484.72 ఎకరాలను ఇప్పటి వరకు ‘భూ సమీకరణ’ కింద ఇచ్చారు. 

తుంగలోకి జాతీయ హరిత ట్రిబ్యునల్‌ షరతులు  
రాజధాని నిర్మాణం కోసం గతంలో ఇచ్చిన పర్యావరణ అనుమతిని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో 2017 నవంబర్‌ 17న ఎన్జీటీ తీర్పునిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను రికార్డ్‌ చేసింది. జల వనరులను 616 ఎ­క­రాల నుంచి 1,813 ఎకరాలకు పెంచుతామని.. కొండవీటి వాగును 30–90 మీటర్లు, పాల వాగు­ను 45 మీటర్ల వెడల్పు చేస్తామని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ క్రమంలో ట్రిబ్యునల్‌ ఈ హామీలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి పలు షరతులు విధించింది. 

హైడ్రో–జియో మా­ర్ఫా­లజీ అధ్యయనం తర్వాతే వరద మైదానాల మా­ర్పు.. సహజ నీటి ప్రవాహ మార్గాలను మార్చక పోవ­డం.. కరకట్టల పటిష్టత.. ఘన వ్యర్థాల శుద్ధి.. వర్షపు నీటి సంరక్షణ.. సోలార్‌ కోసం బిల్డింగ్‌ బైలాస్‌.. 6 నెలల్లో క్‌లైమేట్‌ యాక్షన్‌ ప్లాన్‌.. కొండవీటి వాగు పరీవాహక కొండలపై భూసార సంరక్షణ.. అడవుల పెంపకం.. 251 ఎకరాల అటవీ భూమి సంరక్షణతోపాటు రూ.­5 కోట్ల రివాల్వింగ్‌ బ్యాంక్‌ గ్యారెంటీ ఇవ్వాలని ఎన్జీ­టీ నాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ.. ఇం­దులో పలు షరతులను చంద్రబాబు సర్కార్‌ తుంగలో తొక్కింది.

అడ్డగోలుగా చెరువులు పూడ్చివేత
రాజధాని అమరావతి పేరుతో ఆ ప్రాంత రైతులకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అన్నీ ఇన్నీ కావు. భూ సమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు మెట్ట భూమి ఎకరానికి అభివృద్ధి చేసిన 1,000 గజాల రెసిడెన్షియల్, 200 గజాల వాణిజ్య (కమర్షియల్‌) ప్లాట్లు ఇస్తామని చెప్పింది. మాగాణి (జరీబు) భూమి అయితే ఎకరానికి 1,000 గజాల నివాస, 450 గజాల కమర్షియల్‌ ప్లాట్‌ ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ మేరకు 30,036 మంది రైతులకు 73,388 ప్లాట్లను కేటాయించామని, ఇప్పటి వరకు 66,050 ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చామని.. మిగతా ప్లాట్లు ఇవ్వాల్సి ఉందని సీఆర్‌డీఏ చెబుతోంది.

రిజిస్ట్రేషన్‌ చేసి రైతులకు ఇచ్చిన ప్లాట్లను ఇప్పటి వరకు అభివృద్ధి చేయలేదు. మరికొందరికి అసలు ప్లాట్లే ఇవ్వలేదు. చెరువు భూములను ప్లాట్లుగా మార్చి ఇస్తూ రైతులను మోసం చేస్తోంది. ఇది రైతులకు ఇచ్చిన హామీకి పూర్తి విరుద్ధం. పైగా, భవిష్యత్తులో ఇవి చెరువు భూములంటూ ప్రభుత్వమే ఇక్కడి రైతుల ఇళ్లను కూలగొట్టి, పంపించేసే అవకాశాలు అధికం. అర్హులు కాని టీడీపీ సానుభూతిపరులకూ ప్లాట్లు ఇచ్చేస్తోంది. తుళ్లూరు, పిచ్చుకలపాలెం చెరువు భూములలో రెసిడెన్షియల్‌ ప్లాట్లను సీఆర్‌డీఏ రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వడమే ఇందుకు నిదర్శనం. దొండపాడు చెరువును కబ్జా చేసి, చదును చేసి సీడ్‌ యాక్సిస్‌ రోడ్డును నిర్మించడం మరో తార్కాణం.

              తుళ్లూరు హైస్కూల్‌ సమీపంలోని చాకలి చెరువు పూడ్చి పాకలు వేసిన దృశ్యం 

చెరువులు పూడ్చేసి ప్లాట్లు.. రోడ్ల నిర్మాణం
రాజధాని ప్రాంతంలో కొండలను ఎలాంటి పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. ఆ మట్టి, రాళ్లతో చెరువులను పూడ్చేస్తున్నారు. రోడ్లు వేస్తున్నారు.. పల్లపు ప్రాంతాలను పూడ్చేస్తున్నారు. అనంతవరంలో సర్వే నంబర్‌ 221లో 297.50 ఎకరాల విస్తీర్ణంలో రాజధాని మాస్టర్‌ ప్లాన్‌లో పీ–3 రక్షిత ప్రాంతంగా ఉంది. అక్కడ అడవులు పెంచి భూసార సంరక్షణ చేపట్టాలని ఎన్జీటీ గతంలో ఆదేశించింది. కానీ.. ఆ కొండ ప్రాంతం మొక్కలు పెంచడానికి అనుకూలంగా లేదంటూ 2025 జూలై 9న చంద్రబాబు ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకుంది. మరో వైపు ఎటువంటి పర్యావరణ, మైనింగ్‌ అనుమతులు తీసుకోకుండానే భారీ యంత్రాలతో ఈ కొండను తవ్వి.. మట్టి, రాళ్లను తరలిస్తూ లోతట్టు ప్రాంతాలను, చెరువులను పూడ్చేస్తున్నారు.

తుళ్లూరు మండలం పిచ్చుకలపాలెంలో రీసర్వే అండ్‌ రీసెటిల్‌మెంట్‌ రిజిస్టర్‌ (ఆర్‌ఎస్‌ఆర్‌) ప్రకారం సర్వే నంబరు 87లో 11.25 ఎకరాలు, సర్వే నంబరు 88లో 0.31, 89లో 0.59 ఎకరాలు చెరువు భూమి అని స్పష్టంగా ఉంది. ఆ గ్రామ భౌగోళిక మ్యాప్‌లోనూ సర్వే నంబరు 87లో చెరువు ఉన్నట్లు చూపుతోంది. కానీ, ఆ చెరువు భూమిలో 78 మందికి సీఆర్‌డీఏ రెసిడెన్షియల్‌ ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ కూడా చేసి ఇచ్చేసింది. ఆ ప్లాట్ల రిజిస్ట్రేషన్సమయంలో సర్వే నంబరు 87లో భూమి అసైన్డు భూమిగా సీఆర్‌డీఏ పేర్కొనడం గమనార్హం. 

అంటే... పిచ్చుకలపాలెం చెరువులో 11.25 ఎకరాల భూమిని అసైన్డు భూమిగా మార్చేశారన్నది స్పష్టమవుతోంది. కొండవీటి వాగు వరదను మళ్లించేందుకు నెక్కల్లు నుంచి పిచ్చుకలపాలెం వరకు 7.83 కిలోమీటర్ల పొడవున గ్రావిటీ కెనాల్‌ను పిచ్చుకలపాలెం చెరువులోనూ కొంత భాగం తవ్వారు. ఆ కెనాల్‌కు అటూ, ఇటుగా ఈ 78 మందికి ప్లాట్లు కేటాయించడం గమనార్హం.  

                        తుళ్లూరులో చెరువు పూడ్చివేసి ఎన్‌–14రోడ్డు నిర్మాణం 

                తుళ్లూరు హైస్కూల్‌ సమీపంలోని చాకలి చెరువు పూడ్చి పాకలు వేసిన దృశ్యం 

తుళ్లూరులో సర్వే నంబరు 80లో 33.06 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. ‘మీ భూమి’ వెబ్‌సైట్‌లో ఇప్పటికీ అది చెరువు భూమే అని అడంగల్‌ రికార్డు స్పష్టం చేస్తోంది. కానీ.. ఆ చెరువు భూమిలో 65 మందికి ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చేసింది. 

మందడం చెరువును స్థానిక టీడీపీ నేతలు కబ్జాచేసి ప్లాట్లు వేసుకునేందుకు రంగం సిద్ధం చేయగా స్థానికులు అడ్డుకున్నారు. 

ప్రధాన రాజధాని ప్రాంతం (సీడ్‌ కేపిటల్‌)ను కోల్‌కత–చెన్నై జాతీయ రహదారితో అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు కోసం దొండపాడు చెరువును సీఆర్‌డీఏ కబ్జా చేయడం గమనార్హం. ఆ చెరువును చదును చేసి రోడ్డు నిర్మించింది.  

అనంతవరంలో దగ్గుమాటెం చెరువును పూడ్చేసి రోడ్డు వేస్తున్నారు. ఆ చెరువు భూమిని ప్రైవేటు సంస్థకు కేటాయించే ఫైలు చకచకా కదులుతోందని రైతులు చెబుతున్నారు.  

జల వనరుల స్వరూపం మార్చేస్తే ముప్పు తప్పదు 
కొండవీటి వాగు, పాల వాగు ముంపు నుంచి రాజధాని అమరావతిని తప్పించడానికి ప్రపంచ బ్యాంకు సూచనల మేరకు నెదర్లాండ్‌కు చెందిన నిపుణులు రూపొందించిన ప్రణాళిక ప్రకారం ముంపు ముప్పు నివారణ పనులను సీఆర్‌డీఏ చేపట్టింది. చిన్నపాటి వర్షం కురిస్తే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహా నగరాల్లో తరచూ ముంపు సమస్య ఉత్పన్నమవుతోంది. దీనికి ప్రధాన కారణం చెరువులు, వాగులు, వంకలు ఆక్రమించడమేనన్నది బహిరంగ రహస్యం. 

అసలే ముంపు ముప్పు ఉన్న రాజధాని ప్రాంతంలో చెరువులను కబ్జా చేసి, వాటి స్వరూపాన్ని మార్చేస్తే వరద ముప్పు మరింత పెరుగుతుందని పర్యావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వరద ముప్పు, భూగర్భ జలాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకునే.. ఎలాంటి పరిస్థితుల్లోనూ చెరువులు, వాగులు, వంకలు, నదులు, జలాశయాల భూమిని ఇతర అవసరాలకు మళ్లించకూడదని, వాటిని పూర్తి స్థాయిలో పరిరక్షించే బాధ్యత ప్రభుత్వాలదేనని సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) అనేక సార్లు స్పష్టమైన ఆదేశాలిచ్చాయని గుర్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement