తొందరపాటు బుజ్జాయిలు | World Prematurity Day highlights premature birth causes health risks | Sakshi
Sakshi News home page

తొందరపాటు బుజ్జాయిలు

Nov 15 2026 6:26 AM | Updated on Nov 15 2026 6:27 AM

World Prematurity Day highlights premature birth causes health risks

సాధారణంగా గర్భం ధరించిన మహిళకు బిడ్డ కడుపులో ఉండే కాల వ్యవధి తొమ్మిది నెలలు. ఇది అందరికీ తెలిసిన విషయమే.. వారాల్లో కొలిచే వైద్య పరిభాషలో చెప్పాలంటే ఈ కాలవ్యవధి 37 వారాలు. ఇలా బిడ్డ పూర్తిగా 37 వారాలు కడుపులో ఉన్న తర్వాత జరిగే ప్రసవాన్ని ‘ఫుల్‌ టర్మ్‌ డెలివరీ’ అంటారు. కొందరిలో బిడ్డ పూర్తికాలం కడుపులో ఉండకుండానే ప్రసవం జరిగే అవకాశముంటుంది. అలా నెలల నిండకుండానే పుట్టే పిల్లల్ని ‘ప్రీ మెచ్యూర్‌ బేబీస్‌’ అంటారు. ఈరోజు (నవంబరు 15) ‘వరల్డ్‌ ప్రీ–మెచ్యుర్‌ బేబీస్‌ డే’ కావడంతో ఇలాంటి పిల్లల గురించి అవగాహన కోసం ఇస్తున్న కథనమిది.


సాధారణంగా మన సమాజంలో నెలలు నిండకుండా పుట్టే బిడ్డలను కొద్దిగా ముద్దు చేస్తూనో లేదా కాస్త నిందార్థంలోనో ‘నెల తక్కువ పిల్లలం’టూ చెప్పడం మామూలే. ఈ ‘ప్రీ–టర్మ్‌’ బేబీస్‌ లేదా నెల తక్కువ పిల్లలు పుట్టడానికి కారణాలూ, వాటి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకుందాం. 

ప్రీ మెచ్యుర్‌ బేబీస్‌ పుట్టడానికి కారణాలు..  
ప్రీమెచ్యుర్‌ బేబీస్‌ పుట్టడానికి అనేక కారణాలున్నాయి. అవి... 
→ గర్భందాల్చిన మహిళలో ఆరోగ్య సమస్యలు తలెత్తడం. 
→ గర్భస్థ పిండంలో ఏవైనా సమస్యలు రావడం. 
→ తల్లి వయసు మరీ తక్కువ లేదా మరీ ఎక్కువ కావడం. 
→ తల్లికి బీపీ, షుగర్‌ వంటి వ్యాధులు ఉండటం. 
→ మల్టిపుల్‌ జస్టేషన్స్‌ / అనేక సార్లు గర్భధారణ జరగడం. 
→ కాబోయే తల్లి ప్రైవేట్‌ భాగాల్లో ఇన్ఫెక్షన్స్‌ రావడం. 
అయితే కొందరిలో ఎలాంటి కారణాలు లేకుండానే 
(ఇడియోపథిక్‌)... ప్రీమెచ్యూర్‌ బేబీ పుట్టవచ్చు. 

ప్రీ–మెచ్యూర్‌ బేబీస్‌కి వచ్చే సమస్యలు ఏమిటి? 
మహిళ గర్భంలో బిడ్డ పరిపూర్ణంగా రూ΄÷ందడానికి తొమ్మిది నెలలు అవసరం. కానీ ప్రీ–మెచ్యూర్‌ బిడ్డల్లో సాధారణంగా అన్ని అవయవాలూ పూర్తిగా రూపుదిద్దుకోకపోవచ్చు. ప్రీ–మెచ్యుర్‌ బేబీస్‌లో ఈ ముప్పు ఉంటుంది. ఇలా అవయవాలు పూర్తిగా రూపుదిద్దుకోని ఈ కండిషన్‌నే ‘ఇమెచ్యూర్‌ ఆర్గన్స్‌ అండ్‌ ఆర్గన్‌ సిస్టమ్స్‌’ అంటారు. అందుకే సాధారణంగా ప్రీ–మెచ్యుర్‌గా పుట్టిన పిల్లల్లో కొన్ని అవయవాలకు సంబంధించిన లోపాలు ఉండేందుకు అవకాశాలెక్కువ.. ఇందులో ప్రధానంగా కనిపించేవి శ్వాసకోశ సమస్యలు. 

ఇలాంటి పిల్లల్లో ప్రధానంగా ఊపిరితిత్తులు పూర్తిగా అభివృద్ధి చెందకపోవచ్చు. దాంతో ‘రెస్పిరేటరీ డిస్ట్రస్‌ సిండ్రోమ్‌’ వంటి ఊపిరితిత్తుల లోపాలు కనిపించవచ్చు. అలాగే గుండెకు సంబంధించిన సమస్యలూ ఎక్కువే. వీటిని పేటెంట్‌ డక్టస్‌ ఆర్టీరియోసస్‌– పీడీఏ అంటారు. కొందరిలో పేగులు పూర్తిగా అభివృద్ధి చెందకపోవచ్చు. ఇలా పేగులు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడాన్ని ఎన్‌ఈసీ (నెక్రొటైజింగ్‌ ఎంటరోకొలైటిస్‌) అంటారు. ఇక మెదడులో అతి సున్నితమైన కొన్ని రక్తనాళాలు చిట్లే అవకాశాలూ ఉంటాయి. ఈ సమస్యను ఐవీహెచ్‌ (ఇంట్రావెంట్రిక్యులార్‌ హేమరేజ్‌)గా పేర్కొంటారు. 

ప్రీ–మెచ్యూర్‌ బేబీస్‌కు వచ్చే ప్రధాన సమస్యలను నివారించవచ్చా? 
హైరిస్క్‌ ప్రెగ్నెన్సీ గర్భవతుల్లో 34 వారాల లోపు ప్రసవం జరిగే ప్రమాదం ఉన్నప్పుడు, గర్భవతికి కొన్ని రకాల ఇంజెక్షన్ల కోర్స్‌తో పుట్టబోయే ప్రీ–మెచ్యూర్‌ బేబీకి వచ్చే ప్రధాన సమస్యలను అధిగమించేందుకు అవకాశం చాలావరకు ఉంటుంది. 

పుట్టిన ప్రతి ప్రీ–టర్మ్‌ బేబీకీ ఎన్‌ఐసీయూ కేర్‌ (పుట్టిన పిల్లలకు చికిత్స జరిపే ఇంటెన్సివ్‌ కేర్‌)లో ఉంచడం అవసరమా? 
ముప్ఫయి ఐదు వారాలలోపు పుట్టిన ప్రీమెచ్యూర్‌ బేబీస్‌తో పాటు, రెండు కిలోల కంటే తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఇలా పుట్టిన పిల్లలను ఐసీయూలో ఉంచి, పర్యవేక్షించడం తప్పనిసరి. 

ప్రీ–మెచ్యూర్‌ బేబీకి ఆసుపత్రిలో జరిగే చికిత్స ఇలా..
ప్రీమెచ్యూర్‌ బేబికి వచ్చే సమస్యలన్నీ ‘ఫంక్షనల్‌ ఇమ్మెచ్యురిటీ’ కారణంగానే వస్తాయి. అంటే... ప్రతి అవయవం పరిపూర్ణంగా తయారైనప్పటికీ, అది పూర్తిస్థాయిలో పనిచేయకపోవచ్చు. ఇలా పూర్తిస్థాయిలో పనిచేయకపోవడాన్ని ‘ఫంక్షనల్‌ ఇమ్మెచ్యూరిటీ’ అంటారు. తల్లి కడుపులో  నెలలు గడిచే కొద్దీ బిడ్డ అవయవాలకు ఈ మెచ్యూరిటీ వస్తుంటుంది. అంటే... అవయవానికి పనిచేసే సామర్థ్యం సమకూరుతుంది. అయితే, ఏ కారణం వల్లనైనా ప్రీమెచ్యూర్‌ డెలివరీ అయితే... పుట్టిన పిల్లలకు ప్రీమెచ్యూరిటీ కారణంగా వచ్చే సమస్యలను ముందుగానే ఊహించి, సరైన విధానంలో చికిత్స చేసినట్లయితే, ఈ ప్రీ–మెచ్యూర్‌ చిన్నారులను సైతం బతికించే అవకాశాలు పెరుగుతాయి. ప్రీ–మెచ్యూర్‌ బేబీస్‌కు పుట్టిన మొదటి క్షణం నుంచి ఈ ప్రత్యేకమైన చికిత్స అవసరం. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ఇన్‌యుటెరో ఆట్మాస్ఫియర్‌ (అంటే తల్లి కడుపులోనే ఉండే వాతావరణం)లో ఉన్నట్లుగానే ఉంచి, వారికి అవసరమైన రీతిలో చికిత్స ఇవ్వగలిగితే ఇలాంటి బేబీస్‌ను సంపూర్ణంగా మనుగడ (ఇంటాక్ట్‌ సర్వైవల్‌) సాధించేలా చేయడం ఇప్పుడు చాలావరకు సాధ్యమవుతోంది. 

ప్రీ టెర్మ్‌ బేబీస్‌... అపోహలు
ఇలా నెలలు పూర్తిగా నిండకముందే పుట్టిన పిల్లలు – పూర్తికాలం గర్భంలో ఉన్నవారితో పోలిస్తే కొంత మందకొడిగా ఉంటారనే అభి్రపాయం కొందరిలో ఉంది. ఇది పూర్తిగా అపోహ మాత్రమే. ఐన్‌స్టీన్, మార్క్‌ట్వైన్, విన్‌స్టన్‌ చర్చిల్, పికాసో, ఐన్‌స్టైన్‌... వీళ్లంతా నెలలు నిండకముందే పుట్టారు. వాళ్ల ప్రతిభ ప్రపంచవ్యాప్తమైన విషయం తెలిసిందే.  

చివరగా... హైరిస్క్‌ ప్రెగ్నెన్సీని ముందుగా గుర్తించినప్పుడు, ఈ ప్రీ–మెచ్యూర్‌ బేబీస్‌ విషయంలో తఅన్ని చికిత్సా సదుపాయాలు ఉన్న పెద్ద ఆసుపత్రిలో ప్రసవం అయ్యేలా చూస్తే... తల్లీ, బిడ్డా... ఈ ఇరువురికీ మెరుగైన చికిత్స అందే అవకాశాలెక్కువ.

పుట్టిన ప్రతి ప్రీమెచ్యూర్‌ బేబీకీ... సమస్యలు తప్పనిసరియా?  
ప్రీమెచ్యూర్‌ బేబీస్‌లో సాధారణంగా కనిపించే సమస్యలూ, వాటి తీవ్రత అన్న అంశాలు... బిడ్డ ఎంత ప్రీ–మెచ్యూర్‌గా పుట్టిందన్న అంశంపై ఆధారపడి ఉంటాయి. సాధారణంగా 34–37 వారాల్లో పుట్టిన పిల్లలతో పోలిస్తే... 32 వారాలలోసే పుట్టిన పిల్లలకు ప్రీ–మెచ్యురిటీకి సంబంధించిన సమస్యలు ఎక్కువ. అయితే... ప్రీ–మెచ్యూరిటీకి సంబంధించిన అన్ని సమస్యలూ తప్పనిసరిగా ఒక బేబీలో ఉండితీరాలన్న నియమం లేదు. ఒక పాపకు ఒకటో, రెండో సమస్యలు ఉంటే... మరో చిన్నారిలో అన్ని సమస్యలూ ఉండవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే పాప ఎంత ప్రీ–మెచ్యూర్‌డ్‌గా పుడితే... సమస్యలు అంత ఎక్కువగా / అంత తీవ్రంగా ఉండే అవకాశాల ముప్పు (రిస్క్‌) పెరుగుతుంది.  


డాక్టర్‌ సునీతా నామ్‌దేవ్‌
సీనియర్‌ నియోనేటాలజిస్ట్‌ 

నిర్వహణ: యాసీన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement