నక్షత్రమండలంలో మన సురశ్రీ పాట! | Voyager-1 Indian Song Golden Record | Sakshi
Sakshi News home page

నక్షత్రమండలంలో మన సురశ్రీ పాట!

Nov 21 2026 1:41 AM | Updated on Nov 21 2026 1:54 AM

Voyager-1 Indian Song Golden Record

సందర్భం

అంతరిక్ష నౌక (స్పేస్‌ క్రాఫ్ట్‌)కు  సంబంధించి ఒక చారిత్రక విజయం సొంతమైన వేళ... మన పాట ఒకటి ‘వన్స్‌మోర్‌’ అంటోంది. అది కేసర్‌బాయి కేర్కర్‌ పాడిన పాట. వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఏం జరిగిందంటే... నాసా వారి అంతరిక్ష నౌక ‘వాయేజర్‌1’ భూమి నుంచి అంతరిక్షంలోకి వెళ్లి నాలుగు దశాబ్దాలకు పైగా గడిచింది. తాజా విశేషం ఏమిటంటే... ఈ అంతరిక్షనౌక భూమి నుంచి ఒక కాంతి–దినం (వన్‌ లైట్‌ డే–సుమారు 16.1 బిలియన్‌ మైళ్లు) దూరాన్ని చేరుకుంది. ఈ ఘనత సాధించిన తొలి మానవ నిర్మిత వస్తువు (హ్యూమన్‌–మేడ్‌ ఆబ్జెక్ట్‌)గా చరిత్ర సృష్టించింది.

వన్‌–లైట్‌ డే అంటే...
‘వన్‌–లైట్‌ డే’ అనేది అంతరిక్షంలో సుదూరలను కొలిచే కొలమానం. ‘వన్‌–లైట్‌ డే’ అంటే కాంతివేగంతో ప్రయాణిస్తున్న ఒక రేడియోసిగ్నల్‌ అంతరిక్షనౌక (వాయేజర్‌)ను చేరుకోవడానికి 24 గంటలు సమయం పట్టేదూరం.
‘ఇది మునుపెన్నడూ జరగలేదు. బహుశా జరగక΄ోవచ్చు. ఇది అసాధారణమైన అద్భుతం’ అన్నారు నాసాలోని వాయేజర్‌ మిషన్‌ మేనేజర్‌ కరీమ్‌ బదరుద్దీన్‌.

‘నలభై తొమ్మిది సంవత్సరాల తరువాత కూడా వాయేజర్‌ శాస్త్రీయంగా ఉపయోగపడే రీతిలో పనిచేయడం అనేది అద్భుతం. వాటిని నిరంతంరం పర్యవేక్షిస్తున్న వారి ప్రతిభ, అంకిత భావానికి నిదర్శనం’ అన్నారు అయోవా యూనివర్శిటికీ చెందిన శాస్త్రవేత్త విలియమ్‌ కుర్త్‌.

భూమి పంపిన సందేశం!
మన సౌరవ్యవస్థలోని బాహ్య గ్రహాలైన బృహస్పతి, శనిలను అధ్యయనం చేయడానికి 1977లో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ‘వాయేజర్‌1’ని ప్రయోగించింది. విశేషం ఏమిటంటే తనతో పాటు ఒక ‘గోల్డెన్‌ రికార్డ్‌’ను కూడా ఇది తీసుకువెళ్లింది. ‘భూమి నుంచి వచ్చిన సందేశం’ అనే కాన్సెప్ట్‌తో ఈ గోల్డెన్‌ రికార్డ్‌ను రూ΄÷ందించారు. శబ్దాలు, చిత్రాలతో కూడిన రికార్డ్‌ ఇది. ప్రపంచంలోని 55 భాషలలో శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ప్రపంచంలోని వివిధ ్రపాంతాల సంగీతం ఇందులో ఉంది.

మన పాట కూడా...
వాయేజర్‌ గోల్డెన్‌ రికార్డ్‌ ద్వారా మన దేశం పది భారతీయ భాషలలో శుభాకాంక్షలతో పాటు, కేసర్‌బాయి కేర్కర్‌ పాటను కూడా పంపింది. రాగ్‌ భైరవి రాగంలో స్వరపరిచిన ‘జాత్‌ కహాన్‌ హో’ను ఆమె ఆలపించారు. ఈ రికార్డింగ్‌ మూడు నిమిషాల 30 సెకన్‌ల నిడివి ఉంటుంది. భూమిపై ఉన్న సాంస్కృతిక, సంగీత వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా ఎంపిక చేసిన పాటలలో ఇదొకటి. ఈ పాట బాక్, బిథోవెన్, మొజార్ట్‌ వంటి పాశ్చాత్య శాస్త్రీయ సంగీత స్వరకర్తల రచనల సరసన నిలుస్తుంది. ప్రస్తుతం ‘వాయేజర్‌’ నక్షత్రమండలాల మధ్య ప్రయాణిస్తుంది.

ఎవరీ కేర్కర్‌?
గోవాలోని కేరీ గ్రామంలో జన్మించిన కేసర్‌బాయి కేర్కర్‌ హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. ఆమెది జైపూర్‌–అత్రౌలీ ఘరానాకు చెందిన సంగీత శైలి. క్లిష్టమైన రాగాలకు, కఠినమైన గాత్ర పద్ధతులకు ప్రసిద్ధి చెందిన సంగీత శైలి అది. చిన్న వయసులోనే సంగీతం నేర్చుకున్నారు కేసర్‌బాయి. జైపూర్‌–అత్రౌలీ ఘరాన వ్యవస్థాపకుడైన ఉస్తాద్‌ అల్లాడియా ఖాన్‌ ప్రముఖ శిష్యురాలిగా మారారు.

శక్తివంతమైన గాత్రం, శాస్త్రీయస్వర కల్పనలపై పట్టుతో సంగీత ప్రపంచంలో తనదైన స్థానాన్ని సాధించారు.
కేసర్‌బాయి కేర్కర్‌ తన జీవితకాలంలో అనేక పురస్కారాలను అందుకున్నారు. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ఆమె చేసిన కృషికి సంగీతనాటక అకాడమీ పురస్కారం లభించింది. భారతదేశ అత్యున్నత ΄ûరపురస్కారాలలో ఒకటైన పద్మభూషణ్‌ అందుకున్నారు.
‘సురశ్రీ’ అనే పేరుతో కేసర్‌బాయి ప్రసిద్ధి చెందారు. దీని అర్థం...స్వరరాణి.
1977లో 85 ఏళ్ల వయసులో ఆమె కన్ను మూశారు. అదే ఏడాది ఆగస్ట్‌ 20న వాయేజర్‌ 2, సెప్టెంబర్‌ 1న వాయేజర్‌1 అంతరిక్షనౌకలను 
ప్రయోగించారు.

గోల్డెన్‌ రికార్డ్‌ అంటే?
నాసా వారి గోల్డెన్‌ రికార్డ్‌ అనేది వాయేజర్‌ 1, వాయేజర్‌ 2 అంతరిక్ష నౌకలలో పంపిన టైమ్‌ క్యాప్సూల్‌. బంగారు పూత పూసిన పన్నెండు అంగుళాల రాగి ఫోనోగ్రాఫ్‌ రికార్డ్‌ ఇది. ఖగోళశాస్త్రవేత్త కార్ల్‌ సాగన్‌ నేతృత్వంలో ఈ గోల్డెన్‌ రికార్డ్‌కు రూపకల్పన చేశారు. గోల్డెన్‌ రికార్డ్‌ రూపకల్పన కారణాలలో ఒకటి... గ్రహాంతర జీవులు!

గ్రహాంతర జీవులకు మానవ నాగరికతను పరిచయం చేయడానికి నక్షత్రమండలాల మధ్య ‘గోల్డెన్‌ రికార్డ్‌’ అనేది టైమ్‌ క్యాప్సూల్‌ (ఇంటర్‌స్టెల్లార్‌ టైమ్‌ క్యాప్సూల్‌) మాదిరిగా పనిచేస్తుంది.

అంతరిక్షంలో తుప్పు పట్టకుండా ఉండడానికి ఈ డిస్క్‌ను నికెల్, బంగారంతో పూత పూసిన రాగితో తయారు చేశారు. ప్లేబ్యాక్‌ కోసం ఒక కార్ట్రిడ్జ్, సూదిలను కూడా అల్యూమినియం జాకెట్‌లో అమర్చారు. భూమి భౌగోళిక స్వరూపం, జీవావరణ వ్యవస్థ, మానవ శరీర నిర్మాణం, దైనందిన జీవితం... మొదలైన 116 అనలాగ్‌–ఎన్‌కోడెడ్‌ ఛాయాచిత్రాలు, రేఖాచిత్రాలు గోల్డెన్‌ రికార్డ్‌లో ఉంటాయి.

భూమి శబ్దాలు, ఉరుములు, గాలి, అడుగుల చప్పుడు, గుండె చప్పుడు, తిమింగలాలు, పక్షులు చేసే శబ్దాలు ఉంటాయి. సంగీతానికి సంబంధించి 90–నిమిషాల గ్లోబల్‌ సెలెక్షన్‌లో ప్రపంచవ్యాప్తంగా దిగ్గజాల సంగీతం, సంగీత ధోరణులు ఉంటాయి. దీనిలోనే కేసర్‌బాయి పాటకు చోటు దక్కింది. 1977 సెప్టెంబర్‌లో ప్రయోగించినప్పటి నుంచి వాయేజర్‌ 1 అద్భుత విజయాలు సాధించింది.

ఇదీ చదవండి: ఆ అమ్మాయికి ఆఖరి పాఠం..! కానీ ఆమె ఫ్రెండ్స్‌కి అదే తొలి జీవిత పాఠం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement