మిస్ యూనివర్స్ పోటీలో భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన తొలి మలయాళీగా కేజీయా లిజ్ మెజో తన ప్రత్యేకత నిలుపుకుంది. తాజా విషయానికి వస్తే...మిస్ యూనివర్స్ పోటీలోని వ్యక్తిగత ఇంటర్వ్యూ రౌండ్‌కు కేరళ సాంప్రదాయ చీర కాసవ్ స్ఫూర్తితో రూపొందించిన గౌన్‌లో వచ్చి ‘వావ్’ అనిపించింది. మిస్ యూనివర్స్ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన తొలి మలయాళీగా నిలవడమే కాకుండా ‘కాసవ్’ను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత దక్కించుకుంది.
ప్రయాణంలో ప్రతి క్షణం
‘ఇంటి జ్ఞాపకం చరిత్రలో ఒక భాగం. నా ప్రయాణంలో ప్రతి క్షణం’ అనే కాప్షన్‌తో ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది కేజియా. ‘కాసవ్ చీరల నుండి ప్రేరణ పొందిన గౌనును ఎంచుకోవడానికి కారణం... నా వ్యక్తిగత ఇంటర్వ్యూ దుస్తులు కేవలం డ్రెస్‌లా కాకుండా అంతకంటే ఎక్కువగా ఉండాలని కోరుకున్నాను. ఈ డ్రెస్ కేవలం ఫ్యాషన్ ఛాయిస్ మాత్రమే కాదు... నా మూలాలు, జీవితప్రయాణాన్ని గుర్తు చేసే ప్రయాణం. నా ప్రయాణ ప్రారంభం నుంచి మిస్ యూనివర్స్ వేదిక వరకు ప్రతి జ్ఞాపకాన్ని అది ప్రతిబింబించాలని నేను కోరుకున్నాను’ అని తెలియజేసింది.
జడలో మల్లెపూలదండ!
కేజీయా జడలోని మల్లెపూల దండ, చేతి గాజులు, చెవిపోగులకు కూడా ఒక ప్రత్యేక అర్థం ఉంది. తన ప్రయాణంలోని ప్రతి దశను, జ్ఞాపకాన్ని నొక్కి చెప్పే విధంగా ఆభరణాలను ఎంచుకుంది. మిస్ యూనివర్స్ వేదికపై పోటీ పడుతున్న తొలి మలయాళీగా తాను చాలా గర్వపడుతున్నానని, తన కేరళ మూలాలు ప్రపంచవేదికపై ప్రదర్శించే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందని కేజియా అన్నారు.
‘నా దేశంలో, నా ఇంట్లో నాకు ప్రేమ పంచినవాళ్లు, నా కోసం ప్రార్థన చేసిన వాళ్లు, నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఎన్నో సంవత్సరాల కలలు, ఆశలు, ఇతరులు నాపై ఉంచిన విశ్వాసం నన్ను ఈ వేదికపైకి తీసుకువచ్చాయి’ అంటూ తన మనసులోని మాటను వ్యక్తం చేసింది కేజియా. మిస్ యూనివర్స్ 2026 ఫైనల్ పోటీ నవంబర్ 24 ప్యూర్టోరికోలో జరగనుంది.


