104 దేశాల మధ్య ‘గోంధాళ్’ మెరుపు!
ఆస్కార్ సినీ వేదిక పై భారతీయ కథాబలం మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమైంది. 99వ ఆస్కార్ ‘ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ విభాగంలో మరాఠీ చిత్రం ‘గోంధాళ్’ అర్హత జాబితాలో చేరింది. పోటీకి వచ్చిన చిత్రాలలో 104 దేశాల చిత్రాలు ఈ విభాగం కింద అర్హత సాధిస్తే వాటిలో ‘గోంధాళ్’ ఒకటిగా నిలిచింది. ‘గోంధాళ్’ నవ వధూవరులు నిర్వహించాల్సిన ఒక జానపద ఆచారం.ఈ ఆచారం చుట్టూ సాగిన కథ మొదటి మెట్టు ఎక్కింది.
ఇక నామినేషన్ వరకు చేరుకోవడమే తరువాయి. కళకారుడు నియంత. సీతయ్య. ఎవ్వరి మాటా వినడు. అలా ఇళయరాజా వల్ల కొద్దిలో ‘గోంధాళ్’ సినిమాకు అపాయం సంభవించేది. విషయం ఏమిటంటే మన దేశం నుంచి ఆస్కార్ కోసం అఫీషియల్ ఎంట్రీగా ఏది పంపాలనే విషయంలో భారీ పోటీ ఏర్పడింది. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యూరీ 33 మొత్తం భారతీయ చిత్రాలను పక్కనపెట్టి కేవలం 4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘గోంధాళ్’ను ఎంపిక చేసింది. అరే ఈ సినిమానా అని ఆశ్చర్యపోయారు అంతా. అయితే దానికి ఎదురుదెబ్బ ప్రమాదం ఏర్పడింది.
ఆస్కార్ ఎంట్రీకి పంపే సినిమా విషయంలో అకాడమీ నిబంధనల ప్రకారం సినిమాకు సంబంధించిన ‘క్యూ షీట్’ (సంగీత వివరాలు) సమర్పించాలి. కానీ ఈ చిత్రానికి సంగీతం అందించిన ఇళయరాజా ఎప్పుడూ క్యూ షీట్స్ వాడకుండా నేరుగా మ్యూజిక్ ఇస్తారు. ఆస్కార్ వాళ్లు క్యూషీట్ అడుగుతున్నారు అని దర్శకుడు చెప్తే ‘ఆ సంగతేంటో నువ్వే చూసుకో’ అని రాజా నవ్వుతూ చెప్పారట. ఎట్టకేలకు సాంకేతిక నిబంధనలన్నీ దాటుకుని, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన 104 చిత్రాల సరసన ‘గోంధాళ్’ అర్హత జాబితాలో చేరింది.
ఏమిటీ ‘గోంధాళ్’ ప్రత్యేకత?
1960 ల నాటి గ్రామీణ మహారాష్ట్ర నేపథ్యంలో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ ‘గోంధాళ్’. కొత్తగా పెళ్లయిన జంట కోసం రాత్రంతా భక్తిశ్రద్ధలతో నిర్వహించే సంప్రదాయ జానపద ఆచారమే ‘గోంధాళ్’. ఆ రాత్రి ఏం జరిగింది? ప్రేమ, అణచివేత, మోసం, ప్రతీకారాలు కలగలిసి ఎలాంటి రక్తపాతానికి దారితీశాయన్నది ఉత్కంఠభరితంగా ఈ సినిమా చూపుతుంది. 25 నిమిషాల సింగిల్ షాట్ (లాంగ్ టేక్) ఓపెనింగ్ సీన్ అంటే దర్శకుడు ఎంత భిన్నంగా ఆలోచించాడో అర్థం చేసుకోవచ్చు.
భారతీయ సినిమా చరిత్రలో ఇంత సుదీర్ఘమైన సింగిల్ షాట్ ఇదేనని ప్రశంసలు. అంతేకాదు రీరికార్డింగ్ కోసం ఇళయరాజా కనుమరుగవుతున్న జానపద వాద్యాలను ఉపయోగించారు. కొన్ని లైవ్‌గా రికార్డు చేశారు. ‘భారతీయ సినిమా అంటే కేవలం పేదరికం మాత్రమే కాదు, మనకో గొప్ప వారసత్వం ఉంది. అది ప్రపంచానికి చూపించాలనే ఈ కథ రాశాను’ అని దర్శకుడు సంతోష్ దావఖర్ అన్నాడు.
ముందు అలా... తర్వాత ఇలా...
దర్శకుడు సంతోష్ దావఖర్‌కు ‘గోంధాళ్’ తొలి ఫీచర్ ఫిల్మ్. గతంలో అతను తీసిన ‘అజ్ఞాత్’ అనే షార్ట్ ఫిల్మ్ కే¯న్స్ లో ప్రదర్శితమైంది. ఆ అనుభవంతోనే ఆస్కార్ స్థాయి సినిమాలను అధ్యయనం చేసి ‘గోంధాళ్’ను మలిచాడు. చిత్రమేమిటంటే 2025 నవంబర్‌లో సినిమా విడుదలైనప్పుడు మరాఠీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన వసూళ్లు రాబట్టలేకపోయింది. కానీ చిత్రోత్సవాల్లో మాత్రం సత్తా చాటింది. గోవా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ దర్శకుడిగా సంతోష్ ‘సిల్వర్ పీకాక్’ గెలుచుకున్న తొలి మరాఠీ దర్శకుడిగా నిలిచాడు.
ఆరు మరాఠీ ఫిల్మ్‌ఫేర్ అవార్డులనూ కొల్లగొట్టింది. ఆస్కార్ ఎంట్రీ తర్వాత ఇటీవల నవంబర్ 13న ఆరు భాషల్లో రీరిలీజ్ అవ్వగా విమర్శకుల ప్రశంసలు వెల్లువెత్తాయి.
తుది జాబితా ఎప్పుడంటే?
ప్రస్తుతం 104 చిత్రాల జాబితాలో నిలిచిన ‘గోంధాళ్’కు అసలు సిసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది. డిసెంబర్ మొదటివారంలో అకాడమీ సభ్యులు ఓటింగ్ నిర్వహిస్తారు. అందులో నెగ్గితే డిసెంబర్ 15న ప్రకటించే 15 చిత్రాల ‘షార్ట్‌లిస్ట్’లో చోటు దక్కుతుంది. ఆ తర్వాత 2027 జనవరి 21న తుది నామినేషన్లు వెలువడతాయి. ఫ్రా¯న్స్ , జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల దిగ్గజ చిత్రాల నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ, తన విలక్షణమైన కథనంతో ‘గోంధాళ్’ తుది ఐదు నామినేషన్లలో నిలిచి భారత కీర్తిపతాకను ఎగురవేస్తుందని సినీ అభిమానులు ఆశిస్తున్నారు.


