ఫండే
ఫ్యాషన్
బ్లూ ప్రింట్
ట్రెండీమెన్
వార్డ్‌రోబ్‌లో ఎన్ని రకాల దుస్తులున్నా, సందర్భానికి తగ్గట్టు స్టయిల్‌ను మార్చేయగల సత్తా ఒక్క జీన్స్‌కి మాత్రమే ఉంది. వందేళ్లకు పైగా ఫ్యాషన్ ప్రపంచాన్ని ఏలుతున్న డెనిమ్ ప్రత్యేకత అదే! సాధారణ జీన్స్‌లోనూ హుందాగా, ట్రెండీగా కనిపించాలంటే ఈ ఫ్యాషన్ టిప్స్ ఫాలో అవ్వండి!
జీన్స్ ఎంత ఖరీదైనదైనా, ఒంటికి సరిగ్గా కుదరకపోతే లుక్ తేడాగా కనిపిస్తుంది. అందుకే ఫ్యాషన్ కోసం సౌకర్యాన్ని పక్కన పెట్టకండి. కొనేముందు ఈ చిన్న చెక్‌లిస్ట్ తప్పక చూసుకోండి!
నడుము ఫిట్:
బెల్ట్ లేకపోతే జీన్స్ జారిపోయేంతలా నడుము ఫిట్ అసలు ఉండకూడదు. మిడ్ రైజ్ జీన్స్ చాలామందికి చక్కగా సరిపోతాయి. ఇవి నడుము కింద సౌకర్యంగా కూర్చుని శరీర ఆకృతికి మంచి సమతుల్యత ఇస్తాయి.
తొడల దగ్గర:
జీన్స్ ఫిట్టింగ్ బాగుందో లేదో తెలుసుకోవాలంటే తొడలు, వెనుక భాగం దగ్గర తప్పకుండా పరిశీలించండి. పాకెట్స్ బయటకు లాగుతున్నా, కూర్చోవడానికి ఇబ్బందిగా ఉన్నా ఆ జీన్స్ వద్దు.
కాలి దగ్గర:
మోకాళ్ల నుంచి చీలమండల వరకు జీన్స్ ఎలా కనిపిస్తుందనేది కూడా ముఖ్యం. ప్యాంట్ కింద మడతలు గుట్టలుగా పేరుకుపోతే పొట్టిగా కనిపించే ప్రమాదం ఉంది. మీ పొడవు తగ్గ జీన్స్ చూసుకోండి. అవసరమైతే ఆల్టరేషన్ చేయించుకోండి.
జీన్స్ ఎప్పుడూ ఫ్యాషన్ లో ఉంటుంది. కానీ దాన్ని ఎలా ధరిస్తున్నామన్నదే మన స్టయిల్‌ను నిర్ణయిస్తుంది. సరైన ఫిట్, చక్కని రంగుల కలయిక, సందర్భానికి తగ్గ జీన్స్ ఈ మూడూ# ఉంటే సాధారణ జీన్స్‌తోనూ అసాధారణంగా కనిపించొచ్చు!
డబుల్ డెనిమ్... డబుల్ స్టయిల్!
ఒకప్పుడు తల నుంచి కాళ్ల వరకు డెనిమ్ వేసుకుంటే ఫ్యాషన్ పొరపాటుగా చూసేవారు. కానీ ఇప్పుడు డబుల్ డెనిమ్ మళ్లీ ట్రెండ్‌లోకి వచ్చింది. కాకపోతే, రెండూ ఒకే రంగులో ఉండాల్సిన అవసరం లేదు. ముదురు నీలం డెనిమ్ జాకెట్‌కు లైట్ బ్లూ జీన్స్; నల్లటి జాకెట్‌కు బ్లూ జీన్స్ జత చేయొచ్చు. మధ్యలో తెల్లటి టీ షర్ట్ వేసుకుంటే లుక్‌కు మంచి బ్యాలెన్స్ వస్తుంది. బూట్లు లేదా లోఫర్స్‌తో మరింత స్టయిల్‌గా కనిపించవచ్చు. గుర్తుంచుకోండి– డెనిమ్ డెనిమ్‌తో పోటీ పడకూడదు; ఒకదానికొకటి తోడుగా ఉండాలి!
హుడీతో హుషారుగా!
జీన్స్– హుడీ కాంబినేషన్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. షాపింగ్‌కు వెళ్లినా, స్నేహితులతో కాఫీ తాగడానికి వెళ్లినా, ఈ జోడీ చక్కగా సరిపోతుంది. లైట్ బ్లూ జీన్స్‌కు సాదా హుడీ, స్నీకర్స్ జత చేస్తే యూత్‌ఫుల్ లుక్ వస్తుంది. చలి ఎక్కువైతే ఫ్లీస్ జాకెట్ కూడా వేసుకోవచ్చు. సింపుల్‌గా ఉండాలనుకునే వారికి ఇదో మంచి ఎంపిక.
స్ట్రెయిట్ ఫిట్... ఎప్పటికీ సేఫ్!
హిప్ దగ్గర నుంచి కాలి మడమ వరకు ఒకే వెడల్పుతో ఉండే స్ట్రెయిట్ లెగ్ జీన్స్ ఎప్పటికీ పాతబడని ఫ్యాషన్. మరీ బిగుతుగా కాకుండా, మరీ వదులుగా కాకుండా చక్కగా కనిపిస్తాయి. టీ షర్ట్, షర్ట్, స్వెటర్– దేనితోనైనా చక్కగా కుదురుతాయి. డార్క్ వాష్ క్లాసీ లుక్ ఇస్తే, లైట్ వాష్ రోజువారీ స్టయిల్‌కు సరిగ్గా సరిపోతుంది.
సీజన్ కు తగ్గ షేడ్స్!
వేసవిలో లైట్ బ్లూ, వాష్డ్ డెనిమ్ రంగులు తాజాగా కనిపిస్తాయి. చలికాలంలో డార్క్ ఇండిగో, బ్లాక్ జీన్స్ మంచి ఎంపిక. అయితే ఇవే కచ్చితమైన రూల్స్ కాదు. మీకు నచ్చిన రంగులను సందర్భానికి తగ్గట్టు కలిపి ధరించొచ్చు. జీన్స్ ప్రత్యేకతే అదే. ఏ సీజన్ లోనైనా స్టయిల్‌గా నిలబడుతుంది!
- కొండి దీపిక
ఇదీ చదవండి: ఐదేళ్ల అబ్బాయిలు.. ఏడేళ్ల అమ్మాయిలకు జపాన్‌లో వింత వేడుక!


