ఫండే
వింతలు విశేషాలు
ఈ ఫొటోల్లో కనిపిస్తున్న మెట్ల మార్గానికి ‘స్టెయిర్‌వే టు హెవెన్’– అంటే, స్వర్గ సోపానమార్గం అనే పేరు ఉంది. ఇది అమెరికాలోని హవాయిలో ఉంది. ఈ మెట్ల మార్గం స్వర్గానికి దారితీయదు గాని, ఈ మార్గంలో అన్ని మెట్లూ పూర్తిగా ఎక్కే ప్రయత్నంలో కొందరు దురదృష్టవంతులు నిజంగానే స్వర్గస్థులైన సంఘటనలు ఉన్నాయి.
నిటారైన ఈ సోపాన మార్గాన్ని అమెరికన్ నౌకాదళం రెండో ప్రపంచయుద్ధ కాలంలో– 1942లో నిర్మించింది. నిటారుగా ఉన్న కొండ కొమ్ముకు చేరుకోవడానికి వీలుగా 3,922 మెట్లతో ఈ మార్గాన్ని నిర్మించి, కొండ శిఖరాగ్రాన యుద్ధ సమాచార ప్రసారాల కోసం రేడియో స్టేషన్‌ను ఏర్పాటు చేసుకుంది. యుద్ధం ముగిశాక ఇది నిరుపయోగంగా మిగిలింది. అప్పటి నుంచి ఇది ఔత్సాహికులకు, ఆకతాయిలకు ఆటవిడుపు ప్రదేశంగా మారింది.
దీని మీద విన్యాసాలు చేస్తూ, కిందనున్న లోయలోకి జారిపడి పలువురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ స్వర్గసోపాన మార్గం భద్రతా సమస్యగా మారడంతో హొనొలులు నగర పాలక సంస్థ 1987లో ఈ మార్గాన్ని అధికారికంగా మూసేసింది. అయినా, ఆకతాయిల ఆగడాలు ఆగకుండా సాగుతుండటంతో ఈ నిర్మాణాన్ని పూర్తిగా ధ్వంసం చేయాలని నగర పాలక సంస్థ 2021లో ఏకగ్రీవంగా తీర్మానించింది.
ఆ తీర్మానం మేరకు నిర్మాణం తొలగింపు పనులు 2024లో మొదలయ్యాయి కూడా! అయితే, చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ కట్టడాన్ని కూలదోయడం సరికాదంటూ కొందరు కోర్టుకెక్కడంతో ఆ పనులు నిలిచిపోయాయి. అప్పటి నుంచి ఈ స్వర్గసోపాన మార్గం కాస్త త్రిశంకుస్వర్గంలో చిక్కుకుంది.
ఇదీ చదవండి: owl Butterfly గుడ్లగూబ కళ్ల సీతాకోక చిలుక


