మిస్‌ యూనివర్స్‌గా ‘అమ్మ’..! ఎవరీ జెన్నీఫర్‌ బారెటో? | Jennifer Barreto Miss Universe 2026 becomes first mom to win the pageant | Sakshi
Sakshi News home page

Miss Universe 2026: మిస్ యూనివర్స్ పోటీల్లో గెలిచిన తొలి తల్లిగా జెన్నిఫర్‌ బారెట్‌..!

Nov 25 2026 12:25 PM | Updated on Nov 25 2026 12:28 PM

Jennifer Barreto Miss Universe 2026 becomes first mom to win the pageant

Jennifer Barretos historic win for Puerto Rico: ప్యూర్టో రికోలోని శాన్ జువాన్‌లో జరిగిన 75వ  మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో గెలిచిన తొలి తల్లిగా 27 ఏళ్ల జెన్నిఫర్ బారెటో  ఘనత సృష్టించింది. అంతర్జాతీయ అందాల పోటీల వేదికపై గెలిచిన అమ్మగా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది ప్యూర్టో రికో సుందరీ. జోస్ మిగెల్ అగ్రెలోట్ కొలిజియంలో జరిగిన ఈ గ్రాండ్ ఫినాలేలో, గతేడాది మిస్ యూనివర్స్‌గా నిలిచిన మెక్సికోకు చెందిన ఫాతిమా బోష్ చేతుల మీదుగా బారెటో కిరీటాన్ని అందుకున్నారు.

ఎవరీ జెన్నీఫర్‌?
పోటీదారులలో మొత్తం 116 మందిని వెనక్కినెట్టి మరీ మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని గెలుచుకుంది జెన్నీఫర్‌ బారెటో. ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ని గెలుచుకున్న తొలి వివాహిత తల్లిగా ఆమె నిలిచారు. బారెటో జీవితం కేవలం అందాల పోటీ ప్రయాణానికే పరిమితం కాలేదు. ఆమెకు అద్భుతమైన విద్యా నేపథ్యం కూడా ఉంది. ఆమె సైకాలజీ, సామాజిక సేవలో డిగ్రీని కలిగి ఉంది. అలాగే ఆమె ప్రత్యేక మానసిక నిపుణురాలు కూడా. 

జెన్నిఫర్ తన వృత్తిని 2021లో టెక్సాస్‌లోని ఫోర్ట్ హుడ్‌లో యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ సేవలో ప్రారంభించింది. ఆమె కార్ల్ ఆర్. డార్నాల్ ఆర్మీ మెడికల్ సెంటర్‌లో స్వచ్ఛంద సేవ కూడా చేసింది. ఆమె తన వృత్తిలో భాగంగా సైనిక కుటుంబాలకు మద్దతివ్వడం, గృహహింస, బాలల దుర్వినియోగాన్ని పరిష్కరించడం, సమాజ ఆధారిత నివారణ వ్యూహాలను అభివృద్ధి చేయడం తదితర బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఇక బారెటో ఇసాబెలాకు చెందిన సైనిక సేవా సభ్యుడైన యూఎస్‌ ఆర్మీ సార్జెంట్‌ యాన్‌ కార్లోస్‌ బారెటో కాల్డెరాన్‌ను వివాహం చేసుకుంది. ఈ దంపతులు 2019లో ఒక కుమార్తెకు జన్మనిచ్చారు.

బరువు తగ్గి మరి అందాల పోటీల్లోకి ఎంట్రీ..
ఆమె అందాల పోటీల్లోకి మోడలింగ్‌ వంటి వాటిల్లో అనుభవం లేకుండానే వచ్చింది. ఆమె మిస్‌ యూనివర్స్‌ పోటీల కోసం గతేడాది నుంచే సన్నద్ధమైంది. ఈ ప్రక్రియలో ఆమె సుమారు  70 పౌండ్ల బరువు తగ్గింది. ఆమె శాన్ సెబాస్టియన్ పురపాలక సంఘానికి ప్రాతినిధ్యం వహించి, మిస్ యూనివర్స్ ప్యూర్టో రికో 2026 70వ ఎడిషన్‌లో విజయం సాధించింది. ఈ పోటీ  జూన్ 25, 2026న ఏంజెల్ ఓ. బెర్రియోస్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంటర్‌లో ఘనంగా జరిగింది. 

2006లో జులేకా రివెరా మిస్‌ యూనివర్స్‌గా టైటిల్‌ను గెలుచుకున్న 20 ఏళ్ల తర్వాత, జెన్నిఫర్ విజయంతో ప్యూర్టో రికో ఆరవ మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకుంది. ఇదిలా ఉండగా, టాప్‌ ఐదు ఫైనలిస్టులలో  ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్, వెనిజులా, డొమినికన్ రిపబ్లిక్, ప్యూర్టో రికో ఉన్నాయి. 

చివరగా ఈ పోటీల్లో బారెటో విజేతగా కిరీటాన్ని అందుకోగా, డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన మెలిస్సా నునెజ్ మొదటి రన్నరప్‌గా, వెనిజులాకు చెందిన క్లారా వేగాస్ గోయెట్జ్ రెండవ రన్నరప్‌గా నిలిచారు. కాగా, భారత్‌కి ప్రాతినిధ్యం వహించిన కజియా లిజ్ మెజో 12 మంది సెమీ-ఫైనలిస్టులలో స్థానం కోల్పోయి టాప్‌ 30తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

 

ఇదీ చదవండి: కరువులో కల్పతరువు ‘తుమ్మచెట్టు’

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement