పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌లో అభ్యర్థి పేరుండదు
బ్యాలెట్‌లో ఉండేది అభ్యర్థి సీరియల్ నంబర్, గుర్తులు మాత్రమే
పొరపాటున ఒక అభ్యర్థికి బదులు వేరొకరికి ఓటు వేస్తే కొత్తగా మరో బ్యాలెట్ కోరే అవకాశం
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొత్తం అభ్యర్థుల వివరాలు తెలుసుకోకుండా పోలింగ్ బూత్‌లో ఇచ్చే బ్యాలెట్ పేపర్ చూసి ఓటు వేద్దాంలే అనుకుంటే ఇబ్బంది పడకతప్పదు. సర్పంచ్, వార్డు సభ్యుల బ్యాలెట్ పేపర్‌లో అభ్యర్థి పేరు ఉండదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. బ్యాలెట్ పేపర్‌లో కేవలం పోటీ చేస్తున్న అభ్యర్థుల క్రమ సంఖ్య, ఆ సంఖ్య ఎదురుగా అభ్యర్థికి కేటాయించిన గుర్తు మాత్రమే ముద్రించి ఉంటాయని తెలిపింది. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా జరిగే పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులకు కేటాయించే గుర్తులు రాజకీయ పార్టీకి సంబంధించినవి ఉండవు.
సర్పంచ్ అభ్యర్థుల కోసం 25 గుర్తులు, పంచాయతీ వార్డు సభ్యుల పదవుల కోసం మరో 20 గుర్తులను రాష్ట్ర ఎన్నిల కమిషన్ కేటాయించింది. బ్యాలెట్ పత్రంలో చివరన ‘నోటా’ గుర్తు కూడా ఉంటుంది. ఓటర్లు వార్డు సభ్యుడితో పాటు ఆ గ్రామ సర్పంచ్‌కి ఒకే బూత్‌లో ఏకకాలంలో ఓటు వేయాల్సి ఉంటుంది. సర్పంచ్ ఎన్నికకు గులాబీ రంగు బ్యాలెట్ పేపర్, వార్డు సభ్యుడికి తెల్ల బ్యాలెట్ పేపర్‌లు ఉంటాయి. ఓటర్లు పోటీలో ఉన్న అభ్యర్థులకు కేటాయించిన సీరియల్ నంబర్ లేదా గుర్తు ఆధారంగా ఓటు వేయాల్సి ఉంటుంది.
కొత్త బ్యాలెట్ అడిగే అవకాశం
పోలింగ్ బూత్‌లో ఏ ఓటరైనా పొరపాటున బ్యాలెట్ పేపర్‌పై ఒక అభ్యర్థికి బదులు వేరొకరికి ఓటు గుర్తు వేసినా, పొరపాటున బ్యాలెట్ పేపర్ పాడైనప్పుడు ఆ విషయం పోలింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లి కొత్త బ్యాలెట్ పొందే వీలున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. ‘అటువంటి సందర్భంలో ఓటరు తాను చేసిన పనిని పొరపాటున చేసినట్టు పోలింగ్ అధికారిని సంతృప్తి పరచాల్సి ఉంటుంది’ అని నిబంధనల్లో స్పష్టం చేసింది. అయితే, పోలింగ్ అధికారి ఈ అంశంలో ఓటరు అభ్యర్థనకు సంతృప్తి చెంది కొత్త బ్యాలెట్ జారీ చేయడం అత్యంత అరుదుగానే ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు పేర్కొంటున్నారు.


