రైతుబిడ్డకు స్వర్ణాభిషేకం | Gunjan Yadav has become India first female Youth Olympic boxing champion | Sakshi
Sakshi News home page

రైతుబిడ్డకు స్వర్ణాభిషేకం

Nov 15 2026 6:17 AM | Updated on Nov 15 2026 6:17 AM

Gunjan Yadav has become India first female Youth Olympic boxing champion

స్ఫూర్తి

‘బాక్సింగ్‌ రింగ్‌లోకి అడుగు పెట్టడానికి ముందు మన పొలంలో కష్టపడి పనిచేయాలి’ కూతురు గుంజన్‌తో అన్నారు హరభగవాన్‌. పొలంలో కష్టపడి తానేమిటో నిరూపించుకుంది గుంజన్‌. ఆ తరువాత... పొలం పనుల్లోనే కాదు తనకు ఇష్టమైన బాక్సింగ్‌లోనూ తనను తాను నిరూపించుకుంది. తాజాగా డాకర్‌ యూత్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారత మహిళా బాక్సర్‌గా చరిత్ర సృష్టించింది గుంజన్‌ యాదవ్‌...

‘నేను, నా సొదరుడు గుంజన్‌ సంకల్పబలాన్ని పరీక్షించాలనుకున్నాం. ఆమె ఏమాత్రం సంకోచించకుండా పొలం పనుల్లో నిమగ్నమైంది. పనులన్నీ ఓపికగా పూర్తి చేసింది. గుంజన్‌ తన సంకల్పబలంతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుందని ఆరోజే అనుకున్నాను. యూత్‌ ఒలింపిక్‌ గేమ్స్‌ టైటిల్‌ గెలిచి ఈరోజు ఆమె అదే చేసింది’ అన్నారు గుంజన్‌ తండ్రి హరభగవాన్‌ ఆనందంగా.

కష్టం కాదు...ఎంతో ఇష్టం!
‘బాక్సింగ్‌ రింగ్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి దానిపై అంతకంతకూ ఇష్టం పెరుగుతూ పోయిందేకానీ తగ్గలేదు. అయితే బాక్సింగ్‌ అంటే ఆషామాషీ విషయం కాదని, చాలా కష్టపడాల్సి ఉంటుందనే విషయం అర్థమైంది. నేను బాక్సింగ్‌లో రాణించగలనని మా నాన్న దగ్గర నిరూపించుకోవాలనుకున్నాను. అలసిపోయినా దాన్ని బయటికి కనిపించనివ్వలేదు. ఎంత కష్టంగా అనిపించినా బాక్సింగ్‌ను మధ్యలోనే వదిలేయాలని నాకు ఎప్పుడూ అనిపించలేదు. ఎప్పుడూ నా లక్ష్యాన్ని గుర్తు తెచ్చుకునేదాన్ని’ అంటుంది గుంజన్‌.

నీరజ్‌ స్ఫూర్తితో...
టోక్యోలో బంగారు పతకం గెల్చుకున్న జావెలిన్‌ త్రో అథ్లెట్‌ నీరజ్‌ చోప్రాని చూసి స్ఫూర్తి పొందిన గుంజన్‌ ఆటల్లోకి అడుగు పెట్టాలనుకుంది. విషయాన్ని తల్లి సుమన్‌ చెవిలో వేసింది. ఆమె గ్రామంలో ట్యూషన్లు చెబుతుండేది. ‘చదువు మీద దృష్టి పెట్టు. ఆడపిల్లలకు ఆటలు ఎందుకు?’ అని ఆమె గద్దించి ఉంటే గుంజన్‌ యాదవ్‌ ప్రతిభ ప్రపంచానికి పరిచయం అయ్యేది కాదు. కూతురు కోరిక మన్నించి కుమారుడు, కుమార్తెతో కలిసి హిసార్‌(హరియాణ)కు వచ్చి ఇల్లు అద్దెకు తీసుకున్నారు సుమన్‌. ‘మా గుంజన్‌ చిన్నప్పటి నుంచి పట్టుదలగల అమ్మాయి. నీరజ్‌ చోప్రాలాగే ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తానని మాకు చెప్పింది. దీంతో మంజిత్‌ లోహాన్‌ బాక్సింగ్‌ అకాడమీలో శిక్షణ ఇప్పించాం’ అని గుర్తు తెచ్చుకున్నారు సుమన్‌.

సుమన్‌ హిసార్‌లోని ఒక స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నప్పటికీ ఆర్థిక కష్టాలు ఎప్పుడూ ఉండేవి. ‘ఇదంతా అవసరమా?’ అని మాత్రం ఆమె ఎప్పుడూ నిరాశపడలేదు. ‘నా కూతురికి ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యానికి అండగా ఉండాలి’ అనుకున్నారు. ‘చాలా సందర్భాలలో మేము కిసాన్‌ క్రెడిట్‌ కార్డు, స్థానిక కమీషన్‌ ఏజెంట్‌ల దగ్గర అప్పులు తీసుకునేవాళ్లం’ గతాన్ని గుర్తు తెచ్చుకున్నారు సుమన్‌.

తాజాగా....
సెమీ–ఫైనల్, ఫైనల్స్‌లో ప్రత్యర్థులను కలవర పెట్టడానికి తన శిష్యురాలు కుడి క్రాస్‌తో పాటు ఎడమ హుక్‌ను ఎలా ఉపయోగించిందో వివరించారు గుంజన్‌ కోచ్‌ వికాస్‌ లోహన్‌. ‘ఇంగ్లీష్‌ బాక్సర్‌కు బలమైన అప్పర్‌ లెఫ్ట్‌ పంచ్‌ ఉంది. గుంజన్‌ దానిని కుడి క్రాస్‌తో పాటు ఎడమ హుక్‌తో ఎదుర్కొంది. ఫైనల్‌లో అల్జీరియన్‌ ప్రత్యర్థి బెన్సాలాను అలానే ఎదుర్కొంటూ మొదటి రౌండ్‌ నుంచే బౌట్‌ను తన నియంత్రణలో ఉంచుకుంది’ అన్నారు వికాస్‌ లోహన్‌.

ఇది మీ కోసమే!
గతంలో లిల్లీ బాసెట్‌ చేతిలో ఓడిపోయినప్పుడు రెండో, మూడో రౌండ్‌లు డిఫెన్స్‌విగా ఆడాను. ఈసారి నాపై ఒత్తిడి ఉన్నప్పటికీ కచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాను. లిల్లీ బాసెట్‌ కుడి చేయితో దాడులు మొదలు పెట్టింది. ఆమెను ఎదుర్కోవడానికి నేను రైట్‌క్రాస్, లెఫ్ట్‌ హుక్‌లపై ఆధారపడ్డాను. సెమీస్‌లో ఆమెను ఓడించడం  ఫైనల్లోకి వెళ్లడానికి శక్తి, ఉత్సాహాన్ని ఇచ్చాయి. అమ్మా, నాన్న, గురువుగారు(కోచ్‌) మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీ కోసమే బంగారు పతకాన్ని గెలిచాను.
– గుంజన్‌ యాదవ్‌

– యాకుబ్‌ పాషా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement