ఫండే
మిస్టిక్ వరల్డ్
1944... అమెరికా అలాస్కా రాష్ట్రంలోని హూనా ప్రాంతం...
ట్లింగిట్ ఆదివాసీ తెగకు చెందిన ఓ కుటుంబంలో ఓ బాలుడు జన్మించాడు. తల్లిదండ్రులు అతడికి నార్మన్ డెస్‌పర్స్ అని పేరు పెట్టారు. చిన్నారికి మూడేళ్ల వయసు వచ్చింది. తల్లిదండ్రులు అతడిని సముద్రపు ఒడ్డున ఉన్న డుండాస్ బే ప్రాంతానికి తీసుకెళ్లారు. అది వారి ఇంటికి సుమారు 35 మైళ్ల దూరంలో ఉంది.
అక్కడి పరిసరాలను చూసిన చిన్నారి నార్మన్ ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యాడు. అక్కడ తనకు ఒకప్పుడు చేపలను నిల్వ చేసే గది ఉండేదని, జీవిత చరమాంకంలో తాను చూపు కోల్పోయానని చెప్పేసరికి, తమ కుమారుడు ఎందుకిలా మాట్లాడుతున్నాడో తెలియక నార్మన్ తండ్రి హెన్రీ డెస్‌పర్స్ జూనియర్ అయోమయానికి గురయ్యాడు.
రోజులు గడుస్తున్న కొద్దీ నార్మన్ చెప్పే వివరాలు వారిని ఆందోళనకు గురిచేశాయి. ఎందుకంటే అతడు చెప్పిన రెండు అంశాలూ నార్మన్ తాతయ్య హెన్రీ డెస్‌పర్స్ సీనియర్ జీవితానికి సంబంధించిన అంశాలుగా అనిపిస్తున్నాయి. ఆ ప్రాంతంలో హెన్రీ డెస్‌పర్స్ సీనియర్ ఒక మత్స్యకారుడిగా జీవించాడు. చేపలను నిల్వ చేయడానికి అక్కడ ఒక స్మోక్‌హౌస్‌ను కూడా నిర్వహించేవాడు. జీవితంలోని చివరి నాలుగేళ్లు అతడు చూపు కోల్పోయి గడిపాడు.
హెన్రీ డెస్‌పర్స్ సీనియర్ 1937లో 85 ఏళ్ల వయసులో మరణించాడు. ఆ స్మోక్‌హౌస్‌ను ఉపయోగించడం 1930లోనే మానేశాడు. నార్మన్ తన తల్లిదండ్రులతో అక్కడికి వెళ్లిన సమయంలో ఆ నిర్మాణం దాదాపు కనుమరుగైపోయింది. కొన్ని స్తంభాల అవశేషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అంత చిన్న వయసులో ఆ ప్రాంతానికి తొలిసారి వెళ్లిన బాలుడికి అక్కడి పాత నిర్మాణం గురించి, తన తాతకు వచ్చిన అంధత్వం గురించి ఎలా తెలిసింది? కుటుంబ సభ్యులు చెప్పిన మాటలు అతని జ్ఞాపకాల్లో నాటుకుపోయాయా? లేక నిజంగానే గత జన్మ జ్ఞాపకాలా? ఈ ప్రశ్నలే ఈ ఉదంతాన్ని ఆసక్తికరంగా మార్చాయి.
ఈ అంశం పునర్జన్మలపై పరిశోధనలు చేస్తున్న అమెరికాలోని వర్జీనియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఇయాన్ స్టీవెసన్‌కు తెలిసింది. ఆయన రంగంలోకి దిగి నార్మన్ కేసును పరిశోధించారు. ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలను నార్మన్ తండ్రి నుంచి సేకరించి, అప్పటికి 18 ఏళ్ల వయసున్న నార్మన్ ను కూడా 1962లో సిట్కా ప్రాంతంలో ఇంటర్వ్యూ చేశారు. అయితే, నార్మన్‌కు చిన్నతనంలో తాను చేసిన ఆ వ్యాఖ్యలు స్పష్టంగా గుర్తులేవు. డుండాస్ బేలోని స్మోక్‌హౌస్ గురించి కొంత గుర్తున్నట్లు అనిపించినా, అది అదే ప్రదేశానికి సంబంధించినదని కచ్చితంగా చెప్పలేకపోయాడు.
1972లో స్టీవెన్‌సన్ మళ్లీ
నార్మన్ ను కలిసినప్పుడు అతడికి 27 ఏళ్లు. అప్పటికి అతడు వివాహం చేసుకుని, ముగ్గురు పిల్లలకు తండ్రయ్యాడు. అప్పటివరకు తనకు కొత్తగా గత జన్మ జ్ఞాపకాలేవీ కలగలేదని నార్మన్ తెలిపాడు. అంటే, చిన్నతనంలో చెప్పిన ఆ రెండు మాటలే ఈ కేసులో ప్రధానమైనవిగా మిగిలిపోయాయి.
నార్మన్ ఉదంతాన్ని పునర్జన్మకు అనుకూలంగా కనిపించే కేసుగా స్టీవెన్ సన్ తన పుస్తకంలో చేర్చారు. అయితే, ఆయన ఈ కేసుకు మరో సాధ్యమైన వివరణను కూడా పరిశీలించారు. నార్మన్‌కు తెలియకుండానే తన తండ్రి నుంచి ఆ వివరాలు అంది ఉండవచ్చని, వాటిని తన గత జ్ఞాపకాలుగా భావించి ఉండవచ్చని పేర్కొన్నారు. మనకు ఒక ప్రదేశం కొత్తదైనా, అక్కడికి వెళ్లినప్పుడు గతంలో చూసినట్లుగా అనిపించే అనుభూతిని ‘డెజావూ’ అంటారు.
నార్మన్ విషయంలోనూ అలాంటి అనుభూతి, ఇతరుల నుంచి తెలియకుండానే సమాచారం అందడం వంటి అవకాశాలను పూర్తిగా తోసిపుచ్చలేమని స్టీవెన్ సన్ అభిప్రాయపడ్డారు. నార్మన్ డెస్‌పర్స్ ఘటనలో పెద్దగా కథలు లేవు. గత జన్మలో తన పేరు ఇదేనని, తన కుటుంబం ఫలానా చోట ఉండేదని, తాను ఎలా మరణించానని అతడు చెప్పలేదు. కేవలం పాత స్మోక్‌హౌస్ గురించి, జీవిత చరమాంకంలో చూపు కోల్పోవడం గురించి మాత్రమే ప్రస్తావించాడు.
ఆ రెండు వివరాలూ అతని తాత జీవితానికి సరిపోవడంతో ఈ కేసు పునర్జన్మ పరిశోధనల్లో చోటు సంపాదించింది. జ్ఞాపకాలు మనిషి మెదడులో ఎలా ఏర్పడతాయి? ఒక చిన్నారి తనకు తెలియని విషయాన్ని తెలిసినట్లుగా ఎలా చెప్పగలడు? ఈ ప్రశ్నలకు నార్మన్ కథ తుది సమాధానం ఇవ్వదు. పునర్జన్మను నమ్మేవారికి ఇది ఒక ఆసక్తికరమైన ఉదాహరణ. శాస్త్రీయ దృష్టితో చూసేవారికి మాత్రం మరింత లోతైన పరిశోధన అవసరమని గుర్తుచేసే ఉదంతమిది.
- సత్యకిశోర్ కొండ్రెడ్డి
ఇదీ చదవండి: అంధకారంలో ఐదురోజులు


