ఫండే
కథాకళి
యువన్ ఆగే రైల్లోంచి అలహాబాద్ రైల్వే స్టేష¯Œ ని చూశాడు. అది ఆగాక తన పెట్టెలోని అంతా దిగేదాకా ఆగి రైలు దిగాడు. అప్పటికింకా దాని పేరు అలహాబాద్. అతను హోటల్‌కి వెళ్ళి, తన గదిలో ఏర్ బేగ్ పెట్టి స్నానం చేశాక, తన కేనన్ కెమెరాని మెడలో తగిలించుకుని షోల్డర్ బేగ్‌తో గదిలోంచి బయటికి నడిచాడు.
హోటల్ మేనేజర్‌కి గది తాళం ఇచ్చి ఓ ఫొటోని చూపించి అడిగాడు.
‘‘ఇది గంగానది ఒడ్డున తీసింది. ఈ ప్రదేశం ఎక్కడ ఉందో చెప్పగలరా?’’
ఆయన దాన్ని దీక్షగా చూశాడు. ముప్ఫై ఐదు, నలభై ఏళ్ళతని ముందో తొమిదేళ్ళ కుర్రాడు. అతను వెనక నుంచి వాడి భుజాల మీద రెండు చేతులు వేసి నిలబడి ఉన్నాడు. ఇద్దరూ కెమెరావైపు నవ్వుతూ చూస్తున్నారు. పిల్లవాడి చేతిలో ఓ పింగాణీ జాడీ. మేనేజర్ అడిగాడు.
‘‘ఇది బ్లాక్ అండ్ వైట్ ఫొటో. చాలాకాలం క్రితం తీసింది కదా?’’
‘‘అవును. ఇరవై తొమ్మిదేళ్ళ క్రితంది. ఈ ఫొటోలో వెనకాల కనపడే బిల్డింగ్స్ చూశారు కదా. ఈ బిల్డింగ్స్ ఎక్కడున్నాయో చెప్పగలరా?’’
‘‘తెలీదు. నేను ఇక్కడ బిజీ. బయట పెద్దగా తిరగను.’’
యువన్ హోటల్‌లోంచి చేతిసంచీతో బయటకి వచ్చి ఆటో డ్రైవర్‌కి ఆ ఫొటోని చూపించి అడిగాడు.
‘‘ఈ స్పాట్‌కి తీసుకెళ్ళగలవా?’’
డ్రైవర్ దాన్ని కొద్దిసేపు దీక్షగా చూసి తల అడ్డంగా ఊపి చెప్పాడు.
‘‘నేను రెండు నెలల క్రితమే అలహాబాద్‌కి వచ్చాను.’’
గంగానది దగ్గర ఆటో దిగాక డ్రైవర్ పక్కనే ఆగి ఉన్న ఆటో వంక చూపించి సలహా చెప్పాడు.
‘‘మీరు వాళ్ళని అడిగి చూడండి సార్.’’
యువన్ వారిలోని తలపండిన డ్రైవర్ దగ్గరికి వెళ్ళి ఆ ఫొటోని చూపించి హిందీలో అడిగాడు.
‘‘ఇందులోని బిల్డింగ్స్ ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండాలి. దయచేసి అక్కడికి తీసుకెళ్ళగలరా?’’
ఆయన ఆ ఫొటోని చూసి కళ్ళు మూసుకుని కొద్దిసేపు గుర్తు చేసుకునే ప్రయత్నం చేశాడు. తర్వాత మరో ఆటో డ్రైవర్‌కి దాన్ని చూపించాడు. వారిద్దరూ మాట్లాడుకున్నాక ఆ డ్రైవర్ చెప్పాడు.
‘‘తెలుసు. దగ్గరే. ఎక్కండి.’’
‘‘ఆ ఫొటోలో ఉన్నది మీరేనా?’’ ఆటో కదిలాక డ్రైవర్ అడిగాడు.
‘‘అవును.’’
‘‘మీసం చూసి గుర్తుపట్టాను.’’
‘‘కాదు. నేను మా నాన్నగారి పోలిక. ఇది నా చిన్నప్పుడు మా నాన్నతో కలిసి తీయించుకున్న ఫోటో.’’
‘‘అలాగా? ఆయన రాలేదా?’’
‘‘వచ్చారు.’’
ఆటో డ్రైవర్ ఆటోని ఆపి కిందకి దిగి కొద్దిసేపు చుట్టూ చూశాక కాని ఆ భవంతులని గుర్తించలేకపోయాడు. వాటిని యువ¯Œ కి చూపించాడు.
ఆటో వెళ్ళాక యువన్ ఫొటోని చూస్తూ ఏ స్పాట్‌లో నించుంటే సరిగ్గా అలాంటి ఫొటో తీయొచ్చో చెక్ చేసుకుంటూ నడిచాడు. తర్వాత అతను తనకి ఎవరు ఫొటో తీస్తారా అని చుట్టూ చూశాడు. నాలుగైదు నిమిషాల్లో అదృష్టవశాత్తు అతనికి మెడలో నికాన్ బ్రాండ్ కెమెరా తగిలించుకుని వెళ్ళే నలభై ఏళ్ళ పంజాబీ లేడీ కనిపించింది. అతను ఆమె దగ్గరికి వెళ్ళి, తన మెడలోని కెమెరాని చూపిస్తూ కోరాడు.
‘‘ఎక్స్‌క్యూజ్ మీ. దయచేసి నాకు ఇక్కడ ఓ ఫొటో తీయగలరా?’’
‘‘ష్యూర్.’’ ఆమె నవ్వుతూ చెప్పింది.
ఆమెకి తన దగ్గర ఉన్న ఫొటో చూపించి చెప్పాడు.
‘‘అటు చూడండి. ఈ ఫొటోలో లాగా ఆ మూడు బిల్డింగ్స్ బేక్‌గ్రౌండ్‌లో వచ్చేలా తీయాలి.’’
‘‘అవి ఎక్కడున్నాయి?’’ ఆవిడ చుట్టూ చూస్తూ అడిగింది.
అతను ఎటువైపు చూడాలో వివరించాక వాటిని గమనించి చెప్పింది.
‘‘గాట్ ఇట్.’’
ఆమె కాస్త వెనక్కి, పక్కకి వెళ్ళమని అతన్ని నడిపించాక, తను కూడా కదిలి చివరికి చెప్పింది.
‘‘పర్ఫెక్ట్. సే ఛీజ్.’’
అతను నవ్వలేదు. సంచిలోంచి జాడీని తీసుకుని కెమేరా వంక చూశాడు. ఆమె ఐదు ఫోటోలు తీసింది. యువన్ ఆమె దగ్గరికి వెళ్ళి ఫొటోలన్నీ మానిటర్‌లో చూసి, తన దగ్గర ఉన్న ఫొటోతో పోల్చి చూసి తృప్తిగా చెప్పాడు.
‘‘అన్నీ పర్ఫెక్ట్. థాంక్స్.’’
‘‘మై ప్లెషర్. ఈ ఫొటోలు ఎందుకు తీయించుకున్నారు?’’ ఆమె ఆసక్తిగా అడిగింది.
‘‘అందులోని కుర్రాడిని నేను. నా వెనక నిలబడ్డది మా నాన్న. దీన్ని ఇరవై తొమ్మిదేళ్ళ క్రితం తీశారు.’’
‘‘మీ నాన్నగారు కూడా ఇక్కడ ఉంటే బావుండేది.’’
‘‘ఉన్నారు.’’
‘‘ఏరి?’’ చుట్టూ చూస్తూ అడిగింది.
అతను తన చేతి సంచీలోంచి పింగాణీ జాడీని చూపిస్తూ చెప్పాడు.
‘‘వారిని త్రివేణి సంగమంలో కలపడానికి వచ్చాను.’’
‘‘వెరీ సారీ. అర్థమైంది.’’
‘‘ఈ ఫొటోని తీసినప్పుడు కూడా మా నాన్నగారు ఇలాంటి పని మీదే వచ్చారు. మా నాన్నని ఇక్కడే ఉన్న మా తాతయ్యకి ఇవ్వబోతున్నాను. సంగమం అంటే కలయికనేగా అర్థం.’’
యువన్ బోట్ మాట్లాడుకుని పింగాణీ జాడీలోని తండ్రి చితాభస్మంతో త్రివేణీ సంగమానికి బయలుదేరాడు.
- మల్లాది వెంకట కృష్ణమూర్తి
ఇదీ చదవండి: ఉర్దూ కవితకు మొక్కట్లు చెక్కిన ఫిరాక్!


