హ్యూమరమరాలు
‘‘చందూ లేదా ఆంటీ?’’ అడిగారు పొట్టేశ్‌గారు.
పొట్ట ఉండటం వల్ల అతడికి ఆ పేరు వచ్చిందనుకునేరు. కాదు... పొట్టిగా ఉండటంతో ఫ్రెండ్సంతా గురూగార్ని అలా పిలుస్తుంటారు. దాంటో అతడి పొట్ట కూడా
చేరడంతో అతడి టైటిల్ తాలూకు కీర్తి తాలూకు రెలవెన్సు రెట్టింపయ్యింది.
‘‘ఉందమ్మా పొట్టీ... చందూ ఇప్పుడే నేతిలో వేయించిన జీడిపప్పులు తింటూ, దాంతో΄ాటు... అన్ని పిస్తా పప్పులూ, ఇన్ని ఆక్రోటు కాయలూ, కాసిన్ని అంజూర పండ్లూ, ఇంకొన్ని వేరుశెనగ పప్పులూ నంజుకుని ఆ తొక్కలు పడేయడానికి ఇప్పుడే వెళ్లింది’’ జవాబిచ్చింది చందూ వాళ్ల బామ్మ.
తన గురువుగార్ని పట్టుకుని ‘పొట్టీ’ అంటూ పిలిచే ఆ పలకరింపు పట్ల ఆశ్చర్యంగా చూశాడు శిష్యుడు. ‘‘బామ్మగారు ప్రేమతో మనల్ని అలాగే పిలుస్తార్లేరా’’ సర్దిచెప్పారు పొట్టేశ్‌గారు.
‘‘డైటింగు టైమ్‌లో ఇన్ని శ్నాక్సా?’’ ఆశ్చర్యపోయాడు శిష్యుడు.
‘‘మనం స్పాన్సర్ చేసినవేలేరా’’ మళ్లీ సర్దిచెప్పారు పొట్టేశ్.
‘‘మిమ్మల్ని వీళ్లు సాంతం నమిలేస్తున్నారు గురూగారూ’’
‘‘నమిలితే నమిలాల్లేరా... పనైతే అంతే చాలు’’ మరోసారి
సర్దిచెప్పుకున్నాడు పొట్టేశ్.
ఆ హాల్లోంచి... అవతలి రూమ్‌లో ఉన్న అందమైన అమ్మాయి చందూను చూద్దామనుకుంటున్నప్పుడల్లా బామ్మగారి పొట్ట అడ్డొస్తుండటంతో ఇబ్బందిగా ఉంది పొట్టేశ్‌కు.
‘‘ఆ బ్యూటీని చూద్దామనుకున్నప్పుడల్లా... మాటిమాటికీ ఈ పొట్ట ఎంట్రీ ఏమిట్రా?!’’ అంటూ బామ్మగారి టమ్మీ మీద రహస్యంగా ఇరిటేట్ అవుతూ శిష్యుడి ముందు చిందులు తొక్కాడు పొట్టేశ్.
‘‘ఏమ్మా పొట్టీ... పొద్దున్నే వచ్చావ్. ఇంతకీ ఏమన్నా తిన్నావా లేదా?’’ అడిగింది చందూ వాళ్ల బామ్మ.
వాళ్ల దగ్గర తన గురించి నాలుగు మంచి మాటలు చెప్పమని తనను అడగడం గుర్తొచ్చి ఇహ తానందుకున్నాడు శిష్యుడు. కాకపోతే ఇందాకే పొట్ట ప్రస్తావన రావడంతో అదే మనసులో ఉండిపోయి దాని గురించే ఆ నాలుగు మాటలూ వచ్చేశాయి.
‘‘ఏమనుకున్నారండీ మా పొట్టేశ్ గురూగారంటే... సిక్సో క్లాక్‌కు బ్రేక్‌ఫాస్టు. సెవనో క్లాకుకు జ్యూసు, ఎయిటో క్లాక్‌కు శ్నాక్సు... నైనో క్లాక్‌కు కాఫీ...’’ అంటూ ఏదో చెప్పబోతుంటే... ‘‘ఇంక చాల్లే ఆపరా’’ అన్నాడు.
ఇలా అంటూనే రహస్యంగా... ‘‘ఇంకా సాగదీయకు... నువ్విలా మాట్లాడుతూ పోతే... నాకు ఉన్న పొట్టకు తోడు... లేని పొట్టకూడా యాడ్ అవుతూ మరింత పెద్దగా కనిపిస్తుంది’‘ అన్నాడు.
దాంతో ‘‘నాకూ అదే అనిపిస్తోంది.’’ అంటూనే
‘‘ఒక్కమాటలో చెప్పాలంటే...’’ అన్నాడు శిష్యుడు.
‘‘ఇన్ని మాటలు చెప్పి... మళ్లీ ఆ ఒక్క మాటేమిట్రా?’’ అంటూ విసుక్కుంటూనే... పోన్లే దాంట్లో ఏమి మంచి మాట ఉందో, ఏ పొగడ్త దాగుందో అని ఆశగా అడిగాడు.
ఇక్కడ శిష్యుడికి పొట్ట విషయంలో ఓ పద్యం గుర్తొచ్చింది... వేమన బతికున్నరోజుల్లో ఆయనకు ఫ్యాటీలివరూ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణంగా డయాబెటిస్‌తో వచ్చే పొట్ట గురించి పెద్దగా ఐడియా లేదు. అందుకేనేమో వేమనగారి పెయింటింగ్సూ, డ్రాయింగ్సూ ఎన్నో అందుబాటులో ఉన్నా... అందులో అతడి టమ్మీతో సహా అన్నీ దేహమంతా కనిపిస్తూ ఉన్నా... వేమనకు పొట్టలేదని పొట్టేశ్‌గారి శిష్యుడికి అర్థమైంది. లేకపోతే ఆయన ఇలా ఈ కింది పద్యం రాసేవాడేమో అన్నది శిష్యుడి అభిప్రాయం.
పొట్ట ఉన్నవారు తండోపతండంబు
ఉర్వి జనులకెల్ల ఉండు పొట్ట
పొట్ట ఉన్న వారు తమ పొట్టనెరుగరు...
విశ్వదాభిరామ వినుర వేమా!!
ఆ పద్యానికి జస్టిఫికేషన్‌గా తన మాట చెబుతూ... ‘‘ఒక్కమాటలో చెప్పాలంటే.... మా గురూగారు బరువు చూసుకుందామని వేయింగ్ మెషిన్ మీదకెక్కినప్పుడల్లా ఆ రీడింగ్‌కు మళ్లీ తన పొట్టే అడ్డుగా వస్తోందండీ’’ అంటూ గురూగారి పొట్ట గుట్టు విప్పాడు శిష్యుడు.
– యాసీన్
ఇదీ చదవండి: కిరోసిన్ దీపం వెలుగులో చదివిన ప్రధాని!


