సింహానికి అనారోగ్యం.. నక్క వేసిన మాస్టర్‌ ప్లాన్‌! | Funday Children's Story On Lion Fox Monkey Moral Story | Sakshi
Sakshi News home page

సింహానికి అనారోగ్యం.. నక్క వేసిన మాస్టర్‌ ప్లాన్‌!

Nov 15 2026 11:50 AM | Updated on Nov 15 2026 11:55 AM

Funday Children's Story On Lion Fox Monkey Moral Story

ఫండే

పిల్లల కథ

ఒక అడవిలో బలమైన సింహం రాజుగా ఉండేది.  
అది చలాకీగా, ఆనందంగా జీవించేది.  
అడవిలోని ప్రతి జీవి కష్టసుఖాలూ తెలుసుకుని, వాటికి సహాయం చేసేది.
మృగరాజు వద్ద నక్క మంత్రిగా ఉండేది.

ఒకరోజు సింహం ఆకలిగా ఉన్నా కూడా ఆహారం తినలేదు. మరుసటి రోజు కూడా అదే పరిస్థితి కొనసాగింది. దీంతో సింహం బలహీనంగా, నీరసంగా మారింది.  
అడవిలోని జీవులంతా ఆందోళన చెందాయి.  
‘మా రాజుకు ఏమైందో?’ అని అడవి జంతువులన్నీ చర్చించుకున్నాయి.
వైద్యుడు ఎలుగుబంటి వెంటనే సింహాన్ని చూసేందుకు వచ్చింది. వివిధ మూలికలు సేకరించి, మందు తయారు చేసి ఇచ్చింది.

అయినా, ఫలితం కనిపించలేదు. ఎలుగుబంటికి అర్థం కాక బుర్రగోక్కుంది.
సింహం కోపంతో గర్జించింది: ‘నీ మందుతో నాకు ఉపశమనం కలగలేదు!’ అని అరిచింది.  
భయంతో ఎలుగుబంటి అడవిని విడిచి పారిపోయింది.
ఇంతలో మంత్రి నక్కకు ఒక యుక్తి పుట్టింది. అది అడవిలో మూలికలపై పరిశోధన చేస్తున్న కోతిని పిలిపించింది.  
‘కోతి మిత్రమా! మన రాజు చాలా అస్వస్థతగా ఉన్నాడు. నీవు దానిని పరీక్షించు.’ అని చెప్పింది నక్క.

కోతి సింహాన్ని పరిశీలిస్తూ, ‘ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వెంటనే వైద్యం చేయాలి; లేకపోతే ప్రాణానికి ప్రమాదం!’ అంది.
కోతి తన సంచిలో ఉన్న రెండు మూలికలను తీసి, చూర్ణం చేసి, నీటిలో కలిపింది.  
సింహానికి ఆ మిశ్రమ విరుగుడు మందు తాగించింది. కొద్దిసేపు గమనించింది.  
మరికొద్దిసేపటికి సింహం కదలడం మొదలుపెట్టింది.  
అది లేచి, అటు ఇటు నడుస్తూ, కడుపు నిండా ఆహారం తిన్నది.

సింహం ఆరోగ్యం మెరుగైందని అడవి అంతా ఆనందంగా మారింది.  
మరుసటి రోజుకి సింహం పూర్తిగా ఆరోగ్య వంతమైంది.
సింహం సంతోషించి కోతిని పిలిపించింది.  
‘మిత్రమా! నీవు నా ప్రాణాన్ని కాపాడావు! ఇక నుంచి నీవే నా రాజ వైద్యుడు,’ అని సింహం ప్రకటించింది.  
కోతి గర్వంగా నవ్వుతూ నమస్కరించింది.
నక్కకు ఒక వేరు ఆలోచన వచ్చింది.

ఒకరోజు నక్క కోతిని పక్కకు పిలిచి అంది: ‘మిత్రమా! నీవిచ్చిన  నీరసం వచ్చే మూలికను నీటిలో కలిపి, మృగరాజుకు రోగం వచ్చేలా చేశాను. ఎలుగుబంటిని పారిపోయేలా చేశాను. మన పథకం ఫలించి, నీవు రాజ వైద్యుడు అయ్యావు,’ అని నక్క తెలిపింది.  
‘అయితే మనం మృగరాజును చంపాలని నువ్వు అనుకుంటున్నావా?’  అడిగింది కోతి.

నక్క తల ఊపుతూ ‘అవును! నువ్వు విషపు మూలిక ఇస్తే, నేను నీటిలో కలిపి మృగరాజుకు తాగిస్తాను. అప్పుడు నేనే ఈ అడవికి రాజును అవుతాను.’ అని తన పథకం చెప్పింది. 
కోతి నవ్వుతూ: ‘సరే మిత్రమా, రేపే మన పథకం జరుగుతుంది.’ అంది.
కానీ వీరి మాటలు సమీపంలోని చెట్ల వెనక దాక్కున్న మృగరాజు విన్నాడు.  
సింహం గర్జనతో బయటికి వచ్చి, పంజాతో నక్కపై దాడి చేసింది.

నక్క ఒకే దెబ్బకు చనిపోయింది.  
కోతి భయంతో వణికిపోయి, వెంటనే అడవిని వదిలి పారిపోయింది.
సింహం అడవి సరిహద్దులో ఉన్న ఎలుగుబంటిని వెతికి దగ్గరికి తీసుకుంటూ అంది:  
‘మిత్రమా, నన్ను క్షమించు. నేను చేసిన తప్పు తెలిసిపోయింది!’ అంటూ సింహం ఎలుగుబంటిని దగ్గరుండి అడవికి ఆహ్వానించి, ‘నీవే మళ్లీ నా రాజ వైద్యుడివి,’ అని ప్రకటించాడు మృగరాజు.
- భార్గవి

హితవచనం...
దుర్జనస్య విశిష్టత్వం పరోపద్రవ కారణమ్‌
ఉపోషితస్య వ్యాఘ్రస్య పారణం పశుమారణమ్‌
- దుర్మార్గుడు ఎవడైనా మంచిగా ప్రవర్తిస్తున్నాడంటే, అది ఎవరి కొంపనో ముంచడానికే! పులి ఉపవాసం ఉందంటే, తర్వాత అది జంతువులను చంపి తినడానికే!

ఇదీ చదవండి: ఆఫీసులోకి ఈగ వచ్చింది.. బిలియనీర్‌ ప్రాణం తీసింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement