‘మహాదేవా.. నన్ను క్షమించు! శివుడి ముందు తలవంచాడు! | Lord Shiva Markana Sage Story | Sakshi
Sakshi News home page

‘మహాదేవా.. నన్ను క్షమించు! శివుడి ముందు తలవంచాడు!

Nov 15 2026 9:30 AM | Updated on Nov 15 2026 9:30 AM

Lord Shiva Markana Sage Story

ఫండే

భక్త విజయం

మంకణ మహర్షి వృత్తాంతం

మంకణుడు కశ్యప ప్రజాపతి మానసపుత్రుడు. అతడు నిష్ఠాగరిష్ఠుడు. మంకణుడు బ్రహ్మచర్యం పాటిస్తూ, సరస్వతీ నదీతీరం వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని, అక్కడ కేవలం శాకాహారం మాత్రమే తీసుకుంటూ, తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. నిత్యం శివ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ, ఘోర తపస్సును ఆచరిస్తుండటంతో మంకణుడు సూర్యతేజస్సుతో ప్రకాశించేవాడు.

ఒకనాడు మంకణుడు నిత్య నైమిత్తిక కార్యక్రమాల కోసం దర్భలు కోసుకు రావడానికి సమీపంలోని అడవికి వెళ్లాడు. అక్కడ దర్భలు కోస్తూ ఉండగా, ఒక దర్భపోచ అతడి చేతివేలికి బలంగా గుచ్చుకుంది. అతడి వేలి నుంచి నెత్తురు బదులుగా ఆకుపచ్చని శాకరసం స్రవించింది. మానవులు ఎవరికైనా పదునైన కోత వల్ల ఏర్పడిన గాయం నుంచి రక్తం స్రవించడం సహజం. అందుకు భిన్నంగా తనకు దర్భపోచ వల్ల అయిన గాయం నుంచి శాకరసం స్రవించడం చూసి మంకణుడు తొలుత ఆశ్చర్యం చెందాడు.

కొద్ది క్షణాల్లోనే ఇదంతా తన తపోమహిమ ఫలితమేనని అనుకున్నాడు. తనవంటి తపోధనుడు మరెక్కడా ఉండడని కూడా అనుకున్నాడు. ఇలా అనుకోవడంతోనే అతడికి కించిత్‌గర్వంతో కూడిన ఆనందం కలిగింది. ఆ ఆనంద పరవశంలో తాండవం చేయడం ప్రారంభించాడు.

మంకణుడి తాండవానికి భూమ్యాకాశాలు దద్దరిల్లాయి. నక్షత్రాలు కదలిపోయాయి. సమస్త విశ్వం గడగడలాడింది. అతడి తాండవ తీవ్రతకు లోకాలు అల్లకల్లోలంగా మారడంతో దేవతలు, మునులు భయపడ్డారు. వారందరూ బ్రహ్మదేవుడి వద్దకు పరుగు పరుగున వెళ్లి, మంకణుడి తాండవాన్ని ఆపాలని కోరారు. ‘దేవతలారా! మంకణుడు శివభక్తుడు. అతడి తాండవనృత్యాన్ని ఆపగలిగే శక్తి ఆ పరమశివుడికి మాత్రమే ఉంది. పదండి, మనమంతా ఆయన వద్దకే వెళదాం’ అన్నాడు.

బ్రహ్మాది దేవతలు కైలాసానికి వెళ్లి, శివుడి ముందు నిలబడి ‘పాహిమాం... పాహిమాం.., పరమేశ్వరా! సమస్త విశ్వాన్నీ విశ్వనాథుడివైన నువ్వే కాపాడాలి. నీ భక్తుడైన మంకణుడు ఆపకుండా చేస్తున్న తాండవంతో లోకాలు అల్లకల్లోలమవుతున్నాయి. నువ్వే అతడి ఉన్మత్త తాండవాన్ని ఆపాలి’ అని మొరపెట్టుకున్నారు.

‘సరే’నని పరమశివుడు దేవతలకు అభయమిచ్చాడు. వెంటనే తాండవం చేస్తున్న మంకణుడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఉన్మత్త స్థితిలో ఉన్న మంకణుడు సాక్షాత్తు పరమశివుడే తన ఎదుట నిలిచి ఉన్నా, తన నాట్యాన్ని ఆపలేదు.

పరమశివుడు చిరునవ్వులు చిందిస్తూ, ‘మంకణా! ఎందుకింతలా తాండవనృత్యం చేస్తున్నావు?’ అని అడిగాడు.‘స్వామీ! నా తపస్సు వల్ల నా వేలికి కుశాగ్రం వల్ల అయిన గాయం నుంచి శాకరసం స్రవిస్తోంది, చూశావా! ఇదే నా హర్షాతిరేకానికి కారణం. అందుకే తాండవనృత్యం చేస్తున్నాను’ అని చెప్పాడు మంకణుడు.

పరమశివుడు శాంతంగా నవ్వుతూ, ‘ఓస్‌! దీనికేనా ఇంత గర్వాతిశయం, ఇంత హర్షాతిరేకం? ఇదిగో చూడు’ అంటూ తన వేలి గోరుతో తన తొడపై చిన్న గాయం చేసుకున్నాడు. అందులోంచి చూస్తుండగానే మంచులాంటి తెల్లని బూడిద ధారగా కురవడం మొదలైంది. 
ఈ అద్భుతాన్ని చూసి మంకణుడు ఒక్కసారిగా స్థాణువైపోయాడు. అప్పటి వరకు అతడిలో ఉన్న గర్వాతిశయం మొత్తం పటాపంచలైపోయింది.

‘మహాదేవా! నన్ను క్షమించు. నా అల్ప తపోమహిమకే నేను మితిమీరి గర్వించాను. అజ్ఞానంతో తన్మయం చెంది, లోకాలను భయపెట్టేలా తాండవం చేశాను. నా తప్పును మన్నించు’ అంటూ పరమశివుడి పాదాల మీద పడ్డాడు.

మంకణుడి భక్తికి శివుడు మెచ్చాడు. అతడిని లేవనెత్తి, ‘మహర్షీ! నువ్వు చేసిన తపస్సు మహిమాన్వితమైనది. నువ్వు తపోనిష్ఠలో ఉన్న ఈ సరస్వతీ తీర్థం అత్యంత పవిత్రమైనదిగా మారుతుంది. ఇక్కడ స్నానం చేసి, నిన్ను పూజించిన వారికి సమస్త పాపాలు తొలగిపోతాయి’ అని వరమిచ్చి అంతర్ధానమయ్యాడు.

పురావిశేషం...
పిరవి మరుందేశ్వర ఆలయం
తమిళనాడులోని పురాతన శివాలయాల్లో పిరవి మరుందేశ్వర ఆలయం అరుదైనది. దాదాపు రెండువేల ఏళ్ల నాటి ఈ ఆలయం తిరువారూర్‌ జిల్లా తిరుతురైపూండిలో ఉంది. ఈ ఆలయంలో శివుడు గజాసురుడిని సంహరిస్తున్నట్లుగా దర్శనమిస్తాడు. ‘గజాసుర సంహారమూర్తి’గా పూజలు అందుకునే అరుదైన ఈ ఆలయంలో శివుడికి ‘నక్షత్రచూర్ణం’తో అభిషేకం చేస్తారు.

ఇరవైఏడు నక్షత్రాలకు చెందిన వృక్షాల మూలికలతో ఈ చూర్ణాన్ని తయారు చేస్తారు. ఇక్కడ నిత్యం నక్షత్ర చూర్ణంతో అభిషేకం జరుగుతున్నా, కార్తీకమాసంలో నక్షత్రచూర్ణాభిషేకానికి మరింత ప్రాశస్త్యం ఉంటుంది. ఈ సందర్భంగా భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది.

ఇదీ చదవండి: ఈవారం కథ: 'వేపచెట్టు నీడ'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement