ప్రముఖ మలయాళ నటుడు, టీజీ రవి కుమారుడైన శ్రీజిత్ రవిని కోర్టు దోషిగా తేల్చింది. అతనిపై నమోదైన పోక్సో కేసులో ఏడాది జైలు శిక్ష విధించింది. 2022లో త్రిసూర్‌లో ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో త్రిసూర్‌లోని ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్ తీర్పు వెలువరించింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఆ ఇద్దరు బాలికలు ఇచ్చిన వాంగ్మూలాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. నేరు రుజువు కావడంతో ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ప్రకటించింది.
అసలేం జరిగిందంటే..
ఈ ఘటన 2022 జూలై 4న జరిగింది. త్రిసూర్‌లోని అరనాట్టుకరలో ఇద్దరు బాలికలు పాఠశాల నుంచి తమ ఇంటికి తిరిగి వస్తుండగా, శ్రీజిత్ రవి తన కారులో వారిని వెంబడించారు. ఆ తర్వాత అపార్ట్‌మెంట్ కార్ పార్కింగ్ ప్రాంతంలో వారిని చూస్తూ తన ప్రైవేట్ పార్ట్స్ ప్రదర్శిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించారు. దీనిపై కేసు నమోదు కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో అతన్ని నటుడు శ్రీజిత్ రవిగా గుర్తించారు.
అయితే శ్రీజిత్ రవికి గతంలో ఎటువంటి నేర చరిత్ర లేదని, ఈ కేసు ఆయన సినీ కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంటూ, శిక్షను తగ్గించాలన్న రవి తరపు న్యాయవాది అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. నిందితుడు ఇద్దరు పాఠశాల విద్యార్థినులను లక్ష్యంగా చేసుకున్నాడని.. ఈ ఘటన వల్ల వారిపై దీర్ఘకాలిక మానసిక ప్రభావం పడొచ్చని కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించింది. రవి నుంచి జరిమానా వసూలు చేస్తే.. నష్టపరిహారంగా ఇద్దరు బాలికలకు సమానంగా పంచాలని కూడా కోర్టు ఆదేశించింది.


